Aus Vs Pak: అంతిమ విజయం మాదే.. హఫీజ్‌కు కమిన్స్‌ కౌంటర్‌ | Pat Cummins Responds To Mohammad Hafeez Claims After AUS Vs PAK 2nd Test, Says I Am Glad We Got The Win- Sakshi
Sakshi News home page

Aus Vs Pak 2nd Test: అంతిమ విజయం మాదే.. హఫీజ్‌కు కౌంటర్‌ ఇచ్చిన కమిన్స్‌!

Published Fri, Dec 29 2023 9:33 PM | Last Updated on Sat, Dec 30 2023 11:41 AM

Glad We Got Win: Cummins Responds to Mohammad Hafeez Claims - Sakshi

పాకిస్తాన్‌ క్రికెట్‌ డైరెక్టర్‌ మహ్మద్‌ హఫీజ్‌ వ్యాఖ్యలకు ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ కౌంటర్‌ ఇచ్చాడు. అత్యుత్తంగా ఆడిన జట్టుకే అంతిమంగా విజయం లభిస్తుందని.. తాము విమర్శలను పెద్దగా పట్టించుకోమంటూ చురకలు అంటించాడు.

పాకిస్తాన్‌తో రెండో టెస్టులోనూ ఆస్ట్రేలియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. బాక్సింగ్‌ డే టెస్టును నాలుగు రోజుల్లోనే ముగించి.. 79 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్‌ కైవసం చేసుకుంది.

అయితే, మెల్‌బోర్న్‌లో జరిగిన ఈ టెస్టులో పాక్‌ ఓటమి అనంతరం ఆ జట్టు డైరెక్టర్‌ మహ్మద్‌ హఫీజ్‌ స్పందిస్తూ.. ఆస్ట్రేలియా ఆట తీరును విమర్శించాడు. ‘‘జట్టుగా మేము కొన్ని తప్పిదాలు చేసిన మాట వాస్తవమే. కూర్చుని చర్చిస్తే వాటిని అధిగమించగలం.

కానీ.. మా ఓటమికి కేవలం మా ప్రదర్శన ఒక్కటే కారణం కాదు. అంపైరింగ్‌ తప్పిదాలు, సాంకేతిక లోపాల వల్ల కూడా మేము నష్టపోయాం’’ అని పేర్కొన్నాడు. మహ్మద్‌ రిజ్వాన్‌ అవుటైన తీరును ప్రస్తావిస్తూ.. ‘‘ఒకవేళ అలా గనుక జరిగి ఉండకపోతే ఫలితం వేరేలా ఉండేది.

కొన్నిసార్లు టెక్నాలజీ చేసే చమత్కారాలు మనుషులమైన మనం అర్థం చేసుకోలేం. ఒకవేళ బాల్‌ స్టంప్స్‌ను హిట్‌ చేస్తే కచ్చితంగా అది అవుటే కదా!అలాంటపుడు అంపైర్స్‌ కాల్‌తో పనేం ఉంటుంది? అయితే, కొన్నిసార్లు టెక్నాలజీ వల్ల మ్యాచ్‌లు చేజారిపోయే పరిస్థితులు కూడా వస్తాయి’’ అని మహ్మద్‌ హఫీజ్‌ పేర్కొన్నాడు.

రిజ్వాన్‌ అవుట్‌ విషయంలో తప్పు జరిగిందంటూ పరోక్షంగా థర్డ్‌ అంపైర్‌ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. ఈ నేపథ్యంలో విజయానంతరం మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా ఆసీస్‌ సారథి ప్యాట్‌ కమిన్స్‌కు హఫీజ్‌ వ్యాఖ్యల గురించి ప్రశ్న ఎదురైంది.

ఇందుకు బదులిస్తూ.. ‘‘కూల్‌.. వాళ్లు బాగానే ఆడారు. అయితే, మేము గెలిచాం. ఇప్పుడిక మాటలు అనవసరం. నిజంగా బాగా ఆడిన జట్టే కదా అంతిమంగా విజయం సాధిస్తుంది’’ అంటూ కమిన్స్‌.. హఫీజ్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

కాగా ఈ మ్యాచ్‌లో పది వికెట్లు పడగొట్టిన కమిన్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. కమిన్స్‌ బౌలింగ్‌లో రిజ్వాన్‌ రిస్ట్‌బ్యాండ్‌ను తాకిన బంతిని కీపర్‌ అలెక్స్‌ క్యారీ క్యాచ్‌ అందుకోగా.. ఫీల్డ్‌ అంపైర్‌ నాటౌట్‌ ఇచ్చాడు. అయితే, కమిన్స్‌ రివ్యూకు వెళ్లడంతో థర్డ్‌ అంపైర్‌ అతడిని అవుట్‌గా ప్రకటించాడు. ఈ నిర్ణయం తమ విజయావకాశాలపై ప్రభావం చూపిందని హఫీజ్‌ వ్యాఖ్యానించగా.. కమిన్స్‌ ఇలా కౌంటర్‌ వేశాడు.

చదవండి: Ind A Vs SA A: ఐదు వికెట్లు తీసిన ఆవేశ్‌.. తిలక్‌, అక్షర్‌ అర్ధ శతకాలు! టాప్‌ స్కోరర్‌ అతడే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement