ఆధునిక తరంలో అసాధారణ ప్రతిభతో ఉన్నత శిఖరాలకు చేరుకున్న అతికొద్ది మంది క్రికెటర్లలో విరాట్ కోహ్లి ముందు వరుసలో ఉంటాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సమకాలీన ఆటగాళ్లకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఎనభై శతకాలు సాధించిన ఘనత ఈ రన్‌మెషీన్ సొంతం. టీమిండియా దిగ్గజం, వంద సెంచరీల ధీరుడు సచిన్ టెండుల్కర్ రికార్డును సమం చేయగల సత్తా ఉన్న ఏకైక బ్యాటర్.
అయితే, కెరీర్ ఆరంభంలో అసలు తను జట్టులో స్థానం సుస్థిరం చేసుకోగలనా? లేదా అన్న సందిగ్దంలో కొట్టుమిట్టాడట కోహ్లి. భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. నిరాశలో కూరుకుపోయిన కోహ్లికి తాను చెప్పిన మాటలను తాజాగా గుర్తుచేసుకున్నాడు.
తీవ్ర నిరాశకు లోనయ్యాడు
‘‘కోహ్లి గురించి చెప్పాలంటే.. ముఖ్యంగా టెస్టుల్లో అతడి ప్రయాణాన్ని ముందుగా తెలుసుకోవాలి. అప్పుడు మేము వెస్టిండీస్ పర్యటనలో ఉన్నాము. ఫిడెల్ ఎడ్వర్డ్స్ తన బౌలింగ్‌తో కోహ్లిని చాలా ఇబ్బంది పెట్టాడు. ప్రతిసారి అతడే తన వికెట్ తీసుకున్నాడు. దీంతో కోహ్లి సహజంగానే తీవ్ర నిరాశకు లోనయ్యాడు.
ఆత్మన్యూనతభావంతో కుంగిపోయాడు. అప్పుడు తను నా దగ్గరికి వచ్చి.. ‘నేను బాగానే ఆడుతున్నానా?’ అని అడిగాడు. నేను వెంటనే అందుకు బదులిస్తూ.. ‘ఒకవేళ టెస్టు క్రికెట్‌లో గనుక నువ్వు 10 వేల పరుగులు చేయకపోతే.. అందుకు నిన్ను నువ్వే నిందించుకోవాల్సి వస్తుంది’ అని చెప్పాను.
అది కేవలం నీ తప్పే అవుతుందని చెప్పాను
‘నీకు ఆ సత్తా ఉంది. అయినప్పటికీ నువ్వు ఆ మైలురాయి చేరుకోలేకపోయావంటే అందుకు కేవలం నువ్వే కారణం అవుతావు అని గుర్తుపెట్టుకొమ్మని కోహ్లితో అన్నాను’’’ అంటూ భజ్జీ నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. ఆత్మవిశ్వాసంతో ఒక్కోమెట్టు ఎక్కుతూ కోహ్లి తారస్థాయికి చేరుకున్నాడని హర్షం వ్యక్తం చేశాడు.
ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గు ర్తింపు
ఇక ఫిట్‌నెస్, డైట్ విషయంలోనూ కోహ్లికి శ్రద్ధ ఎక్కువని.. అందుకే తను గుంపులో గోవిందలా కాకుండా ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడని భజ్జీ తెలిపాడు. కోహ్లి చాలా మొండివాడని.. అనుకున్న పని పూర్తి చేసేంతవరకు పట్టువదలడని పేర్కొన్నాడు. భారత క్రికెట్‌పై కోహ్లి చెరగని ముద్ర వేశాడంటూ భజ్జీ ప్రశంసలు కురిపించాడు. తరువార్ కోహ్లి పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
కాగా 2011లో వెస్టిండీస్‌తో మ్యాచ్ ద్వారా కోహ్లి టెస్టుల్లో అడుగుపెట్టాడు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 19 పరుగులే చేసి నిరాశపరిచాడు. అయితే, ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగిన కోహ్లి ప్రస్తుతం 8848 పరుగులతో కొనసాగుతున్నాడు. ఇందులో 29 సెంచరీలు ఉన్నాయి.
చదవండి: Pak vs Ban: ఆలస్యమైతే అవుటే!.. భయంతో పాక్ క్రికెటర్ పరుగులు
Comments
Please login to add a commentAdd a comment