Aus Vs Pak: రిజ్వాన్‌ అవుటా? నాటౌటా?.. వీడియో వైరల్‌ | Aus Vs Pak 2nd Test: Mohammad Rizwan Furious With Third Umpire For Giving Him Out, Video Goes Viral - Sakshi
Sakshi News home page

AUS Vs PAK 2nd Test: నేను అవుటా? ఎలా?.. అంపైర్‌ నిర్ణయంపై మండిపడ్డ రిజ్వాన్‌.. వీడియో

Published Fri, Dec 29 2023 4:59 PM | Last Updated on Fri, Dec 29 2023 5:48 PM

Aus Vs Pak 2nd Test:  Mohammad Rizwan Furious With Third Umpire Giving Him Out - Sakshi

రిజ్వాన్‌ అవుటా? నాటౌటా? (PC: Cricket Australia/Screengrab)

Australia vs Pakistan, 2nd Test: ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో పాకిస్తాన్‌ బ్యాటర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ అవుటైన తీరు నెట్టింట చర్చకు దారితీసింది. ఈ అంశంపై క్రికెట్‌ అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పర విరుద్ధ కామెంట్లతో ట్రోలింగ్ చేస్తున్నారు. బాక్సింగ్‌ డే టెస్టులో పాకిస్తాన్‌ ఆసీస్‌ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే.

మెల్‌బోర్న్‌ వేదికగా మంగళవారం మొదలైన మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న షాన్‌ మసూద్‌ బృందం.. ఆతిథ్య ఆసీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 318 పరుగులకు ఆలౌట్‌ చేసింది. అయితే, కంగారూ బౌలర్ల ధాటికి తాళలేక 264 పరుగులకే తమ మొదటి ఇన్నింగ్స్‌ను ముగించింది.

ఈ క్రమంలో 54 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన ఆసీస్‌.. మరో 262 పరుగులు జతచేసి ఆలౌట్‌ అయింది. దీంతో పాక్‌ విజయ లక్ష్యం 317గా మారింది. అయితే, టార్గెట్‌ ఛేదనకై బరిలోకి దిగిన పాకిస్తాన్‌కు ఆదిలోనే షాకిచ్చార్లు ఆసీస్‌ పేసర్లు.

ఓపెనర్లు.. అబ్దుల్లా షఫీక్‌ను 4 పరుగుల వద్ద స్టార్క్‌ పెవిలియన్‌కు పంపగా.. 12 పరుగులతో ఆడుతున్న ఇమామ్‌ ఉల్‌ హక్‌ను కమిన్స్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ షాన్‌ మసూద్‌ 60 పరుగులు చేసి అవుట్‌ కాగా.. బాబర్‌ ఆజం 41, సౌద్‌ షకీల్‌ 24 పరుగులతో పర్వాలేదనిపించారు.

రిజ్వాన్‌పై ఆశలు పెట్టుకున్న పాకిస్తాన్‌
ఈ క్రమంలో వికెట్‌ కీపర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌పై ఆశలు పెట్టుకున్న పాకిస్తాన్‌ను ఆసీస్‌ సారథి ప్యాట్‌ కమిన్స్‌ మరోసారి దెబ్బకొట్టాడు. పాక్‌ రెండో ఇన్నింగ్స్‌ సందర్భంగా 61వ ఓవర్‌ వేసిన కమిన్స్‌ బౌలింగ్‌లో బంతి రిజ్వాన్‌ రిస్ట్‌బ్యాండ్‌ను తాకి కీపర్‌ చేతుల్లో పడినట్లు కనిపించింది.

రివ్యూకు వెళ్లిన కమిన్స్‌
దీంతో కమిన్స్‌ గట్టిగా అప్పీలు చేయగా.. ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్‌ నాటౌట్‌ ఇచ్చాడు. అయితే, కమిన్స్‌ మాత్రం అంపైర్‌ నిర్ణయాన్ని చాలెంజ్‌ తీస్తూ డీఆర్‌ఎస్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో థర్డ్‌ అంపైర్‌.. నిశితంగా పరిశీలించిన తర్వాత.. ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయాన్ని తారుమారు చేసి.. రిజ్వాన్‌ను అవుట్‌గా ప్రకటించాడు. 

దీంతో ఆసీస్‌ శిబిరంలో సంబరాలు మొదలుకాగా.. రిజ్వాన్‌ తనకు అన్యాయం జరిగిందన్నట్లుగా మైదానంలోనే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ అంపైర్‌ వద్దకు దూసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

రిజ్వాన్‌ అవుటా? నాటౌటా? అంటూ చర్చలు
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు అంపైర్‌ను ఒత్తిడిలోకి నెట్టి తమకు అనుకూలంగా ఫలితం వచ్చేలా చేశారని.. బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద రిజ్వాన్‌ను నాటౌట్‌గా ప్రకటించాల్సిందని పాక్‌ ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు.

మరికొందరేమో.. బంతి బ్యాటర్‌ గ్లోవ్స్‌ను తాకి కీపర్‌ చేతుల్లో పడితే నిబంధనల ప్రకారం అవుట్‌ ఇవ్వడం సరైందేనని.. ఇక్కడ రిస్ట్‌బ్యాండ్‌ కూడా గ్లోవ్‌ను అంటి ఉందనే విషయాన్ని గమనించాలని హితవు పలుకుతున్నారు. కాగా రిజ్వాన్‌(35 పరుగులు) రూపంలో కమిన్స్‌ 250వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

కాగా ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 79 పరుగుల తేడాతో ఓడిపోయి సిరీస్‌ను మరోసారి ఆతిథ్య ఆసీస్‌కు సమర్పించుకుంది. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో టెస్టు బుధవారం నుంచి మొదలుకానుంది.

చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. 146 ఏళ్ల క్రికెట్‌ హిస్టరీలోనే తొలి ఆటగాడిగా! 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement