క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ గడ్డపై టి20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన తర్వాత ప్రత్యర్థి చేతిలో వన్డేల్లో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టు ఇప్పుడు టెస్టుల్లోనూ సున్నా చుట్టి పర్యటనను ముగించింది. సోమవారం ఇక్కడ హాగ్లీ ఓవల్ మైదానంలో ముగిసిన రెండో టెస్టులో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. ఫలితంగా 2–0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 90/6తో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 124 పరుగులకే ఆలౌటైంది. బౌల్ట్ (4/28), సౌతీ (3/36) టీమిండియాను దెబ్బ తీశారు. అనంతరం కివీస్ 36 ఓవర్లలో 3 వికెట్లకు 132 పరుగులు చేసి విజయాన్నందుకుంది. టామ్ బ్లన్‌డెల్ (113 బంతుల్లో 55; 8 ఫోర్లు, 1 సిక్స్), టామ్ లాథమ్ (74 బంతుల్లో 52; 10 ఫోర్లు) తొలి వికెట్‌కు 103 పరుగులు జోడించారు. బుమ్రాకు 2 వికెట్లు దక్కాయి. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన కైల్ జేమీసన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కగా, 14 వికెట్లు తీసిన టిమ్ సౌతీ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు.
47 నిమిషాల్లో...
మూడో రోజు భారత్ మిగిలిన 4 వికెట్లు కోల్పోయేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ ఇద్దరూ ఒకే స్కోరు వద్ద వెనుదిరిగారు. సౌతీ బౌలింగ్‌లో లెగ్‌సైడ్ వైపు వెళుతున్న బంతిని ఆడి విహారి (9) కీపర్‌కు క్యాచ్ ఇవ్వగా... బౌల్ట్ వేసిన తర్వాతి ఓవర్లో పంత్ (4) కూడా అవుటయ్యాడు. షమీ (5), బుమ్రా (4) తమ స్థాయిలోనే చేతులెత్తేయగా, జడేజా (16 నాటౌట్) మరో ఎండ్‌లో నిలబడిపోయాడు. బౌల్ట్ వేసిన ఓవర్ చివరి బంతిని జడేజా ఆడగా, సింగిల్ తీసి స్ట్రయిక్‌ను సహచరుడికే మళ్లీ ఇద్దామనే ప్రయత్నంలో బుమ్రా రనౌట్ కావడంతో భారత్ ఆట ముగిసింది.
సెంచరీ భాగస్వామ్యం...
స్వల్ప లక్ష్యమే అయినా కివీస్ ఛేదన కాస్త కష్టంగానే సాగింది. బంతి పేసర్లకు అనూహ్యంగా స్పందిస్తూ బ్యాట్స్‌మెన్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఈ క్రమంలో పలు మార్లు బంతి కివీస్ ఓపెనర్ల శరీరానికి కూడా తగిలింది. అయితే లాథమ్, బ్లన్‌డెల్ ఇద్దరూ పట్టుదలగా నిలబడ్డారు. తప్పుడు షాట్లు ఆడకుండా జాగ్రత్త పడుతూనే చెత్త బంతి పడినప్పుడు మాత్రం వృథా చేయకుండా బౌండరీలు రాబట్టారు. 10 పరుగుల వద్ద బ్లన్‌డెల్ ఇచ్చిన కష్టసాధ్యమైన క్యాచ్‌ను పంత్ వదిలేశాడు. లంచ్‌కు ముందు మూడు ఓవర్లే వేసిన షమీ గాయం కారణంగా రెండో సెషన్‌లో తిరిగి రాకపోవడం భారత్‌ను మరింత ఇబ్బంది పెట్టింది. విరామం తర్వాత కివీస్ ఓపెనర్లు చకచకా పరుగులు సాధించారు. ఈ క్రమంలో 67 బంతుల్లో లాథమ్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా భాగస్వామ్యం 100 పరుగులు దాటింది. ఇక కివీస్‌కు 10 వికెట్ల విజయం ఖాయమనిపించిన దశలో లాథమ్‌ను అవుట్ చేసి ఉమేశ్ ఈ జోడీని విడదీశాడు. ఆ వెంటనే బుమ్రా చెలరేగి వరుస ఓవర్లలో విలియమ్సన్ (5)ను, బ్లన్‌డెల్‌లను వరుస ఓవర్లలో పెవిలియన్ పంపించాడు. అయితే టేలర్ (5 నాటౌట్), నికోల్స్ (5 నాటౌట్) కలిసి జట్టును గెలిపించారు.
మా బౌలర్లు ఆధిపత్యం చలాయించేందుకు కావాల్సినన్ని పరుగులు బ్యాట్స్‌మెన్ చేయలేకపోయారు. రెండు టెస్టుల్లో మా బౌలింగ్ బాగుంది. సిరీస్ తుది ఫలితం నిరాశ కలిగించింది. తప్పులు సరిదిద్దుకొని ముందుకు వెళతాం. మా ప్రణాళికలు విఫలమయ్యాయి. ఎలాంటి సాకులు వెతకడం లేదు. టాస్ గురించి ఫిర్యాదు చేయదల్చుకోలేదు. అన్ని రంగాల్లో మాపై కివీస్‌దే పైచేయి అయింది. మాకు ఏదీ అనుకూలంగా సాగలేదు. గతంలో అనేక సార్లు చూపించిన తెగువను ఈసారి ప్రదర్శించలేకపోయాం. పిచ్, వాతావరణంలాంటి అంశాల్లో మా బ్యాట్స్‌మెన్ అతిగా ఆలోచించి మనసులో ఒక రకమైన సంకోచంతో ఆడటం కూడా చేటు చేసింది. సమష్టి వైఫల్యం కాబట్టి ఏ ఒక్కరినో తప్పుపట్టడం లేదు. –విరాట్ కోహ్లి, భారత కెప్టెన్
ఏం మాట్లాడుతున్నావో తెలుసా?
టెస్టు ముగిశాక జరిగిన మీడియా సమావేశంలో ఒక న్యూజిలాండ్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న కోహ్లిని ఆగ్రహానికి గురి చేసింది. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో విలియమ్సన్ అవుటైనప్పుడు కివీస్ అభిమానులను ఉద్దేశించి కోహ్లి కొన్ని అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. భారత కెప్టెన్‌గా కాస్త ఆదర్శంగా వ్యవహరించాలి కదా, ఇలా ప్రవరిస్తే ఎలా అని సదరు జర్నలిస్ట్ ప్రశ్నించాడు. దాంతో చిర్రెత్తిన కోహ్లి...‘దీని గురించి నువ్వేం అనుకుంటున్నావు? నేను అడుగుతున్నదానికి జవాబు చెప్పు. అసలు మైదానంలో ఏం జరిగిందో సరిగ్గా తెలుసుకొని ఆ తర్వాత ప్రశ్నలడుగు. సగం సమాచారంతో సగం ప్రశ్నలు అడగవద్దు. కావాలని వివాదం చేయాలనుకుంటే ఇది సరైన వేదిక కాదు. అయినా నేను రిఫరీతో మాట్లాడాను కూడా. ఆయనకు లేని బాధ నీకెందుకు?’ అని తిరుగు ప్రశ్న వేశాడు. మరోవైపు ఇదే ఘటనను విలియమ్సన్ తేలిగ్గా తీసుకున్నాడు. ‘విరాట్ మైదానంలో ఎప్పుడైనా అంతే ఆవేశంగా కనిపిస్తాడు. అది అతని స్వభావం. దీని గురించి అతిగా ఆలోచించడం అనవసరం’ అని కివీస్ కెప్టెన్ నవ్వేశాడు.
గంగూలీ (2002) – కోహ్లి (2020)
న్యూజిలాండ్ చేతిలో 0–2తో భారత జట్టు సిరీస్ ఓడటంలో 2002 ఓటమికి చాలా దగ్గరి పోలికలున్నాయి. అప్పుడు గంగూలీ నేతృత్వంలోనూ టీమ్ 0–2తో చిత్తయింది. ఇద్దరూ కెప్టెన్లూ ఘోరంగా విఫలమయ్యారు.
కోహ్లి కెప్టెన్సీలో టెస్టుల్లో భారత్ క్లీన్‌స్వీప్‌కు గురి కావడం ఇదే తొలిసారి.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: 242; న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 235
భారత్ రెండో ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) లాథమ్ (బి) సౌతీ 14; మయాంక్ (ఎల్బీ) (బి) బౌల్ట్ 3; పుజారా (బి) బౌల్ట్ 24; కోహ్లి (ఎల్బీ) (బి) గ్రాండ్‌హోమ్ 14; రహానే (బి) వాగ్నర్ 9; ఉమేశ్ (బి) బౌల్ట్ 1; విహారి (సి) వాట్లింగ్ (బి) సౌతీ 9; పంత్ (సి) వాట్లింగ్ (బి) బౌల్ట్ 4; జడేజా (నాటౌట్) 16; షమీ (సి) బ్లన్‌డెల్ (బి) సౌతీ 5; బుమ్రా (రనౌట్) 4; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (46 ఓవర్లలో ఆలౌట్) 124.
వికెట్ల పతనం: 1–8; 2–26; 3–51; 4–72; 5–84; 6–89; 7–97; 8–97; 9–108; 10–124.
బౌలింగ్: సౌతీ 11–2–36–3; బౌల్ట్ 14–4–28–4; జేమీసన్ 8–4–18–0; గ్రాండ్‌హోమ్ 5–3–3–1; వాగ్నర్ 8–1–18–1.
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: లాథమ్ (సి) పంత్ (బి) ఉమేశ్ 52; బ్లన్‌డెల్ (బి) బుమ్రా 55; విలియమ్సన్ (సి) రహానే (బి) బుమ్రా 5; రాస్ టేలర్ (నాటౌట్) 5; నికోల్స్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (36 ఓవర్లలో 3 వికెట్లకు) 132.
వికెట్ల పతనం: 1–103; 2–112; 3–121.
బౌలింగ్: బుమ్రా 13–2–39–2; ఉమేశ్ 14–3–45–1; షమీ 3–1–11–0; జడేజా 5–0–24–0; కోహ్లి 1–0–4–0.
Comments
Please login to add a commentAdd a comment