జెంటిల్మెన్ గేమ్ క్రికెట్‌లో ఒకరితో ఒకరికి సరిపోలిన గణాంకాలు ఉండటం సర్వ సాధారణం. ఉదాహరణకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సాధించిన కొన్ని రికార్డులను ప్రస్తుత టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి అచ్చం అదే తరహాలో సాధించడం మనం చూశాం. ఇలాంటి సరిపోలిన ఘటనలు క్రికెట్‌లో కోకొల్లలు.
అయితే ఇప్పుడు మనం చూడబోయే సరిపోలిన గణాంకాలను మాత్రం క్రికెట్ అభిమానులు కనివినీ ఎరిగి ఉండరు. ఇద్దరు భారత బౌలర్లకు సంబంధించి ఒకేలా ఉన్న ఈ గణాంకాలు చూసి జనాలు నివ్వెరపోతున్నారు. కెరీర్‌లు మిగిసే నాటికి సేమ్ టు సేమ్ ఉన్న గణాంకాలు చూసి అభిమానులు అవాక్కవుతున్నారు.
పేస్ బౌలర్లైన జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ.. తమతమ కెరీర్లలో ఒకేలా 311 టెస్ట్ వికెట్లు పడగొట్టారు. ఇద్దరు బౌలర్ల విషయంలో ఇలా జరగడం చాలా కామన్. అయితే ఇద్దరూ 11 సార్లు 5 వికెట్ల ఘనత, ఓసారి 10 వికెట్ల ఘనత సాధించి.. స్వదేశంలో 104 వికెట్లు, ఇతర దేశాల్లో 207 వికెట్లు పడగొట్టి ఉండటం మాత్రం విచిత్రమే.
విండీస్‌తో రెండో టెస్ట్ సందర్భంగా జహీర్, ఇషాంత్ హిందీ కామెంట్రీ బాక్స్‌లో ఉండగా.. బ్రాడ్‌కాస్టర్ ఈ గణాంకాలను తెరపైకి తెచ్చాడు. ఇది చూసి జహీర్, ఇషాంత్‌లు సైతం ఆశ్చర్యపోయారు. తమకు కూడా తెలీని ఈ విషయం క్రికెట్ ప్రపంచానికి తెలియజేసినందుకు వారు బ్రాడ్‌కాస్టర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయం సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో.. ఇదెక్కడి విచిత్రం అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా పట్టుబిగించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే ఆఖరి రోజు 8 వికెట్లు పడగొట్టాల్సి ఉంది. అదే విండీస్ గెలవాలంటే మరో 289 పరుగులు చేయాల్సి ఉంది. భారత బౌలర్లు ఉన్న ఊపును చూస్తే ఇది అంత ఆషామాషీ విషయం కాదని తెలుస్తోంది. ఇప్పటికే తొలి టెస్ట్ గెలిచిన భారత్ 2 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో మ్యాచ్ కూడా గెలిస్తే 2-0తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment