
నేడు ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్
విజయమే లక్ష్యంగా బరిలోకి రెండు జట్లు ∙టాపార్డర్‌పైనే భారం
రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ 18వ సీజన్‌లో తిరిగి గెలుపు బాట పట్టేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్), కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు సిద్ధమవుతున్నాయి. తొలి పోరులో భారీ బాదుడుతో రికార్డులు తిరగరాసిన రైజర్స్... ఆ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో దాన్ని కొనసాగించలేకపోయింది. గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న పోరులో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)ను సన్‌రైజర్స్ ఢీకొంటుంది. బ్యాటింగ్ లైనప్ హిట్టర్లతో దట్టంగా ఉన్నప్పటికీ... టాపార్డర్ నిలకడలేమి హైదరాబాద్ జట్టును ఇబ్బంది పెడుతోంది.
రాజస్తాన్ రాయల్స్‌తో మొదటి మ్యాచ్‌లో గెలిచిన ఆరెంజ్ ఆర్మీమ... ఆ తర్వాత వరుసగా లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడింది. 3 మ్యాచ్‌లాడి 2 పాయింట్లతో ఉన్న రైజర్స్ ఎనిమిదో స్థానంలో ఉంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నా... వారంతా సమష్టిగా రాణించలేకపోవడమే ప్రధాన సమస్యగా మారింది. మరోవైపు కోల్‌కతా జట్టు పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు.
డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆ జట్టు... స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడంలో విఫలమవుతోంది. ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఒక్క దాంట్లోనే గెలిచి, రెండింటిలో ఓడిన కేకేఆర్ 2 పాయింట్లతో పట్టిక అట్టడుగున ఉంది. గత సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్యే జరిగిన ఫైనల్లో కోల్‌కతా గెలిచి మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ చేజిక్కించుకోగా... దానికి బదులు తీర్చుకోవాలని ఆరెంజ్ ఆర్మీ ప్రణాళికలు రచిస్తోంది.
కలిసికట్టుగా కదంతొక్కితేనే...
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్... ఇలా చెప్పుకుంటూ పోతే సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ భీకరంగా ఉంది. ఎలాంటి బౌలింగ్ దాడినైనా దంచికొట్టగల సామర్థ్యం రైజర్స్ బ్యాటర్ల సొంతం. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇది నిరూపితమైంది. అయితే వీరంతా కలిసికట్టుగా రాణించాల్సిన అవసరముంది. రైజర్స్ తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లోనే అజేయ సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్... తర్వాతి 2 మ్యాచ్‌ల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితం కాగా... ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి తొలి రెండు మ్యాచ్‌ల్లో ఫర్వాలేదనిపించాడు.
అభిషేక్ శర్మ నుంచి మెరుపులు కరువు కాగా.. క్లాసెన్ నుంచి టీమ్ మేనేజ్‌మెంట్ భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. అంచనాలు లేకుండా సీజన్ ఆరంభించిన అనికేత్ వర్మ ధాటిగా ఆడుతుండటం రైజర్స్‌కు కలిసి వస్తోంది. నైట్ రైడర్స్ ప్రధాన బలమైన స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటే మరోసారి భారీ స్కోర్లు ఖాయమే. ప్యాట్ కమిన్స్, షమీ, హర్షల్ పటేల్ బౌలింగ్ భారం మోయనున్నారు. బెంగాల్ తరఫున ఈ మైదానంలో లెక్కకు మిక్కిలి దేశవాళీ మ్యాచ్‌లు ఆడిన షమీ కీలకం కానున్నాడు.
స్పిన్నర్ల బలంతోనే...
గతేడాది వేలంలో కోల్‌కతా వదిలేసుకున్న ప్రధాన ఆటగాళ్లంతా వేర్వేరు ఫ్రాంఛైజీల తరఫున రాణిస్తుంటే... కేకేఆర్ మాత్రం లయ అందిపుచ్చుకోలేక ఇబ్బంది పడుతోంది. సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే కెపె్టన్సీలో స్పిన్నే బలంగా నైట్‌రైడర్స్ బరిలోకి దిగుతోంది. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, మొయిన్ అలీలపై ఆ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. డికాక్, రఘువంశీ, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, రసెల్‌తో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉన్నా... వీరంతా ఇప్పటి వరకు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు.
రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో మెరుపులు మెరిపించిన డికాక్... ముంబైతో పోరులో తేలిపోయాడు. ఇక భారీ ధర పెట్టి కొనుగోలు చేసుకున్న వెంకటేశ్ అయ్యర్ నుంచి ఆ జట్టు మెరుగైన ప్రదర్శన ఆశిస్తోంది. రింకూ సింగ్, రసెల్ ఫినిషర్లుగా విఫలమవుతుండటం మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. బౌలింగ్‌లో హర్షిత్ రాణా తప్ప చెప్పుకోదగ్గ పేసర్ లేకపోవడం కూడా కేకేఆర్‌కు ప్రతిబంధకమే కాగా... స్పిన్ యూనిట్ మాత్రం బలంగా ఉంది. మరి సొంతగడ్డపై కేకేఆర్ స్పిన్నర్లు చెలరేగుతారా లేక రైజర్స్ బ్యాటర్లు దుమ్మురేపుతారా చూడాలి!
తుది జట్లు (అంచనా)
సన్‌రైజర్స్ హైదరాబాద్: కమిన్స్ (కెప్టెన్ ), హెడ్, అభిషేక్, ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి, క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, హర్షల్ పటేల్, షమీ, సిమర్‌జీత్ సింగ్, జంపా.
కోల్‌కతా నైట్‌రైడర్స్: రహానే (కెప్టెన్ ), డికాక్, నరైన్, రఘువంశీ, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, రసెల్, రమణ్‌దీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.
28 ఐపీఎల్ చరిత్రలో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లు. 19 మ్యాచ్‌ల్లో నైట్‌రైడర్స్ గెలుపొందగా... 9 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ విజయం సాధించింది.