మహిళల యాషెస్ సిరీస్‌లో నిన్న (జులై 16) జరిగిన ఉత్కంఠ పోరులో ఆతిధ్య ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో వన్డేలో ఆసీస్ 3 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్ ఆధిక్యాన్ని 1-1కి తగ్గించిన ఆసీస్.. మరో మ్యాచ్ మిగిలుండగానే యాషెస్‌ను సొంతం చేసుకుంది.
మరో మ్యాచ్ ఉండగానే ఎలా..?
మల్టీ ఫార్మాట్ సిరీస్‌లో భాగంగా జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో గెలవడంతో 4 పాయింట్లు సాధించిన ఆసీస్, ఆతర్వాత జరిగిన టీ20 సిరీస్‌ను 1-2తో కోల్పోయినప్పటికీ, పాయింట్ల పరంగా (ఒక్కో గెలుపుకు 2 పాయింట్లు) అప్పటికీ ఆధిక్యంలోనే ఉండింది. అయితే తొలి వన్డేలో ఇంగ్లండ్ గెలవడంతో 6-6తో పాయింట్లు సమం అయ్యాయి. తాజాగా ఆసీస్ రెండో వన్డే గెలవడం ద్వారా ఇంగ్లండ్‌పై మళ్లీ ఆధిక్యత (8-6) సాధించింది. సిరీస్ డిసైడర్ అయిన మూడో టీ20లో ఒకవేళ ఇంగ్లండ్ గెలిచినా సిరీస్ 8-8తో సమం అవుతుంది. అప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆసీస్ యాషెస్‌ను నిలుపుకుంటుంది.
మ్యాచ్ విషయానికొస్తే.. తీవ్ర ఉత్కంఠ రేపిన రెండో వన్డేలో ఇంగ్లండ్‌పై ఆసీస్ పైచేయి సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేయగా.. ఆతర్వాత బరిలోకి దిగిన ఇంగ్లండ్ అద్భుతంగా పోరాడినప్పటికీ గెలవలేకపోయింది.
బ్రంట్ వీరోచిత శతకం వృధా..
283 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను నాట్ సీవర్ బ్రంట్ (99 బంతుల్లో 111 నాటౌట్; 10 ఫోర్లు) గెలిపించేందుకు విఫలయత్నం చేసింది. సీవర్‌కు ట్యామీ బేమౌంట్ (60), యామీ జోన్స్ (37), సారా గ్లెన్ (22 నాటౌట్) సహకరించినా ఫలితం లేకుండా పోయింది. ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 279 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ఆసీస్ 3 పరుగుల తేడాతో గెలుపొందింది. మ్యాచ్ గెలవాలంటే ఇంగ్లండ్ ఆఖరి ఓవర్లో 15 పరుగులు చేయాల్సి రాగా.. 11 పరుగులే చేయడంతో ఓటమిపాలైంది. టీ20 సిరీస్ డిసైడర్ రేపు (జులై 18) జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment