Aus vs Pak: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా | Aus vs Pak 1st ODI: Australia Beat Pakistan Creates History In ODI Victories | Sakshi
Sakshi News home page

Aus vs Pak: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా

Published Mon, Nov 4 2024 6:12 PM | Last Updated on Mon, Nov 4 2024 7:11 PM

Aus vs Pak 1st ODI: Australia Beat Pakistan Creates History In ODI Victories

పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా విజయంతో ఆరంభించింది. మెల్‌బోర్న్‌ వేదికగా సోమవారం జరిగిన తొలి మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో గెలిచింది. పాకిస్తాన్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసినా.. ఆసీస్‌ గెలుపు కోసం కష్టపడాల్సి వచ్చింది.

చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా
పాక్‌ విధించిన స్వల్ప లక్ష్యాన్ని(204) ఛేదించే క్రమంలో 167 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన దశలో ప్యాట్‌ కమిన్స్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. ఓవర్‌ ఓవర్‌కు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో ఆఖరి వరకు అజేయంగా జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక ఈ గెలుపుతో ఆసీస్‌ చరిత్ర సృష్టించింది.

వన్డే ఫార్మాట్లో పాకిస్తాన్‌తో ఆడిన తక్కువ మ్యాచ్‌లలోనే.. ఎక్కువ విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. ఓవరాల్‌గా ఇప్పటి వరకు పాక్‌తో 109 మ్యాచ్‌లు ఆడిన కంగారూ జట్టు 71 మ్యాచ్‌లలో జయభేరి మోగించింది. ఇక ఈ జాబితాలో వెస్టిండీస్‌ రెండోస్థానంలో ఉంది. ఆసీస్‌తో సమానంగా 71సార్లు పాక్‌పై గెలుపొందినప్పటికీ.. మ్యాచ్‌ల పరంగా ఆసీస్‌ కంటే వెనుకబడింది.

రిజ్వాన్‌కు కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ఓటమి
కాగా మూడు వన్డే, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడేందుకు పాకిస్తాన్‌ జట్టు ఆసీస్‌ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా సోమవారం(నవంబరు 4) ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరిగింది. పాక్‌ వన్డే, టీ20 జట్ల కెప్టెన్‌గా వికెట్‌ కీపర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌కు ఇదే తొలి మ్యాచ్‌.

ఇక మెల్‌బోర్న్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు తొలుత బౌలింగ్‌ చేసింది. మిచెల్‌ స్టార్క్‌ మూడు వికెట్లతో రాణించగా.. కమిన్స్‌ రెండు, ఆడం జంపా రెండు, లబుషేన్‌, సీన్‌ అబాట్‌ ఒక్కో వికెట్‌ తీశారు. ఈ క్రమంలో పాక్‌ 46.4 ఓవర్లలో కేవలం 203 పరుగులే చేసింది.

నసీం షా బ్యాట్‌ ఝులిపించినా
పాక్‌ ఇన్నింగ్స్‌లో రిజ్వాన్‌ 44 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. టెయిలెండర్‌ నసీం షా 40 రన్స్‌తో రాణించాడు. ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే తడబడ్డ ఆతిథ్య ఆసీస్‌ కమిన్స్‌ ఆఖరి వరకు పట్టుదలగా నిలబడంతో 33.3 ఓవర్లలో పనిపూర్తి చేసింది. 

పాక్‌పై రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది.  స్టార్క్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఓపెనర్లు షఫీక్‌(12), సయీమ్‌ ఆయుబ్‌(1) సహా 19 బంతుల్లోనే 24 రన్స్‌ చేసిన షాహిన్‌ ఆఫ్రిదిని అవుట్‌ చేసి పాక్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను అతడు దెబ్బకొట్టాడు. 

పాకిస్తాన్‌పై వన్డేల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్లు
ఆస్ట్రేలియా- 71 (109 మ్యాచ్‌లు)
వెస్టిండీస్‌- 71 (137 మ్యాచ్‌లు)
శ్రీలంక- 59 (157 మ్యాచ్‌లు)
ఇంగ్లండ్‌- 57 (92 మ్యాచ్‌లు)
ఇండియా- 57 (135 మ్యాచ్‌లు)

ఆసీస్‌ వర్సెస్‌ పాక్‌ తొలి వన్డే - ప్లేయింగ్‌ ఎలెవన్‌
ఆస్ట్రేలియా
మాథ్యూ షార్ట్, జేక్ ఫ్రేజర్-మెగర్క్, స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్‌వెల్‌, ఆరోన్ హార్డీ, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.

పాకిస్తాన్‌
అబ్దుల్లా షఫీక్, సయీమ్ అయూబ్, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్, వికెట్ కీపర్), కమ్రాన్ గులాం, ఆఘా సల్మాన్, ఇర్ఫాన్ ఖాన్, షాహిన్ అఫ్రిది, నసీం షా, హారిస్ రవూఫ్, మహ్మద్ హస్నైన్.

చదవండి: ICC: ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, జింబాబ్వేలకు భారత్‌ ఆతిథ్యం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement