
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025 సీజన్‌ను పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ పేలవంగా ఆరంభించాడు. ఈ టోర్నీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మాక్స్‌వెల్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. స్పిన్నర్ సాయి కిషోర్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ప్రయత్నించి వికెట్ల ముందు మాక్స్‌వెల్ దొరికిపోయాడు. ఒకవేళ మాక్సీ రివ్యూ తీసుకుని ఉండి ఉంటే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకునేవాడు.
ఎందుకంటే బంతి రిప్లేలో వికెట్స్‌ను మిస్ అవుతున్నట్లు తేలింది. తర్వాత డగౌట్ నుంచి రిప్లే చూసిన మాక్సీ షాకయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో డకౌటైన మాక్స్‌వెల్ అత్యంత చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యధిక డకౌట్‌లు అయిన ఆటగాడిగా మాక్స్‌వెల్ నిలిచాడు.
ఈ ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 19 సార్లు డకౌటయ్యాడు. ఇంతకుముందు ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో రోహిత్ శర్మ(18), దినేష్ కార్తీక్(18)లో కలిసి మాక్సీ సంయుక్తంగా ఉన్నాడు. ఇప్పుడు తాజా మ్యాచ్‌తో ఈ చెత్త రికార్డును తన ఒక్కడి ఖాతాలో వేసుకున్నాడు.
ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్( 42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో 97) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. గుజరాత్ బౌలర్లలో సాయికిషోర్ మూడు, రబాడ, రషీద్ ఖాన్ తలా వికెట్ సాధించారు.
చదవండి: IPL 2025: 'సెల్ఫ్‌లెస్ శ్రేయస్ అయ్యర్' .. జట్టు కోసం సెంచరీ త్యాగం