
Photo Courtesy: BCCI/IPL
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జైత్రయాత్రకు గుజరాత్ టైటాన్స్ (GT) అడ్డుకట్ట వేసింది. ఆర్సీబీని వారి సొంత మైదానంలోనే ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఫలితంగా ఐపీఎల్-2025లో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన బెంగళూరు జట్టు ఖాతాలో తొలి పరాజయం నమోదు కాగా.. టైటాన్స్‌కు వరుసగా రెండో విజయం లభించింది.
ఇక ఆర్సీబీపై టైటాన్స్ గెలుపులో కీలక పాత్ర పోషించిన టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా అతడు భావోద్వేగానికి లోనయ్యాడు. ఏడేళ్ల పాటు ప్రాతినిథ్యం వహించిన జట్టుపై ఇలాంటి ప్రదర్శన నమోదు చేయడం మిశ్రమ అనుభూతిని ఇచ్చిందని పేర్కొన్నాడు.
భావోద్వేగానికి గురి చేసింది
‘‘నేను కాస్త ఉద్వేగానికి లోనయ్యాడు. ఏడేళ్ల పాటు ఇక్కడే (ఆర్సీబీ) ఉన్నాను. రెడ్ జెర్సీ నుంచి బ్లూ జెర్సీకి మారటం నన్ను భావోద్వేగానికి గురి చేసింది. అయితే, బంతి చేతిలోకి రాగానే నా మూడ్ మారిపోయింది.
చాలా రోజులుగా ఆటతో నేను బిజీగానే ఉన్నాను. అయితే, అనుకోకుండా లభించిన విశ్రాంతి కారణంగా.. ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టడంతో పాటు బౌలింగ్‌లో నా తప్పులను సరిదిద్దుకునేందుకు కావాల్సినంత సమయం దొరికింది. వేలంలో గుజరాత్ టైటాన్స్ నన్ను కొనుగోలు చేయగానే.. మొదట ఆశిష్ (ఆశిష్ నెహ్రా) భాయ్‌తో మాట్లాడాను.
బౌలింగ్‌ను ఆస్వాదిస్తూ ముందుకు వెళ్లాలని.. ఇతర విషయాలను పట్టించుకోవద్దని ఆయన నాకు చెప్పాడు. అదే విధంగా.. ఇషూ భాయ్ (ఇషాంత్ శర్మ) కూడా లైన్ అండ్ లెంగ్త్ తప్పవద్దని నాకు సూచించాడు. వారు నాలో ఆత్మవిశ్వాసం నింపారు.
పిచ్ ఎలా ఉన్నా.. పర్లేదు
మనపై మనకు నమ్మకం ఉన్నపుడు పిచ్ పరిస్థితులు మన ప్రదర్శనను ప్రభావితం చేయలేవు. నేను రొనాల్డో అభిమానిని. కాబట్టే వికెట్ తీసిన ప్రతిసారీ అలా సెలబ్రేట్ చేసుకున్నా’’ అని సిరాజ్ చెప్పుకొచ్చాడు. కాగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్.. ఆర్సీబీని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
A Phil Salt orbiter 🚀
followed by...
A Mohd. Siraj Special \|/ 🫡
It's all happening in Bengaluru 🔥
Updates ▶ https://t.co/teSEWkWPWL #TATAIPL | #RCBvGT | @mdsirajofficial pic.twitter.com/a8whsXHId3— IndianPremierLeague (@IPL) April 2, 2025
సిరాజ్ పేస్ పదును.. ఆర్సీబీకి షాకులు
ఈ క్రమంలో ఆరంభంలోనే ఓపెనర్ విరాట్ కోహ్లి (7)ని అర్షద్ ఖాన్ వెనక్కి పంపగా.. అతడి స్థానంలో వచ్చిన దేవదత్ పడిక్కల్‌ను సిరాజ్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే ఫిల్ సాల్ట్ (14)ను కూడా అదే రీతిలో పెవిలియన్‌కు పంపాడు.
ఇలా టాపార్డర్ కుప్పకూలడంతో ఆర్సీబీ కష్టాల్లో కూరుకుపోగా.. ఫామ్‌లో ఉన్న కెప్టెన్ రజత్ పాటిదార్ (12) కూడా తక్కువ స్కోరుకే అవుట్ కావడం ప్రభావం చూపింది.
ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో అతడు లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరగగా.. లియామ్ లివింగ్ స్టోన్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. 40 బంతుల్లో 54 పరుగులతో లియామ్ జోరు మీదున్న వేళ సిరాజ్ మరోసారి తన పేస్ పదును చూపించి.. ఆర్సీబీని దెబ్బకొట్టాడు.
ఇక వికెట కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ (21 బంతుల్లో 33) వేగంగా ఆడే ప్రయత్నం చేయగా.. సాయి కిషోర్ అతడిని అవుట్ చేశాడు. ఆఖర్లో టిమ్ డేవిడ్ మెరుపులు (18 బంతుల్లో 32) మెరిపించగా.. ప్రసిద్ కృష్ణ అతడి జోరుకు అడ్డుకట్ట వేశాడు. మిగతా వాళ్లలో కృనాల్ పాండ్యా (5), భువనేశ్వర్ కుమార్ (1 నాటౌట్) విఫలం కాగా.. నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.
సిరాజ్ 4 ఓవర్లలో కేవలం 19 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీయగా.. అర్షద్ ఖాన్, ప్రసిద్ కృష్ణ, ఇషాంత్ శర్మ ఒక్కో వికెట్‌తో రాణించారు. సాయి కిషోర్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఇక లక్ష్య ఛేదనలో టైటాన్స్ ఆరంభంలోనే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (14) వికెట్ కోల్పోయింది.
బట్లర్ ధనాధన్
అయితే, మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (36 బంతుల్లో 49)కు జతైన వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 39 బంతుల్లోనే 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 73 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.
అతడితో పాటు షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (18 బంతుల్లో 30) వేగంగా ఆడి.. సిక్సర్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ క్రమంలో 17.5 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి టైటాన్స్ పని పూర్తి చేసింది.
రూ. 12.25 కోట్లకు కొనుగోలు
ఇదిలా ఉంటే.. సిరాజ్ ఏడేళ్ల పాటు ఆర్సీబీకి ఆడిన విషయం తెలిసిందే. అయితే, మెగా వేలానికి ముందు ఫ్రాంఛైజీ అతడిని విడిచిపెట్టింది. వేలంపాటలోనూ సిరాజ్‌పై ఆర్సీబీ ఆసక్తి చూపలేదు. ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ రూ. 12.25 కోట్లకు అతడిని కొనుగోలు చేసింది.
ఇక ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో సిరాజ్ విఫలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో... స్వదేశంలో ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌తో పాటు.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్టులో సెలక్టర్లు అతడికి చోటివ్వలేదు. మహ్మద్ షమీతో పాటు అర్ష్‌దీప్ సింగ్‌కు పెద్దపీట వేసి.. సిరాజ్‌ను తప్పించారు. దీంతో సిరాజ్‌కు విరామం లభించగా.. ఫిట్‌నెస్ మెరుగుపరచుకుని.. మరింత కఠినంగా సాధన చేశాడు.
చదవండి: భారత్‌లో పర్యటించనున్న వెస్టిండీస్, సౌతాఫ్రికా.. షెడ్యూల్ విడుదల