Aus Vs Pak: 5 వికెట్లతో చెలరేగిన పాక్‌ పేసర్‌.. కుప్పకూలిన ఆసీస్‌! ఇమ్రాన్‌ రికార్డు బ్రేక్‌ | Aus vs Pak 2nd ODI: Haris Rauf 5 Wicket Haul Rips Aus 163 All Out Scripts History | Sakshi
Sakshi News home page

Aus Vs Pak: 5 వికెట్లతో చెలరేగిన పాక్‌ పేసర్‌.. కుప్పకూలిన ఆసీస్‌! ఇమ్రాన్‌ రికార్డు బ్రేక్‌

Published Fri, Nov 8 2024 12:22 PM | Last Updated on Fri, Nov 8 2024 1:15 PM

Aus vs Pak 2nd ODI: Haris Rauf 5 Wicket Haul Rips Aus 163 All Out Scripts History

ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో పాకిస్తాన్‌ బౌలర్లు అదరగొట్టారు. వరుస విరామాల్లో వికెట్లు తీసి కంగారూ జట్టును కోలుకోని దెబ్బకొట్టారు. పాక్‌ ప్రధాన పేసర్‌ షాహిన్‌ ఆఫ్రిది ఆసీస్‌ ఓపెనర్ల వికెట్లు తీసి శుభారంభం అందించగా.. మరో ఫాస్ట్‌ బౌలర్‌ హ్యారిస్‌ రవూఫ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

ఏకంగా ఐదు వికెట్లు కూల్చి ఆసీస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు. షాహిన్‌, రవూఫ్‌ దెబ్బకు కమిన్స్‌ బృందం కనీసం 200 పరుగుల మార్కు కూడా అందుకోలేకపోయింది. కాగా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు పాకిస్తాన్‌ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది.

ఇందులో భాగంగా మెల్‌బోర్న్‌ వేదికగా సోమవారం తొలి వన్డే జరుగగా.. ఆతిథ్య ఆసీస్‌ రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలో ఆసీస్‌- పాక్‌ మధ్య శుక్రవారం నాటి రెండో వన్డేకు అడిలైడ్‌ వేదికగా మారింది. 

టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. కెప్టెన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ నమ్మకాన్ని నిలబెడుతూ షాహిన్‌ ఆఫ్రిది ఆసీస్‌ ఓపెనర్లు మాథ్యూ షార్ట్‌(19), జేక్‌ ఫ్రేజర్‌ మెగర్క్‌(13)లను స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు పంపాడు.

ఐదు కీలక వికెట్లు అతడి సొంతం
వన్‌డౌన్‌లో వచ్చిన స్టీవ్‌ స్మిత్‌(35) క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేయగా.. హస్నైన్‌ అతడిని అవుట్‌ చేశాడు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన హ్యారిస్‌ రవూఫ్‌ జోస్‌ ఇంగ్లిస్‌(18), మార్నస్‌ లబుషేన్‌(6), ఆరోన్‌ హార్డీ(14), గ్లెన్‌ మాక్స్‌వెల్‌(16), ప్యాట్‌ కమిన్స్‌(13) రూపంలో ఐదు కీలక వికెట్లు దక్కించుకున్నాడు. 

 

మరోవైపు.. టెయిలెండర్లలో మిచెల్‌ స్టార్క్‌(1)ను షాహిన్‌ అవుట్‌ చేయగా.. ఆడం జంపా (18) కాసేపు పోరాడగా నసీం షా అతడిని బౌల్డ్‌ చేసి పని పూర్తి చేశాడు.

 

ఈ క్రమంలో 35 ఓవర్లకే ఆస్ట్రేలియా కథ ముగిసింది. కేవలం 163 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఇక ఆసీస్‌ విధించిన స్వల్ప లక్ష్యాన్ని పాకిస్తాన్‌ ఛేదిస్తుందా? లేదంటే తొలి వన్డే మాదిరి ఈసారీ మ్యాచ్‌ను చేజార్చుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఆసీస్‌తో రెండో వన్డేలో హ్యారిస్‌ రవూఫ్‌ ఐదు వికెట్లతో సత్తా చాటగా.. షాహిన్‌ ఆఫ్రిది మూడు, నసీం షా, మహ్మద్‌ హస్నైన్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

చరిత్ర సృష్టించిన హ్యారిస్‌ రవూఫ్‌.. పాక్‌ తరఫున తొలి పేసర్‌గా
ఆసీస్‌తో రెండో వన్డేలో ఐదు వికెట్లు పడగొట్టిన పాక్‌ బౌలర్‌ హ్యారిస్‌ రవూఫ్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అడిలైడ్‌లో వన్డేల్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన మొట్టమొదటి పాకిస్తాన్‌ పేసర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో పాక్‌ దిగ్గజ ఫాస్ట్‌ బౌలర్‌ వసీం అక్రం, ఇమ్రాన్‌ ఖాన్‌ పేరిట ఉన్న రికార్డును రవూఫ్‌ బద్దలు కొట్టాడు.

ఇక అడిలైడ్‌లో అంతకు ముందు స్పిన్నర్‌ సక్లెయిన్‌ ముస్తాక్‌ వన్డేల్లో ఐదు వికెట్లు ప్రదర్శన నమోదు చేశాడు. తద్వారా ఈ పాక్‌ తరఫున ఈ ఘనత నమోదు చేసిన మొదటి బౌలర్‌గా కొనసాగుతున్నాడు.

అడిలైడ్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన పాక్‌ బౌలర్లు
హ్యారిస్‌ రవూఫ్‌- 5/29*
సక్లెయిన్‌ ముస్తాక్‌- 5/29
ఇజాజ్‌  ఫాకిహ్‌- 4/43
ఇమ్రాన్‌ ఖాన్‌-3/19
షాహిన్‌ ఆఫ్రిది- 2/24.

చదవండి: రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టార్‌ క్రికెటర్‌..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement