IND Vs WI 1st Test: Juniors Will Ask What Is Point Of Being Senior Ishant Sharma Blunt Message To Virat Kohli - Sakshi
Sakshi News home page

#Virat Kohli: కోహ్లి నెమ్మదిగా! సీనియర్‌ అయి ఉండి ఏం లాభం? జూనియర్లు..: ఇషాంత్‌ శర్మ

Published Fri, Jul 14 2023 7:48 PM | Last Updated on Fri, Jul 14 2023 8:08 PM

Juniors Will Ask What Is Point Of Being Senior Ishant Blunt Message To Kohli - Sakshi

సెంచరీలు బాదిన రోహిత్‌- యశస్వి- ఇషాంత్‌తో కోహ్లి (పాత ఫొటో)

West Indies vs India, 1st Test: టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి- పేసర్‌ ఇషాంత్‌ శర్మ మధ్య ఉన్న స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత్‌ తరఫున ఇద్దరూ కలిసి దాదాపు వంద టెస్టులాడారు. అయితే, అంతకంటే ముందు ఢిల్లీ రంజీ జట్టుకు  వీరిద్దరు ప్రాతినిథ్యం వహించారు. అప్పుడే వీరి మధ్య స్నేహం మొదలైంది.

ఎవరికీ అందనంత ఎత్తులో
దేశ రాజధానికి చెందిన ఈ ఇద్దరు ఆటగాళ్ల కెరీర్‌ చూసుకుంటే.. కోహ్లి భారత జట్టు సారథిగా ఎదగడం(ప్రస్తుతం కేవలం బ్యాటర్‌) సహా అంతర్జాతీయ స్థాయిలో ఏకంగా 75 శతకాలు బాది రన్‌మెషీన్‌ అన్న బిరుదును సార్థకం చేసుకుంటున్నాడు. సమకాలీన క్రికెటర్లలో ఎవరికీ సాధ్యంకాని రీతిలో అనేకానేక రికార్డులు సృష్టించి అందనంత ఎత్తులో ఉన్నాడు.

కామెంటేటర్‌గా అవతారం
మరోవైపు ఇషాంత్‌ శర్మ స్టార్‌ పేసర్‌గా ప్రశంసలు అందుకున్నా అతడి కెరీర్‌ ప్రస్తుతం నెమ్మదించింది. ఏడాదిన్నరకాలంగా జట్టులో చోటే కరువైంది. దీంతో అతడు కామెంటేటర్‌గా కొత్త అవతారమెత్తాడు. టీమిండియా- వెస్టిండీస్‌ 2023 సిరీస్‌ నేపథ్యంలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. 

ఈ క్రమంలో కోహ్లి గురించి ఇషాంత్‌ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా వెస్టిండీస్‌తో తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసే సరికి కోహ్లి కేవలం 36 పరుగులు మాత్రమే చేసిన విషయం తెలిసిందే. తొలి బౌండరీ బాదడానికి 81 బంతులు తీసుకున్నాడు. ఇక కోహ్లి విదేశాల్లో టెస్టుల్లో సెంచరీ చేసి దాదాపు ఐదేళ్లకు పైగానే అయింది.

సీనియర్‌ అయి ఉండి ఏం లాభమని ప్రశ్నిస్తారు!
ఈ నేపథ్యంలో ఇషాంత్‌ జియో సినిమా షోలో మాట్లాడుతూ.. ‘‘సీనియర్‌ ప్లేయర్‌గా ఉన్న కారణంగా కచ్చితంగా మంచి స్కోరు చేయడం అత్యంత ముఖ్యం. లేదంటే ..‘‘సీనియర్‌ అయి ఉండి ఏం లాభం’’ అని ఒకానొక సందర్భంలో జూనియర్లు అడిగే అవకాశం ఉంటుంది.

విరాట్‌ కోహ్లి కచ్చితంగా వీలైనన్ని ఎక్కువ పరుగులే రాబడతాడని నాకు తెలుసు. తన ప్రస్తుత మానసిక స్థితి, ఆ బ్యాటింగ్‌ తీరు చూస్తుంటే ఇట్టే ఈ విషయం అర్థమైపోతోంది’’ అని వ్యాఖ్యానించాడు. 

కాగా విండీస్‌తో మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సెంచరీలతో మెరువగా.. అదే పిచ్‌పై కోహ్లి కాస్త స్లోగా ఇన్నింగ్స్‌ ఆడటం అభిమానులను నిరాశకు గురిచేసింది. ఇక గురువారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి యశస్వి 143, కోహ్లి 36 పరుగులతో క్రీజులో ఉన్న విషయం తెలిసిందే.

చదవండి: సెంచరీతో చెలరేగి అరుదైన రికార్డు సాధించిన రోహిత్‌ శర్మ! ప్రపంచంలోనే..
Ind Vs WI: ఏరికోరి వచ్చావు! ఏమైందిపుడు? అప్పుడు కూడా ఇలాగే! మార్చుకో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement