Australia vs Pakistan, 2nd Test : పాకిస్తాన్‌తో రెండో టెస్టులోనూ ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఆఖరి మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. బాబర్ ఆజం స్థానంలో టెస్టు జట్టు పగ్గాలు చేపట్టిన షాన్ మసూద్ సారథ్యంలో పాకిస్తాన్ తొలిసారి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది.
ఇందులో భాగంగా ఇరు జట్ల మధ్య డిసెంబరు 14న మొదలైన తొలి టెస్టులో ఆతిథ్య ఆసీస్ ఏకంగా 360 పరుగుల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. ఈ క్రమంలో రెండో టెస్టులోనైనా గెలిచి నిలవాలని పాక్ భావించింది.
బాక్సింగ్ డే టెస్టులో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో కంగారూ జట్టును 318 పరుగులకు కట్టడి చేయగలిగింది పాక్. కానీ బ్యాటర్ల వైఫల్యం కారణంగా 264 పరుగులకే షాన్ మసూద్ బృందం ఆలౌట్ కావడంతో.. ఆసీస్‌కు 54 పరుగుల ఆధిక్యం లభించింది.
ఈ నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు పాక్ ఆరంభంలోనే షాకిచ్చింది. పేసర్లు షాహిన్ ఆఫ్రిది, మీర్ హంజా దెబ్బకు టాపార్డర్ కుప్పకూలిపోయింది. 16 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆసీస్ ఇబ్బందుల్లో పడింది.
Mitch Marsh hangs on at third man! Whatta catch! #AUSvPAK pic.twitter.com/BFC1LBXjeK
— cricket.com.au (@cricketcomau) December 29, 2023
ఇలాంటి క్లిష్ట దశలో మిచెల్ మార్ష్ (96; 13 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (50; 3 ఫోర్లు) అర్ధ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు కలిసి ఐదో వికెట్‌కు 153 పరుగులు జోడించి ఆసీస్‌ను నిలబెట్టారు. ఈ క్రమంలో.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 62.3 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు చేసింది.
ఈ నేపథ్యంలో ఓవరాల్‌గా 241 పరుగుల ఆధిక్యంతో నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన ఆస్ట్రేలియా 262 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ ముగించింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌ను ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్ బెంబేలెత్తించాడు.
ఐదు వికెట్లతో చెలరేగి పాక్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. మరో పేసర్ మిచెల్ స్టార్క్ కూడా తనదైన శైలిలో రాణించడంతో పాకిస్తాన్ 237 పరుగులకే చాపచుట్టేసింది. షాన్ మసూద్ కెప్టెన్ ఇన్నింగ్స్(71 బంతుల్లో 60 పరుగులు), ఆగా సల్మాన్ అర్ధ శతకం(50)తో రాణించినా ఫలితం లేకుండా పోయింది.
79 పరుగుల తేడాతో ఆసీస్ చేతిలో ఓటమి పాలు కాగా నాలుగో రోజే ఆట ముగిసిపోయింది. ఇక పాక్ రెండో ఇన్నింగ్స్‌లో స్టార్క్ నాలుగు, జోష్ హాజిల్‌వుడ్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ప్యాట్ కమిన్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మధ్య నామమాత్రపు ఆఖరి టెస్టు బుధవారం (జనవరి 3) నుంచి ప్రారంభం కానుంది.
కాగా ఆస్ట్రేలియాలో పాక్ ఇంత వరకు ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ గెలవలేదన్న విషయం తెలిసిందే. 1995లో చివరగా కంగారూ గడ్డపై టెస్టు మ్యాచ్ గెలిచింది. తాజా పరాజయంతో 1999 పర్యటన నుంచి ఆ జట్టు వరుసగా 16 టెస్టుల్లో ఓడింది.
THE AUSSIES GET IT DONE! 🔥
— Fox Cricket (@FoxCricket) December 29, 2023
📺 Watch Day 4 #AUSvPAK on Fox Cricket and Kayo Sports: https://t.co/VNpf5Xojhg
✍ BLOG: https://t.co/physFvdl0W
🔢 MATCH CENTRE: https://t.co/v8I8vaM89H pic.twitter.com/D8dCwItqhb
Comments
Please login to add a commentAdd a comment