
‘ఈ కుర్రాళ్లకు కావాల్సినంత స్వేచ్ఛనిస్తాం. సరిపడా అవకాశాలిస్తాం. కుదురుకునేంత వరకు వారు సౌకర్యవంతంగా ఉండేలా చూస్తాం’ తొలి టెస్టు అనంతరం ఓపెనింగ్ స్థానాల విషయమై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్యలివి. అతడి ఆలోచనలకు తగ్గట్లు యువ ఓపెనర్ పృథ్వీ షాకు ఇప్పటికే అనూహ్యంగా అవకాశం దక్కింది. ఇక మిగిలింది మయాంక్ అగర్వాల్! టన్నులకొద్దీ పరుగులతో జాతీయ జట్టు తలుపును బలంగా బాదిన ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్ రాజ్‌కోట్‌లోనే అరంగేట్రం చేస్తాడని అంతా భావించారు. చివరి క్షణంలో బెంచ్‌కు పరిమితమైనా... హైదరాబాద్‌లో మాత్రం అతడి కల నెరవేరే సూచన కనిపిస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు అతడినీ పరీక్షించి చూద్దామని భావిస్తుండటం దీనికి ఓ కారణంగా తెలుస్తోంది. ఇదే జరిగితే... ఉప్పల్‌లో కోహ్లి సేన తుది జట్టు కూర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
సాక్షి క్రీడా విభాగం: ఐదుగురు బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్, ఐదుగురు బౌలర్ల వ్యూహంతో తొలి టెస్టు బరిలో దిగి మూడు రోజుల్లోపే ప్రత్యర్థి చుట్టేసిన టీమిండియా... సిరీస్‌లో చివరిదైన హైదరాబాద్ టెస్టులో మాత్రం భిన్న కూర్పుతో ఆడనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అరంగేట్రం ఖాయమన్న వార్తలు వస్తున్నాయి. అయితే, అతడు ఇన్నింగ్స్ ప్రారంభించకపోవచ్చు. ఆ బాధ్యతను లోకేశ్ రాహుల్, పృథ్వీ షాల పైనే ఉంచి మయాంక్‌ను వన్‌డౌన్‌లో పంపాలని టీమ్ మేనేజ్‌మెంట్ యోచిస్తోంది. అలాగైతే, బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు తప్పనిసరి అవుతోంది. మయాంక్‌ను తీసుకుంటూనే, ఐదుగురు బౌలర్లూ ఉండాలనుకుంటే ఒక బ్యాట్స్‌మన్‌పై వేటు వేయాలి. అలా కాదంటే బౌలర్ (బహుశా పేసర్)ను కుదించుకుని బరిలో దిగాలి. దీనికి కోహ్లి పెద్దగా మొగ్గుచూపడు. ఎలాగూ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి, ఆస్ట్రేలియా పర్యటనకు ముందు బ్యాటింగ్ బలాన్ని పరీక్షించుకోవాలని భావిస్తే తప్ప... బలహీనమైన విండీస్‌పై ఆరుగురు బ్యాట్స్‌మెన్‌తో ఆడటం అనవసరం. ఈ నేపథ్యంలో పక్కనపెట్టేది ఎవరినో?
అతడివైపే వేళ్లన్నీ...
ఇప్పుడున్న పరిస్థితుల్లో జట్టులో ఇబ్బంది నెలకొంది వైస్ కెప్టెన్ అజింక్య రహానేకే. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల్లో ఒక్క శతకం కూడా చేయలేక నిరాశపర్చిన అతడికి రాజ్‌కోట్‌లో భారీ ఇన్నింగ్స్‌తో ఆ లోటు పూడ్చే అవకాశం దక్కింది. ఉన్నంతసేపు బాగానే ఆడినా మోస్తరు స్కోరు మాత్రమే చేసి తేలిగ్గా వికెట్ ఇచ్చేశాడు. విండీస్‌పై ఓ పెద్ద ఇన్నింగ్స్‌తో ఆత్మవిశ్వాసం కూడగట్టుకోవడంతో పాటు బ్యాట్స్‌మన్‌గానూ టచ్‌లోకి వచ్చే మంచి చాన్స్‌ను అతడు చేజార్చుకున్నాడు. ఇప్పుడు మయాంక్ రాకతో తప్పించే బ్యాట్స్‌మన్ ఎవరంటే ముందుగా అందరి వేళ్లు రహానేనే చూపుతున్నాయి. కావాలనుకుంటే చతేశ్వర్ పుజారానూ పక్కన పెట్టొచ్చు కానీ, ఇంగ్లండ్ పర్యటన నుంచి చూపుతున్న ఫామ్‌రీత్యా దానిపై ఆలోచన చేయపోవచ్చు. ఇలా చూస్తే మిగులుతోంది రహానేనే. అయితే, కీలకమైన ఆసీస్ పర్యటనకు ముందు అతడిని తీయడం అంటే కొంత ఆలోచించాల్సిన విషయమే.
లోపాన్ని అధిగమించు... రాహుల్
గత 8 ఇన్నింగ్స్‌ల్లో అయితే బౌల్డ్ లేదా ఎల్బీడబ్ల్యూ. ఇదీ కేఎల్ రాహుల్ ఔటైన తీరు. వీటిలో కొన్ని మంచి బంతులున్నాయని సర్దిచెప్పుకొన్నా... రాహుల్ స్థాయి నాణ్యమైన ఆటగాడు వాటిని ఆడగలడు. అయితే, పాదాలను ఆలస్యంగా కదుపుతూ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే బౌలర్లకు దొరికిపోతున్నాడు. ఇప్పటివరకు 30 టెస్టుల్లో 49 ఇన్నింగ్స్‌లు ఆడిన రాహుల్... 23 సార్లు 25 బంతులు కూడా ఆడకుండానే అవుటయ్యాడు. దీన్నిబట్టి ఒకటీ అరా సాంకేతిక లోపాలను దిద్దుకుని ‘ప్రారంభ బలహీనత’ను అధిగమించాల్సి ఉంది. కొంత ఆత్మవిశ్వాస లోపంతోనూ కనిపిస్తున్న రాహుల్ మరిన్ని ఓవర్లు ఆడటం ద్వారా దానిని దాటే వీలుంది. పైగా, హైదరాబాద్ వికెట్ ఓపెనర్లకు బాగా కలిసొస్తుంది. బ్యాటింగ్‌కు అనుకూలించే ఉప్పల్ పిచ్‌పై గత ఐదేళ్ల ఓపెనింగ్ సగటు భాగ స్వామ్యం 40 కావడం గమనార్హం. ఇదే అనుకూలతతో లోకేశ్ రాహుల్ ఓ చక్కటి ఇన్నింగ్స్ ఆడతాడేమో చూద్దాం.
ఆసీస్ టూర్ సన్నాహాలపై చర్చ!
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్‌కు సంబంధించి కొన్ని కీలకాంశాలను చర్చించేందుకు పరిపాలకుల కమిటీ (సీఓఏ) బుధవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో జరిగే ఈ సమావేశంలో కెప్టెన్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రి, సెలక్షన్ కమిటీ సభ్యులతో వేర్వేరు అంశాలపై సీఓఏ సభ్యులు వినోద్ రాయ్, డయానా ఎడుల్జీ చర్చిస్తారు. ఇటీవల జట్టులో స్థానం కోల్పోయిన అనంతరం సెలక్టర్లు తమతో మాట్లాడలేదంటూ మురళీ విజయ్, కరుణ్ నాయర్ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విషయాలకు సంబంధించి ఆటగాళ్లు, సెలక్టర్ల మధ్య మరింత మెరుగ్గా సమాచార మార్పిడి ఉండాలని సీఓఏ భావిస్తోంది. ఈ సమావేశంలోనే రాబోయే ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌కు సంబంధించి సన్నాహకాలపై కూడా చర్చ జరగనుంది. దీంతో పాటు విదేశాల్లో మన స్పిన్నర్ల ప్రదర్శనను మెరుగుపర్చేందుకు స్పెషలిస్ట్ స్పిన్ బౌలింగ్ కోచ్‌ను తీసుకోవాలనే చర్చ నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment