
AUS Vs PAK 2nd Test: డీఆర్ఎస్ విషయంలో ప్రత్యర్ధి బ్యాటర్ అభిప్రాయాన్ని కోరిన విచిత్ర ఘటన పాకిస్థాన్-ఆస్ట్రేలియా జట్ల మధ్య కరాచీ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తొలి రోజు ఆటలో భాగంగా ఆసీస్ తొలి ఇన్నింగ్స్ సాగుతుండగా (ఇన్నింగ్స్ 70.3వ ఓవర్) స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చేస్తున్నాడు. పాక్ స్పిన్నర్ నౌమన్ అలీ వేసిన బంతి స్టీవ్ స్మిత్ ప్యాడ్‌కు తాకడంతో పాక్ ఆటగాళ్లంతా ఎల్బీ కోసం అప్పీల్ చేశారు. అయితే అంపైర్ ఆ అప్పీల్‌ను తిరస్కరించి నాటౌట్ అని తల ఊపాడు.
To DRS or not to DRS 🤔 #BoysReadyHain l #PAKvAUS pic.twitter.com/X3b9mp8uaF
— Pakistan Cricket (@TheRealPCB) March 12, 2022
దీంతో నౌమన్ అలీ అక్కడే స్లిప్‌లో ఉన్న సారథి బాబర్ ఆజమ్, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌ల వైపు చూస్తూ డీఆర్ఎస్ విషయంలో వారి అభిప్రాయాన్ని కోరాడు. ఈ క్రమంలో రిజ్వాన్.. క్రీజ్‌లో ఉన్న స్మిత్ వద్దకు వెళ్లి, అతడి భుజంపై చేయి వేసి.. ‘నువ్వే చెప్పు బ్రో.. డీఆర్ఎస్‌కు వెళ్లమంటావా..? వద్దా..? అని ఫన్నీగా అడిగాడు. ఎవరి ఔట్ కోసం అప్పీల్ చేశారో ఆ ఆటగాడి అభిప్రాయాన్నే రిజ్వాన్ కోరడంతో పాక్ ఆటగాళ్లంతా ఒక్కసారిగా పగలబడి నవ్వుకున్నారు. ఆఖరికి స్మిత్ కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు. ఫైనల్‌గా స్మిత్ తో చర్చించాక రిజ్వాన్ డీఆర్ఎస్ వద్దని అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (127; 13 ఫోర్లు, సిక్స్) అజేయ శతకంతో చెలరేగగా, స్టీవ్ స్మిత్ (72) అర్ధ సెంచరీతో రాణించాడు. మిగిలిన బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ (48 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించగా, లబూషేన్ డకౌటయ్యాడు. పాక్ బౌలర్లలో హసన్ అలీ, ఫహీమ్ అష్రఫ్ తలో వికెట్ దక్కించుకోగా, లబుషేన్ రనౌటయ్యాడు. తొలి టెస్ట్‌లో 3 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్న ఖ్వాజా, ఈ మ్యాచ్‌లో పట్టుదలగా ఆడి కెరీర్‌లో పదో శతకాన్ని నమోదు చేశాడు.
చదవండి: మాతృదేశంపై సెంచరీ.. ఆసీస్ బ్యాటర్ అరుదైన ఘనత