సమం చేస్తారా? | India VS New Zealand Second Test Starts On 28/02/2020 | Sakshi
Sakshi News home page

సమం చేస్తారా?

Published Fri, Feb 28 2020 1:03 AM | Last Updated on Fri, Feb 28 2020 5:22 AM

India VS New Zealand Second Test Starts On 28/02/2020 - Sakshi

విదేశీ గడ్డపై సిరీస్‌లో తొలి టెస్టు ఓడిన తర్వాత భారత జట్టు కోలుకొని మ్యాచ్‌ గెలుచుకోవడం, సిరీస్‌ను కాపాడుకోవడం చాలా అరుదు. ఇప్పుడు మరోసారి అదే స్థితిలో టీమిండియా నిలిచింది. తొలి టెస్టులో పది వికెట్ల భారీ పరాజయం తర్వాత ఇప్పుడు రెండో టెస్టును కచ్చితంగా నెగ్గాల్సిన ఒత్తిడిలో టీమిండియా బరిలోకి దిగుతోంది. మరో వైపు సొంతగడ్డపై అమితోత్సాహంతో ఉన్న న్యూజిలాండ్‌ తమ ప్రత్యర్థికి అలాంటి అవకాశం ఇస్తుందా చూడాలి.

క్రైస్ట్‌చర్చ్‌: న్యూజిలాండ్‌ పర్యటనలో భారత జట్టు తమ చివరి పోరుకు సన్నద్ధమైంది. ఇక్కడి హాగ్లీ ఓవల్‌ మైదానంలో రేపటి (శనివారం)నుంచి జరిగే రెండో టెస్టు మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. టి20 సిరీస్‌ను భారత్, వన్డే సిరీస్‌ను కివీస్‌ క్లీన్‌స్వీప్‌ చేయగా...టెస్టు సిరీస్‌లో ప్రస్తుతం 1–0తో ఆతిథ్య జట్టు ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో భారత్‌ చెలరేగి సిరీస్‌ను సమం చేస్తుందా, లేక విలియమ్సన్‌ సేన తమ జోరును కొనసాగించి మ్యాచ్‌ను గెలుచుకుంటుందా అనేది ఆసక్తికరం.

పృథ్వీ అవుట్‌! 
తొలి టెస్టులో భారత్‌ ప్రదర్శనను విశ్లేషిస్తే ఏ ఒక్కరూ గొప్పగా ఆడారని చెప్పడానికి లేదు. మయాంక్, రహానే కొంత ప్రతిఘటన కనబర్చినా అది ఏమాత్రం జట్టుకు ఉపయోగపడలేదు. ఇక కెప్టెన్‌ కోహ్లి తన స్థాయికి తగ్గ ఆటతీరును కనబర్చాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ పర్యటనలో మూడు ఫార్మాట్‌లలో కూడా తన ముద్ర చూపించలేకపోయిన విరాట్‌ ఇప్పుడైనా ఫినిషింగ్‌ టచ్‌ ఇస్తాడో చూడాలి. ఆరో స్థానంలో విహారికి మరో అవకాశం లభించవచ్చు. ఇక బౌలింగ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన అశ్విన్‌ స్థానంలో జడేజాకు చోటు దక్కడం దాదాపుగా ఖాయమైంది. అయితే ఈ టెస్టుకు కీలక మార్పు ఓపెనింగ్‌లో కావచ్చు. కాలి గాయంతో పృథ్వీ షా ఇబ్బంది పడుతున్నాడు. గురువారం అతను ప్రాక్టీస్‌ కూడా చేయలేదు. గాయం తీవ్రతను పరిశీలించి నేడు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అతను ఫిట్‌గా లేకపోతే శుబ్‌మన్‌ గిల్‌ అరంగేట్రం చేయడం ఖాయం. సీనియర్‌ పుజారానుంచి కూడా టీమ్‌ భారీ ఇన్నింగ్స్‌ను ఆశిస్తోంది. పేసర్‌ ఇషాంత్‌ శర్మ తొలి టెస్టులో సత్తా చాటాడు. షమీ, బుమ్రా విఫలమైనా...ఈ త్రయంలో మార్పుకు అవకాశం లేదు కాబట్టి ఉమేశ్‌ యాదవ్‌ మళ్లీ బెంచీకి పరిమితం కానున్నాడు.

వాగ్నర్‌ వచ్చేశాడు!  
భారీ విజయం తర్వాత న్యూజిలాండ్‌ మళ్లీ చెలరేగాలని పట్టుదలగా ఉంది. ఆ జట్టు బ్యాటింగ్‌ మెరుగ్గానే కనిపిస్తోంది. ఓపెనర్లు లాథమ్, బ్లన్‌డెల్‌ శుభారంభం ఇవ్వగల సమర్థులు. మూడో స్థానంలో విలియమ్సన్‌కు తిరుగు లేదు. రాస్‌ టేలర్‌ కూడా మిడిలార్డర్‌లో జట్టు భారం మోస్తున్నాడు. నికోల్స్, వాట్లింగ్‌లతో జట్టు బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగా ఉంది. బౌలింగ్‌లో సౌతీ, బౌల్ట్‌ జోడి మరోసారి భారత్‌ను దెబ్బ తీసేందుకు సిద్ధమైంది. వ్యక్తిగత కారణాలతో గత మ్యాచ్‌కు దూరమైన ప్రధాన పేసర్‌ నీల్‌ వాగ్నర్‌ మళ్లీ జట్టులోకి వచ్చాడు. అయితే  ఎవరి స్థానంలో అతడిని ఆడించాలనేది మేనేజ్‌మెంట్‌కు సమస్యగా మారింది. తొలి టెస్టులో జేమీసన్‌ ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్‌లో కీలకం కాబట్టి ఆల్‌రౌండర్‌ గ్రాండ్‌హోమ్‌ను కూడా పక్కన పెట్టడం కష్టమే. అయితే గురువారంనాడు హాగ్లీ ఓవల్‌ పిచ్‌ పరిస్థితి చూస్తే పూర్తిగా పేసర్లకు అనుకూలించేలా కనిపిస్తోంది. అదే  జరిగితే తొలి టెస్టులో కేవలం 6 ఓవర్లు వేసిన స్పిన్నర్‌ ఎజాజ్‌ పటేల్‌ స్థానంలో వాగ్నర్‌ను తీసుకొని నలుగురు పేసర్లతో కివీస్‌ దాడికి సిద్ధమైనట్లే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement