టీమిండియా మాజీ కెప్టెన్.. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఫీల్డింగ్ గురించి వంక పెట్టాల్సిన పని లేదు. మైదానంలో పాదరసంలా కదిలే కోహ్లి ఎన్నోసార్లు స్టన్నింగ్ క్యాచ్‌లు తీసుకున్నాడు. ఎక్కువ సందర్భాల్లో స్లిప్‌లో ఫీల్డింగ్ చేసిన కోహ్లి కొన్నిసార్లు క్యాచ్‌లు వదిలేశాడు. అందులో అమూల్యమైన క్యాచ్‌లు కూడా ఉన్నాయి.
సోమవారం వెస్టిండీస్‌తో ముగిసిన రెండో టెస్టులో సిరాజ్ బౌలింగ్‌లో కోహ్లి ఒక సింపుల్ క్యాచ్‌ను జారవిడిచాడు. ఈ సందర్భంగా రెండో టెస్టుకు కామెంటేటర్లుగా వ్యవహరించిన ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్‌లు 2014లో కోహ్లి మిస్ చేసిన క్యాచ్ గుర్తుచేసుకున్నారు. కోహ్లి వల్లనే తన టెస్టు కెరీర్ ముగిసిపోయిందని జహీర్ అన్నట్లు ఇషాంత్ పేర్కొన్నాడు.
ఇషాంత్ మాట్లాడుతూ.. ''2014లో మేము న్యూజిలాండ్ పర్యటనకు వచ్చాం. బేసిన్ రిజర్వ్ బ్యాక్ వేదికగా జరిగిన టెస్టులో మూడో రోజు ఆటలో మెక్‌కల్లమ్ ట్రిపుల్ సెంచరీతో మెరిశాడు. అయితే జహీర్ ఖాన్ బౌలింగ్‌లో కోహ్లి 9 పరుగుల వద్ద మెక్‌కల్లమ్ ఇచ్చిన క్యాచ్‌ను జారవిడవడంతో బతికిపోయిన మెక్‌కల్లమ్ ఆ తర్వాత 300 పరుగులు బాదాడు. దీంతో కోహ్లి.. ''ఇదంతా తన వల్లే'' అంటూ తెగ ఫీలయ్యాడు. లంచ్ విరామం సమయంలో జహీర్ వద్దకు వచ్చిన కోహ్లి సారీ చెప్పాడు. దీనికి జహీర్ బదులిస్తూ.. ''ఏం పర్లేదు తర్వాతి బంతికి ఔట్ చేద్దాం'' అని పేర్కొన్నాడు. టీ విరామ సమయంలో కోహ్లి మరోసారి జహీర్‌కు సారీ చెప్పగా.. ''నా కెరీర్ నీ వల్లే ముగిసిపోనుంది'' అంటూ బాంబు పేల్చాడు.
అయితే ఇషాంత్ వ్యాఖ్యలను తప్పుబట్టిన జహీర్ వివరణ ఇచ్చుకున్నాడు. ''నా కెరీర్ నీవల్లే ఎండ్ అయిందని నేను అనలేదు. ఇషాంత్ నా వ్యాఖ్యలను వక్రీకరించాడు(నవ్వుతూ). ఇంతవరకు టీమిండియా ఆడిన టెస్టుల్లో 300 పరుగులు చేసిన ఆటగాడి క్యాచ్‌లను ఇద్దరే మిస్ చేశారు. మొదట కిరణ్ మోరే క్యాచ్ జారవిడవడంతో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ గ్రహం గూచ్ ట్రిపుల్ సెంచరీ చేశాడు.
కిరణ్ మోరే తర్వాత ఆ ఘనత సాధించింది కోహ్లినే. 9 పరుగుల వద్ద మెక్‌కల్లమ్ ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లి జారవిడవడంతో అతను ట్రిపుల్ సెంచరీ చేశాడు. అందుకే నా కెరీర్ నీవల్లే ఎండ్ కాబోతుంది అంటూ జోక్ చేశాను. కానీ కోహ్లి మాత్రం ప్లీజ్ అలా అనొద్దు.. నాకు చాలా బాధగా ఉంది.. కానీ క్యాచ్ జారవిడవడం వల్ల పరుగులు వచ్చేశాయి. అని అన్నాడు. దీంతో నేను పర్లేదు.. ఈ విషయాన్ని ఇక్కడితో మరిచిపో అంటూ కోహ్లికి సర్ది చెప్పాను.'' అంటూ జహీర్ ఖాన్ తెలిపాడు.
ఇక అప్పటి మ్యాచ్‌లో జహీర్ ఖాన్ ఐదు వికెట్లు తీసినప్పటికి 51 ఓవర్లలో 170 పరుగులు ఇచ్చుకున్నాడు. మెక్‌కల్లమ్ 302 పరుగులు, బీజే వాట్లింగ్, జేమ్స్ నీషమ్‌లు సెంచరీలతో చెలరేగారు. దీంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌ను 680 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆ తర్వాత కోహ్లి రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో(105 పరుగులు) మెరిసినప్పటికి మ్యాచ్ డ్రాగా ముగిసింది.
చదవండి: Lionel Messi: 'మెస్సీని చూసేందుకు 808 మేకలు'.. అద్బుతాన్ని చూసి తీరాల్సిందే
Comments
Please login to add a commentAdd a comment