టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఈతరం ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక వెస్టిండీస్‌తో నేటి నుంచి జరగనున్న రెండో టెస్టు కోహ్లికి అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లు కలిపి 500వ మ్యాచ్. టీమిండియా తరపున 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న నాలుగో ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు. ఇక అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కోహ్లి ఆరో స్థానంలో ఉండగా.. సెంచరీల విషయంలో మాత్రం దిగ్గజం సచిన్ తర్వాతి స్థానంలో ఉన్నాడు.
విండీస్‌తో జరిగిన తొలి టెస్టులో సెంచరీ చేయడంలో విఫలమైనప్పటికి 76 పరుగులతో మంచి టచ్‌లోనే కనిపించాడు. మరి ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో కోహ్లి సెంచరీతో మెరుస్తాడేమో చూడాలి. ఇక కోహ్లి 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతుండడంపై టీమిండియా మాజీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాజీలు ఆకాశ్ చోప్రా, వసీం జాఫర్, ప్రగ్యాన్ ఓజాలు కోహ్లిపై ప్రశంసల వర్షం కురిపించారు.
''ఆట పట్ల కోహ్లికున్న నిబద్ధత ఇవాళ 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడేలా చేసింది. వచ్చి 16 ఏళ్లు కావొస్తున్నా అదే ఫిట్‌నెస్ మెయింటేన్ చేయడం అంటే మాములు విషయం కాదు. ఈ 16 ఏళ్లలో కోహ్లి తనకు తానుగా తప్పుకున్నాడే తప్ప ఫిట్‌నెస్ విషయంలో ఇబ్బంది పడి ఒక్క మ్యాచ్‌కు దూరమైన సందర్భాలు లేవు. ఈతరం క్రికెటర్లలో గొప్ప ఆటగాడని కచ్చితంగా చెప్పగలను. 500వ మ్యాచ్ ఆడుతున్న కోహ్లికి కంగ్రాట్స్'' అంటూ ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.
''500వ అంతర్జాతీయ మ్యాచ్.. కోహ్లి ఖాతాలో మరో కలికితురాయి. ఇది నిజంగా గొప్ప అచీవ్‌మెంట్ అని చెప్పొచ్చు. కొందరికే ఇది సాధ్యమవుతుంది.. అందులో కోహ్లి ఒకడు. ఇదే ఫామ్‌ను కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నా'' అంటూ ఓజా పేర్కొన్నాడు.
''క్రికెట్‌లో 500 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే అవకాశం అందరికి రాదు. కానీ కోహ్లికి ఆ చాన్స్ వచ్చింది. బ్యాటర్‌గా తనేంటో ఇప్పటికే నిరూపించుకున్నాడు. మంచి ఫిట్‌నెస్ కలిగి ఉన్న కోహ్లి ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో 75 సెంచరీలు బాదాడు. ఇది అతని క్రమశిక్షణ, అంకితభావం, సంకల్పాన్ని సూచిస్తున్నాయి.'' అంటూ జాఫర్ తెలిపాడు.
చదవండి: BAN W Vs IND W 2nd ODI: జెమీమా రోడ్రిగ్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శన..108 పరుగులతో భారీ విజయం
Comments
Please login to add a commentAdd a comment