
Photo Courtesy: BCCI/IPL
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఎట్టకేలకు సొంతగడ్డపై విజయం సాధించింది. ఐపీఎల్-2025 (IPL 2025)లో చిన్నస్వామి స్టేడియంలో గురువారం నాటి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌ను ఓడించింది. తద్వారా ఈ సీజన్‌లో హోం గ్రౌండ్‌లో తొలి గెలుపు నమోదు చేసి విమర్శలకు చెక్ పెట్టింది.
క్రెడిట్ మొత్తం వారికే
ఈ నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar) హర్షం వ్యక్తం చేశాడు. విజయానంతరం మాట్లాడుతూ.. ‘‘తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో మేము సత్ఫలితం రాబట్టాము. ఈరోజు వికెట్ కాస్త భిన్నంగా ఉంది. అయినా మా బౌలర్లు అద్భుతంగా రాణించారు.
ఈ గెలుపులో క్రెడిట్ మొత్తం వారికే దక్కుతుంది. పదో ఓవర్ తర్వాత వారు చూపిన తెగువ అద్భుతం. ఇక ప్రత్యర్థి జట్టు బ్యాటర్లు కూడా ఎంతో చక్కగా బ్యాటింగ్ చేశారు. వాళ్లకు కూడా క్రెడిట్ ఇవ్వాల్సిందే.
గొప్ప నాయకులు ఉన్నారు.. కానీ
మేము వికెట్ల వేటలో ఉన్న వేళ మా మనసు చెప్పినట్లు విన్నాను. పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేసినపుడే వికెట్లు కూడా తీయగలుగుతాం. జట్టులో ఎంతో మంది గొప్ప నాయకులు ఉన్నారు. వారిచ్చే సలహాలు, సూచనలు కూడా నన్ను నేను మెరుగుపరచుకునేందుకు దోహదం చేస్తాయి. అయితే, నా ప్రణాళికలకు అనుగుణంగానే నేను ముందుకు వెళ్తాను’’ అని రజత్ పాటిదార్ చెప్పుకొచ్చాడు.
కోహ్లి, పడిక్కల్ ధనాధన్
కాగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో గురువారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 205 పరుగులు సాధించింది.
ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి (42 బంతుల్లో 70), దేవదత్ పడిక్కల్ (27 బంతుల్లో 50), టిమ్ డేవిడ్ (15 బంతుల్లో 23), జితేశ్ శర్మ (10 బంతుల్లో 20 నాటౌట్) రాణించారు. ఇక లక్ష్య ఛేదనలో రాజస్తాన్‌కు శుభారంభం లభించింది.
జైసూ విధ్వంసం
ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 19 బంతుల్లోనే 49 పరుగులతో దుమ్ములేపాడు. అయితే, జైసూ అవుటైన తర్వాత సీన్ మారిపోయింది. అంతకుముందు.. మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 16 పరుగులకే నిష్క్రమించగా.. నితీశ్ రాణా(28), కెప్టెన్ రియాన్ పరాగ్ (22) నిరాశపరిచారు.
చెలరేగిన హాజిల్‌వుడ్
ఆఖర్లో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (34 బంతుల్లో 47) విజయంపై ఆశలు పెంచాడు. అయితే, 20 ఓవర్లు ముగిసేసరికి తొమ్మిది వికెట్లు నష్టపోయిన రాజస్తాన్ 194 పరుగుల వద్ద నిలిచిపోయింది.
ఫలితంగా 11 పరుగుల తేడాతో ఆర్సీబీ చేతిలో ఓటమిపాలైంది. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్ నాలుగు వికెట్ల(4/33) చెలరేగగా.. కృనాల్ పాండ్యా రెండు, భువనేశ్వర్‌కుమార్, యశ్ దయాళ్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
ఇక ఈ సీజన్‌లో ఆర్సీబీకి ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో ఇది ఆరో విజయం. ఈ నేపథ్యంలో పన్నెండు పాయింట్లతో పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. మరోవైపు.. తొమ్మిదింట ఏడు ఓడిన రాజస్తాన్ నాలుగు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.
చదవండి: PSL: పాకిస్తాన్‌కు భారీ షాక్!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక..
𝙀𝙢𝙤𝙩𝙞𝙤𝙣𝙨 that speak louder than words 🥳#TATAIPL | #RCBvRR | @imVkohli | @RCBTweets pic.twitter.com/Q4B09fkllE
— IndianPremierLeague (@IPL) April 24, 2025