
వరుసగా మూడో మ్యాచ్‌లో ఓడిన హైదరాబాద్
80 పరుగులతో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఘనవిజయం
వెంకటేశ్ అయ్యర్, రఘువంశీ అర్ధ సెంచరీలు
బంతితో మెరిసిన వైభవ్, వరుణ్
గత ఐపీఎల్ సీజన్ రన్నరప్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్లీ ఓడింది. తొలి పోరులో మెరుపు బ్యాటింగ్‌తో భారీ విజయం సాధించిన టీమ్ అదే బ్యాటింగ్ వైఫల్యాలతో వరుసగా మూడో పరాజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. 2024 ఫైనలిస్ట్‌ల మధ్య జరిగిన సమరంలో చివరకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌దే పైచేయి అయింది. సొంత మైదానంలో ముందుగా బ్యాటింగ్‌లో చెలరేగి భారీ స్కోరు సాధించిన కేకేఆర్ ఆపై చక్కటి బౌలింగ్‌తో రైజర్స్‌ను నిలువరించింది. ఛేదనలో 9 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ ఆపై కోలుకోలేకపోయింది.
కోల్‌కతా: మూడు రోజుల క్రితం ముంబై చేతిలో చిత్తుగా ఓడి పట్టికలో చివరి స్థానానికి పడిపోయిన కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) వెంటనే భారీ విజయాన్ని అందుకుంది. ఈడెన్ గార్డెన్స్‌లో గురువారం జరిగిన పోరులో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా 80 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (29 బంతుల్లో 60; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), అంగ్‌కృష్ రఘువంశీ (32 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేయగా... కెప్టెన్ అజింక్య రహానే (27 బంతుల్లో 38; 1 ఫోర్, 4 సిక్స్‌లు), రింకూ సింగ్ (17 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు.
రఘువంశీ, రహానే మూడో వికెట్‌కు 51 బంతుల్లోనే 81 పరుగులు జోడించగా... వెంకటేశ్, రింకూ ఐదో వికెట్‌కు 41 బంతుల్లోనే 91 పరుగులు జత చేయడం విశేషం. అనంతరం రైజర్స్ 16.4 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. హెన్రిచ్ క్లాసెన్ (21 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా... 20 బంతులు మిగిలి ఉండగానే సన్‌రైజర్స్ ఆట ముగిసింది.
కీలక భాగస్వామ్యాలు...
నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్ మూడు భిన్న దశల్లో సాగింది. ఓపెనర్లు డికాక్ (1), నరైన్ (7) విఫలం కావడంతో 16 పరుగులకే జట్టు 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రహానే, రఘువంశీ కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు కొన్ని చక్కటి షాట్లు ఆడటంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 53 పరుగులకు చేరింది. అన్సారీ ఓవర్లో రఘువంశీ వరుసగా సిక్స్, ఫోర్ కొట్టిన తర్వాత అదే ఓవర్లో రహానే వెనుదిరిగాడు.
43 పరుగుల వద్ద నితీశ్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన రఘువంశీ 30 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఆ వెంటనే అతను అవుటయ్యాడు. ఇక్కడ కేకేఆర్ బ్యాటింగ్ కొద్దిసేపు తడబడింది. వరుసగా 18 బంతుల పాటు బౌండరీ రాలేదు. 15 ఓవర్లలో జట్టు స్కోరు 122/4. సన్‌రైజర్స్ పట్టు బిగిస్తున్నట్లు కనిపించిన దశలో ఆఖరి 5 ఓవర్లలో కోల్‌కతా ఆటను మార్చేసింది.
వెంకటేశ్, రింకూ ఒకరితో మరొకరు పోటీ పడి పరుగులు సాధించారు. హర్షల్ ఓవర్లో రింకూ వరుసగా 3 ఫోర్లు కొట్టగా, సిమర్జిత్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 17 పరుగులు వచ్చాయి. కమిన్స్ వేసిన 19వ ఓవర్లో వెంకటేశ్ వరుస బంతుల్లో 4, 6, 4, 4తో పండగ చేసుకున్నాడు. 25 బంతుల్లోనే అతని హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఆఖరి 5 ఓవర్లలో జట్టు 78 పరుగులు సాధించింది.
టపటపా...
ఛేదనలో రైజర్స్ ఇన్నింగ్స్ పేలవంగా మొదలైంది. తొలి 13 బంతుల్లోనే హెడ్ (4), అభిషేక్ శర్మ (2), ఇషాన్ కిషన్ (2) వెనుదిరిగారు. ఆ తర్వాత నితీశ్ కుమార్ రెడ్డి (15 బంతుల్లో 19; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా పేలవ షాట్ ఆడి అవుట్ కాగా, కమిందు మెండిస్ (20 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఎక్కువసేపు నిలవలేదు. క్లాసెన్ కొద్దిసేపు పోరాడినా అది ఏమాత్రం సరిపోలేదు.

స్కోరు వివరాలు
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) అన్సారీ (బి) కమిన్స్ 1; నరైన్ (సి) క్లాసెన్ (బి) షమీ 7; రహానే (సి) క్లాసెన్ (బి) అన్సారీ 38; రఘువంశీ (సి) హర్షల్ (బి) మెండిస్ 50; వెంకటేశ్ (సి) అనికేత్ (బి) హర్షల్ 60; రింకూ సింగ్ (నాటౌట్) 32; రసెల్ (రనౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 200. వికెట్ల పతనం: 1–14, 2–16, 3–97, 4–106, 5–197, 6–200. బౌలింగ్: షమీ 4–0–29–1, కమిన్స్ 4–0–44–1, సిమర్జీత్ సింగ్ 4–0–47–0, జీషాన్ అన్సారీ 3–0–25–1, హర్షల్ 4–0–43–1, కమిందు మెండిస్ 1–0–4–1
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (సి) రాణా (బి) వైభవ్ అరోరా 4; అభిషేక్ (సి) వెంకటేశ్ (బి) రాణా 2; ఇషాన్ కిషన్ (సి) రహానే (బి) వైభవ్ అరోరా 2; నితీశ్ రెడ్డి (సి) నరైన్ (బి) రసెల్ 19; కమిందు (సి) (సబ్) అనుకూల్ (బి) నరైన్ 27; క్లాసెన్ (సి) మొయిన్ అలీ (బి) వైభవ్ అరోరా 33; అనికేత్ (సి) వెంకటేశ్ (బి) వరుణ్ 6; కమిన్స్ (సి) రాణా (బి) వరుణ్ 14; హర్షల్ (సి అండ్ బి) రసెల్ 3, సిమర్జీత్ (బి) వరుణ్ 0; షమీ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (16.4 ఓవర్లలో ఆలౌట్) 120. వికెట్ల పతనం: 1–4, 2–9, 3–9, 4–44, 5–66, 6–75, 7–112, 8–114, 9–114, 10–120. బౌలింగ్: వైభవ్ అరోరా 4–1–29–3, హర్షిత్ రాణా 3–0–15–1, వరుణ్ చక్రవర్తి 4–0–22–3, ఆండ్రీ రసెల్ 1.4–0–21–2, నరైన్ 4–0–30–1.
ఐపీఎల్‌లో నేడు
లక్నో X ముంబై
వేదిక: లక్నో
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం