![All That Talent: Iceland Cricket Trolls Pak Mohammad Hafeez As He Misses Flight - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/2/hafeez.jpg.webp?itok=JBKseTgB)
Australia vs Pakistan, 3rd Test: పాకిస్తాన్ క్రికెట్ జట్టు డైరెక్టర్ మహ్మద్ హఫీజ్‌ను ఐస్‌లాండ్ క్రికెట్ మరోసారి ట్రోల్ చేసింది. ఆస్ట్రేలియా జట్టు మాత్రమే కాదు.. ఆస్ట్రేలియన్ ఎయిర్‌లైన్స్ కూడా హఫీజ్‌ను ఇబ్బంది పెడుతున్నాయంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. కాగా పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.
మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు అక్కడికి వెళ్లిన షాన్ మసూద్ బృందం.. తొలి రెండింటిలో ఓడిపోయింది. పెర్త్‌లో ఏకంగా 360 పరుగుల భారీ తేడాతో ఓడిన పాక్.. మెల్‌బోర్న్ టెస్టులో పోరాడగలిగింది. అయితే, ఈ మ్యాచ్‌లో మహ్మద్ రిజ్వాన్ అవుటైన తీరుపై పాక్ బృందం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
రిజ్వాన్ అవుటైన తీరుపై రచ్చ
ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో బంతి రిజ్వాన్ రిస్ట్‌బ్యాండ్‌ను తాకినట్లుగా కనిపించడంతో అతడు అప్పీలు చేయగా.. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. అయితే, కాన్ఫిడెంట్‌గా ఉన్న కమిన్స్ రివ్యూకు వెళ్లగా థర్డ్ అంపైర్ రిజ్వాన్ అవుటైనట్లు ప్రకటించాడు. దీంతో ఆసీస్ శిబిరంలో సంబరాలు మొదలుకాగా.. పాకిస్తాన్ కీలక సమయంలో కీలక వికెట్ కోల్పోయి 79 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ఈ విషయంపై స్పందిస్తూ.. సాంకేతిక లోపాలు, అంపైర్ల తప్పిదాల వల్లే తాము ఓడిపోయామంటూ పాక్ మాజీ క్రికెటర్, జట్టు డైరెక్టర్ మహ్మద్ హఫీజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. నిజానికి మెల్‌బోర్న్‌లో తాము ఆస్ట్రేలియా కంటే మెరుగైన ప్రదర్శన ఇచ్చామంటూ ప్రత్యర్థి జట్టు ఆట తీరును విమర్శించాడు.
అప్పుడు ఆస్ట్రేలియా జట్టు.. ఇప్పుడు ఆసీస్ ఎయిర్‌లైన్స్
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఐస్‌లాండ్ క్రికెట్ హఫీజ్‌పై సెటైరికల్ ట్వీట్ చేసింది. పాకిస్తాన్ అత్యంత ప్రతిభావంతమైన జట్టు అయినందుకే.. ఆస్ట్రేలియా గడ్డ మీద వరుసగా 16 టెస్టులు ఓడిపోయిందా అని ఎక్స్ వేదికగా ఎద్దేవా చేసింది.
తాజాగా సిడ్నీ టెస్టు కోసం.. మహ్మద్ హఫీజ్ తాను ఎక్కాల్సిన విమానం మిస్ కావడంతో మరోసారి ట్రోల్ చేసింది. ‘‘అయ్యో అందరూ ప్రతిభావంతులే ఉన్న జట్టు అది. కానీ ఇప్పుడు ఆస్ట్రేలియా ఎయిర్‌లైన్స్ కూడా అతడిని వదిలేసి వెళ్లిందా?’’ అని సెటైర్ వేసింది.
సిరీస్ సమర్పయామి.. ఆఖరి టెస్టులో ఆఫ్రిది లేకుండానే
కాగా ఇప్పటికే 2-0తో టెస్టు సిరీస్‌ను ఆతిథ్య ఆస్ట్రేలియాకు సమర్పించుకున్న పాకిస్తాన్.. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరుగనున్న మూడో మ్యాచ్‌కు సన్నద్ధమవుతోంది. బుధవారం నుంచి ఆరంభం కానున్న ఈ టెస్టుకు ఎంపిక చేసిన పాక్ జట్టులో షాహిన్ ఆఫ్రిదికి చోటు దక్కలేదు.
పనిభారాన్ని తగ్గించుకునే క్రమంలో అతడికి విశ్రాంతినిచ్చిన పీసీబీ.. సయీమ్ ఆయుబ్‌తో అరంగేట్రం చేయించేందుకు సిద్ధమైంది. ఇక మ్యాచ్ కోసం మెల్‌బోర్న్ నుంచి సిడ్నీకి విమానంలో వెళ్లాల్సి ఉండగా.. మహ్మద్ హఫీజ్ ఎయిర్‌పోర్టుకు ఆలస్యంగా రావడంతో ఫ్లైట్ మిస్సయ్యాడు.
చదవండి: Aus Vs Pak: నా రికార్డు బ్రేక్ చేసే సత్తా అతడికే ఉంది: ఆసీస్ దిగ్గజ బౌలర్
All that talent, and now even the Aussie airlines are out to get him! https://t.co/gtF1rXqOit
— Iceland Cricket (@icelandcricket) January 1, 2024
Comments
Please login to add a commentAdd a comment