శాకాహారం లేదని.. అలిగిన ఇషాంత్
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మకు కోపం వచ్చింది. రెండో టెస్టు మ్యాచ్ మూడోరోజు.. శుక్రవారం నాడు గాబాలో తమకు పెట్టిన భోజనంలో ఎక్కడా అసలు శాకాహారం అన్నదే కనిపించకపోవడంతో ఇషాంత్ అలిగి అక్కడినుంచి వెళ్లిపోయాడు. వాస్తవానికి గాబాకు వచ్చినప్పటి నుంచి కూడా భారతజట్టు తమకు చేసిన ఆహార ఏర్పాట్ల మీద తీవ్ర అసంతృప్తితో ఉంది.
గ్లెనెల్గ్ ఓవల్ మైదానంలో రెండు ప్రాక్టీస్ మ్యాచ్ల సందర్భంగా కూడా ఇలాగే ఆహార నాణ్యత నాసిగా ఉందని జట్టు సభ్యులు అన్నారు. అదే విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ, హ్యూస్ మరణంతో విషాదంలో ఉన్న జట్టు మీద ఫిర్యాదు చేయడం ఎందుకని ఊరుకున్నారు. అడిలైడ్ టెస్టులో చేసిన ఏర్పాట్లు బాగున్నాయని జట్టు సభ్యులు తెలిపారు. అక్కడ ఓ ఇండియన్ చెఫ్ను నియమించారు. కానీ బ్రిస్బేన్లో మాత్రం పరిస్థితులు దారుణంగా మారాయి. మీడియా రూంలో కూడా శాకాహారం కనిపించలేదు. దీనిగురించి ఇషాంత్ శర్మ, సురేష్ రైనా ఫిర్యాదు చేశారు. తర్వాత స్టేడియం వెలుపలకు వెళ్లి తమకు కావల్సిన ఆహారం కొనుక్కున్నారు. కానీ తిరిగి వస్తుంటే బయటి ఆహారం స్టేడియంలోకి తేకూడదని అడ్డగించారు. దాంతో బయట కూర్చుని శాకాహారం తిని.. తర్వాత లోపలకు వచ్చారు.