ఒక సెషన్..మూడు వికెట్లు
కోల్కతా: భారత్తో ఇక్కడ ఈడెన్ గార్డెన్లో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ జట్టు పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తోంది. 376 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన న్యూజిలాండ్ టీ విరామానికి మూడు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. రెండో సెషన్లో సగం భాగం వరకూ పూర్తి నిలకడగా ఆడిన న్యూజిలాండ్ ఒక్కసారిగా కీలక వికెట్లను చేజార్చుకుంది. నాల్గో రోజు ఆటలో భాగంగా లంచ్ తరువాత గప్టిల్(24) వికెట్ ను కోల్పోయిన న్యూజిలాండ్ జట్టుకు లాథమ్-నికోలస్లు మరమ్మత్తులు చేపట్టారు.
అయితే నికోలస్(24)ను రెండో వికెట్ గా కోల్పోయిన తరువాత కెప్టెన్ రాస్ టేలర్(4) కూడా ఎంత సేపో క్రీజ్లో నిలబడలేదు. కాగా లాథమ్ హాఫ్ సెంచరీతో క్రీజ్ లో నిలబడి భారత బౌలర్లకు పరీక్షగా నిలిచాడు. ప్రత్యేకంగా రెండో సెషన్ లో న్యూజిలాండ్ కోల్పోయిన మూడు వికెట్లలో అశ్విన్ కు రెండు, జడేజాకు ఒక వికెట్ దక్కింది. అంతకుముందు భారత్ తన రెండో ఇన్నింగ్స్ లో 263 పరుగులకు ఆలౌటైంది. భారత కీపర్ సాహా(58 నాటౌట్) రాణించాడు.