మహిళల యాషెస్ సిరీస్-2025లో ఆస్ట్రేలియా మరో విజయం సాధించింది. మల్టీ ఫార్మాట్‌లో జరుగుతున్న ఈ సిరీస్‌ను ఆసీస్ ఇదివరకే కైవసం చేసుకుంది. ఇవాళ (జనవరి 23) జరిగిన రెండో టీ20లో ఆసీస్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 6 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఓపెనర్ బెత్ మూనీ (44), కెప్టెన్ తహ్లియా మెక్‌గ్రాత్ (48 నాటౌట్), గ్రేస్ హ్యారిస్ (35 నాటౌట్) రాణించారు. జార్జియా వాల్ (5), ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (17), ఎల్లిస్ పెర్రీ (2), అన్నాబెల్ సదర్‌ల్యాండ్ (18) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో చార్లీ డీన్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఫ్రేయా కెంప్, సోఫీ ఎక్లెస్టోన్ తలో వికెట్ దక్కించుకున్నారు.
ఛేదనకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. ఆ జట్టు 19.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుండింది. ఈ దశలో వర్షం ఎడతెరిపిలేకుండా కురువడంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్దతిన ఆసీస్‌ను విజేతగా ప్రకటించారు.
డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 19.1 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ టార్గెట్ 175గా ఉండింది. అయితే ఈ సమయానికి ఇంగ్లండ్ లక్ష్యానికి 7 పరుగుల దూరం ఉండింది. ఏ మాత్రం ఆశలు లేని మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు నిలదొక్కుకున్నారు.
డేనియెల్ వ్యాట్ హాడ్జ్ (52), సోఫీ డంక్లీ (32), నాట్ సీవర్ బ్రంట్ (22), కెప్టెన్ హీథర్ నైట్ (43 నాటౌట్) ఇంగ్లండ్‌కు గెలుపుపై ఆశలు చిగురించేలా చేశారు. అయితే ఇంగ్లండ్ ఆశలపై వర్షం నీళ్లు చల్లింది. 5 బంతుల్లో 18 పరుగులు చేయాల్సి తరుణంలో మ్యాచ్ నిలిచిపోయింది. ఒకవేళ మ్యాచ్ కొనసాగినా ఇంగ్లండ్‌కు గెలుపు అంత ఈజీ కాదు. ఫామ్‌లో ఉన్న హీథర్ నైట్ క్రీజ్‌లో ఉండటంతో ఆ జట్టు గెలుపుపై ఆశలు పెట్టుకుని ఉండింది.
కాగా, మూడు వన్డేలు, మూడు టీ20లు, ఏకైక టెస్ట్ మ్యాచ్ కలిగిన మల్టీ ఫార్మాట్ యాషెస్ సిరీస్ కోసం ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలుత జరిగిన వన్డే సిరీస్‌ను ఆసీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కూడా ఆసీస్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. రెండో టీ20లో గెలుపుతో ఆసీస్ ఖాతాలో 10 పాయింట్లు (ఒక్కో గెలుపుకు రెండు పాయింట్లు) చేరాయి.
ఈ సిరీస్‌లో ఇంకా ఓ టీ20, ఓ టెస్ట్ మ్యాచ్ మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ గెలిచినా ఇంగ్లండ్ కనీసం సిరీస్‌ను సమం కూడా చేసుకోలేదు. తదుపరి రెండు మ్యాచ్‌లు గెలిస్తే ఇంగ్లండ్ ఖాతాలో 4 పాయింట్లు మాత్రమే ఉంటాయి.
ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరిగే ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం 13 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టుకు అలైసా హీలీ సారధిగా వ్యవహరించనుంది. గాయం కారణంగా హీలీ టీ20 సిరీస్‌లో ఆడలేదు. టెస్ట్ మ్యాచ్ సమయానికంతా హీలీ కోలుకుంటుందని ఆసీస్ మీడియా వెల్లడించింది.
అయితే టెస్ట్ మ్యాచ్‌లో హీలీ కేవలం బ్యాటర్‌గానే కొనసాగుతుందని పేర్కొంది. పింక్ బాల్‌తో డే అండ్ నైట్ ఫార్మాట్‌లో జరిగే టెస్ట్ మ్యాచ్ జనవరి 30 నుంచి ఫిబ్రవరి 2 వరకు మెల్‌బోర్న్‌లో జరుగనుంది. దీనికి ముందు జనవరి 25న మూడో టీ20 జరుగనుంది.
ఇంగ్లండ్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా జట్టు..
అలైసా హీలీ (కెప్టెన్), డార్సీ బ్రౌన్, ఆష్లే గార్డ్‌నర్, కిమ్ గార్త్, అలానా కింగ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, తహ్లియా మెక్‌గ్రాత్ (వైస్ కెప్టెన్), బెత్ మూనీ (వికెట్‌కీపర్), ఎల్లీస్ పెర్రీ, మెగాన్ షుట్, అన్నాబెల్ సదర్లాండ్, జార్జియా వోల్, జార్జియా వేర్‌హామ్
Comments
Please login to add a commentAdd a comment