CT 2025: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. తొలిసారిగా ఆ ఇద్దరు | Australia Announced ICC CT 2025 Squad, Pat Cummins Surprise To Lead, Check Names Inside | Sakshi
Sakshi News home page

CT 2025: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. తొలిసారిగా ఆ ఇద్దరు

Published Mon, Jan 13 2025 9:33 AM | Last Updated on Mon, Jan 13 2025 10:48 AM

Australia Announce ICC CT 2025 Squad Huge Pat Cummins Surprise To Lead

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)కి క్రికెట్‌ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. ఈ మెగా టోర్నీకి పదిహేను మంది సభ్యులతో కూడిన ప్రాథమిక జట్టును ఎంపిక చేసినట్లు సోమవారం వెల్లడించింది. అయితే, గాయం కారణంగా దూరమవుతాడనుకున్న ప్యాట్‌ కమిన్స్‌(Pat Cummins) సారథ్యంలోనే ఆస్ట్రేలియా ఈ ఈవెంట్లో పాల్గొననుంది.

తొలిసారిగా ఆ ఇద్దరికి చోటు
ఇక బ్యాటర్‌ మాథ్యూ షార్ట్‌తో పాటు ఆల్‌రౌండర్‌ ఆరోన్‌ హార్డీ(Aaron Hardie) తొలిసారిగా ఐసీసీ టోర్నమెంట్‌లో ఆడే అవకాశం దక్కించుకున్నారు. మరోవైపు.. బిగ్‌ బాష్‌ లీగ్‌లో భాగంగా పొట్టి ఫార్మాట్‌లో పరుగుల వరద పారించిన నాథన్‌ ఎల్లిస్‌ కూడా ఈ జట్టులో స్థానం సంపాదించాడు. ఇప్పటికే రిటైర్‌ అయిన డేవిడ్‌ వార్నర్‌, గాయం వల్ల జట్టుకు దూరమైన కామెరాన్‌ గ్రీన్‌, పేసర్‌ సీన్‌ అబాట్‌ స్థానాల్లో మాథ్యూ, హార్డీ, ఎల్లిస్‌ ఈ జట్టులోకి వచ్చారు.

మోకాలి గాయం
కాగా టీమిండియాతో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో ఆస్ట్రేలియా అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను కమిన్స్‌ బృందం 3-1తో గెలిచి పదేళ్ల తర్వాత ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే, ఈ మెగా సిరీస్‌ నేపథ్యంలో కెప్టెన్‌, స్టార్‌ పేసర్‌ కమిన్స్‌ గాయపడినట్లు వార్తలు వచ్చాయి.

శ్రీలంక పర్యటనలో భాగంగా రెండు టెస్టులు ఆడే జట్టుకు కమిన్స్‌దూరంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆసీస్‌ చీఫ్‌ సెలక్టర్‌ జార్జ్‌ బెయిలీ అతడి గాయాన్ని ధ్రువీకరిస్తూ మోకాలి నొప్పితో కమిన్స్‌ బాధపడుతున్నట్లు తెలిపాడు. దీంతో అతడు చాంపియన్స్‌ ట్రోఫీకి దూరం కానున్నాడనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, తాజా ప్రకటనతో అవన్నీ వట్టి వదంతులేనని తేలిపోయింది.

వన్డే ప్రపంచకప్‌-2023 విజేత
ఇదిలా ఉంటే.. భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌-2023లో ప్యాట్‌ కమిన్స్‌ ఆస్ట్రేలియాను చాంపియన్‌గా నిలిపిన విషయం తెలిసిందే. ఫైనల్లో టీమిండియాను ఓడించి.. కంగారూ జట్టుకు టైటిల్‌ అందించాడు.  ఈ క్రమంలో ఏకంగా ఆరోసారి వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన ఆస్ట్రేలియా.. మరో వన్డే మెగా టోర్నీ చాంపియన్స్‌ ట్రోఫీకి అర్హత సాధించింది.

వరల్డ్‌కప్‌ ఈవెంట్లో రన్నరప్‌గా నిలిచిన టీమిండియాతో పాటు సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, అఫ్గనిస్తాన్‌, ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్‌ కూడా ఈ టోర్నమెంట్లో ఆడేందుకు క్వాలిఫై అయ్యాయి. అయితే, 2017లో చాంపియన్స్‌ ట్రోఫీ విజేతగా నిలిచిన పాకిస్తాన్‌ ఆతిథ్య జట్టు హోదాలో నేరుగా ఈ ఐసీసీ ఈవెంట్లో అడుగుపెట్టింది.

గ్రూప్‌- ‘బి’లో
ఇదిలా ఉంటే.. వన్డే ఫార్మాట్‌లో జరిగే చాంపియన్స్‌ ట్రోఫీ ఆడేందుకు టీమిండియాను పాకిస్తాన్‌కు పంపేందుకు బీసీసీఐ నిరాకరించగా... దుబాయ్‌ వేదికగా రోహిత్‌ సేన తమ మ్యాచ్‌లు ఆడనుంది. ఇక ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానున్న ఈ టోర్నీలో ఆస్ట్రేలియా.. అఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్‌లతో కలిసి గ్రూప్‌-బిలో ఉంది. ఇక గ్రూప్‌-‘ఎ’లో భారత్‌తో పాటు న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, సౌతాఫ్రికా ఆడనున్నాయి.  కాగా ఆస్ట్రేలియా ఫిబ్రవరి 22న లాహోర్ వేదికగా తమ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది.

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025కి ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు
ప్యాట్‌ కమిన్స్‌(కెప్టెన్‌), అలెక్స్‌ క్యారీ, నాథన్‌ ఎల్లిస్‌, ఆరోన్‌ హార్డీ, జోష్‌ హాజిల్‌వుడ్‌, ట్రవిస్‌ హెడ్‌, జోష్‌ ఇంగ్లిస్‌, మార్నస్‌ లబుషేన్‌, మిచెల్‌ మార్ష్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మాథ్యూ షార్ట్‌, స్టీవ్‌ స్మిత్‌, మిచెల్‌ స్టార్క్‌, మార్కస్‌ స్టొయినిస్‌, ఆడం జంపా.

చదవండి: IPL 2025: కెప్టెన్‌ పేరును ప్రకటించిన పంజాబ్‌ కింగ్స్‌
చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల.. భారత్ మ్యాచ్‌లు ఎక్కడంటే?
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement