ఆస్ట్రేలియా పర్యటనను పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఓటమితో ఆరంభించింది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో రెండు వికెట్ల తేడాతో పాక్ పరాజయం పాలైంది. పాక్ పేసర్లు అద్భుతంగా పోరాడినప్పటకి విజయం మాత్రం వరించలేదు.
తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు కేవలం 202 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టగా, కమ్మిన్స్, జంపా తలా రెండు వికెట్లు సాధించి పాక్‌ను దెబ్బతీశారు. అనంతరం స్వల్ప లక్ష్య చేధనలో ఆసీస్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత స్టీవ్ స్మిత్(44), ఇంగ్లీష్(49) నిలకడగా ఆడటంతో ఆసీస్ సునాయసంగా లక్ష్యాన్ని చేధిస్తుందని అంతా భావించారు.
కానీ పాక్ హ్యారీస్ రవూఫ్ మాత్రం మూడు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాను కష్టాల్లోకి నెట్టేశాడు. ఒక్కసారిగా పాక్ జట్టు మ్యాచ్‌ను తమవైపు మలుపు తిప్పుకుంది. అయితే ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(32 నాటౌట్) ఆఖరివరకు క్రీజులో నిలుచోని తమ జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు. ఇక ఈ ఓటమిపై పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ స్పందిచాడు. తమ జట్టు పేస్ బౌలర్లపై రిజ్వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు.
"ఈ ఓటమి మాకు ఎటువంటి నిరాశ కలిగించలేదు. ఎలాంటి పరిస్థితిలోనైనా ఆఖరి వరకు పోరాడాలని ముందే నిర్ణయించుకున్నాం. ఈ మ్యాచ్‌లో అదే చేశాము. చివర వరకు పోరాడి ఓడిపోయాం. ఫలితం ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు. ఈ మ్యాచ్‌లో మా జట్టు ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను.
మేము బ్యాటింగ్‌పై కాస్త దృష్టిపెట్టాలి. హ్యారీస్ రవూఫ్ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. మా నలుగురు పేసర్లు కూడా తమ పని తాము చేశారు. తర్వాతి మ్యాచ్‌లో కూడా నలుగురు పేసర్లతోనే ఆడనున్నాం. అదేవిధంగా ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు కాస్త ఆదృష్టం కలిసొచ్చింది అని పోస్ట్ మ్యాచ్‌ప్రేజేంటేషన్‌లో రిజ్వాన్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment