ఆసీస్‌దే యాషెస్‌ | With Their Victory In First T20I, Australia Women Retained The Ashes | Sakshi
Sakshi News home page

ఆసీస్‌దే యాషెస్‌

Published Tue, Jan 21 2025 11:30 AM | Last Updated on Tue, Jan 21 2025 11:40 AM

With Their Victory In First T20I, Australia Women Retained The Ashes

మహిళల యాషెస్‌ సిరీస్‌ను ఆస్ట్రేలియా తిరిగి సొంతం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నిన్న (జనవరి 20) జరిగిన తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ 57 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో ఆసీస్‌ మరో రెండు టీ20లు, ఓ టెస్ట్‌ మ్యాచ్‌ మిగిలుండగానే 8-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

మూడు వన్డేలు, మూడు టీ20లు, ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ కలిగిన మల్టీ ఫార్మాట్‌ యాషెస్‌ సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌ మహిళల క్రికెట్‌ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలుత జరిగిన వన్డే సిరీస్‌ను ఆసీస్‌ 3-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేసింది. నిన్న జరిగిన తొలి టీ20లోనూ ఆసీస్‌ విజయం సాధించింది. తద్వారా ఆసీస్‌ ఖాతాలో 8 పాయింట్లు (ఒక్కో గెలుపుకు రెండు పాయింట్లు) చేరాయి.

ఈ సిరీస్‌లో ఇంకా రెండు టీ20లు, ఓ టెస్ట్‌ మ్యాచ్‌ మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ గెలిచినా ఇంగ్లండ్‌ కనీసం సిరీస్‌ను సమం కూడా చేసుకోలేదు. తదుపరి మ్యాచ్‌లన్నీ గెలిస్తే ఇంగ్లండ్‌ ఖాతాలో 6 పాయిం​ట్లు మాత్రమే ఉంటాయి.

తొలి టీ20 విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 198 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్‌ బెత్‌ మూనీ (51 బంతుల్లో 75; 11 ఫోర్లు) మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటింది. మరో ఓపెనర్‌ జార్జియా వాల్‌ (21), ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌ (25), కెప్టెన్‌ తహిల మెక్‌గ్రాత్‌ (26) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. స్టార్‌ ప్లేయర్‌ ఎల్లిస్‌ పెర్రీ (7), అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌ (3) తక్కుక స్కోర్లకే పెవిలియన్‌కు చేరగా.. గ్రేస్‌ హ్యారిస్‌ 8 బంతుల్లో 14, జార్జియా వేర్హమ్‌ 10 బంతుల్లో 11 (నాటౌట్‌) పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్‌, లారెన్‌ బెల్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఫ్రేయా కెంప్‌, చార్లీ డీన్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

199 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. ఆసీస్‌ బౌలర్లు మూకుమ్మడిగా దాడి చేయడంతో 16 ఓవర్లలో 141 పరుగులకే టపా కట్టేసింది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో సోఫీ డంక్లీ (59) ఒక్కరే హాఫ్‌ సెంచరీతో రాణించగా.. మిగతా వారంతా దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో ఏకంగా నలుగురు డకౌట్లయ్యారు. నాట్‌ సీవర్‌ బ్రంట్‌ (20), కెప్టెన్‌ హీథర్‌ నైట్‌ (18), ఆమీ జోన్స్‌ (12), సోఫీ ఎక్లెస్టోన్‌ (13), ఫ్రేయా కెంప్‌ (11 నాటౌట్‌) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్‌ బౌలర్లలో జార్జియా వేర్హమ్‌ 3 వికెట్లు పడగొట్టగా.. అలానా కింగ్‌ 2, మెగాన్‌ షట్‌, కిమ్‌ గార్త్‌, సదర్‌ల్యాండ్‌, తహిల మెక్‌గ్రాత్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

కాగా, ఈ మ్యాచ్‌కు ఆసీస్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ ఆలైస్సా హీలీ దూరమైంది. గాయం కారణంగా ఆమె ఈ మ్యాచ్‌లో ఆడలేదు. హీలీ​ స్థానంలో తహిల మెక్‌గ్రాత్‌ ఆసీస్‌కు సారథ్యం వహించింది. హీలీ తదుపరి సిరీస్‌లో కొనసాగడం కూడా అనుమానమే అని తెలుస్తుంది. ఈ సిరీస్‌లో రెండో టీ20 జనవరి 23న కాన్‌బెర్రాలో జరుగనుంది. అనంతరం జనవరి 25న మూడో టీ20 అడిలైడ్‌లో.. ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ జనవరి 30 నుంచి ఫిబ్రవరి 2 వరకు మెల్‌బోర్న్‌లో జరుగనున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement