Nicholas Pooran Shows Bruises Sustained After Blows by Brandon King and Arshdeep Singh in 5th T20i - Sakshi
Sakshi News home page

IND VS WI 5th T20: విండీస్‌ గెలిచినా.. పూరన్‌కు కమిలిపోయింది..!

Published Mon, Aug 14 2023 3:12 PM | Last Updated on Mon, Aug 14 2023 4:04 PM

Nicholas Pooran Shows Bruises Sustained After Blows By Brandon King And Arshdeep Singh In 5th T20I - Sakshi

5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా టీమిండియాతో నిన్న (ఆగస్ట్‌ 13) జరిగిన నిర్ణయాత్మక ఐదో మ్యాచ్‌లో విండీస్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా 3-2 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. టీమిండియాపై దాదాపు 17 ఏళ్ల తర్వాత లభించిన విజయం (సిరీస్‌) కావడంతో విండీస్‌ ఆటగాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ విక్టరీని విండీస్‌ ప్లేయర్లు గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఇటీవలి కాలంలో విండీస్‌కు ఈ స్థాయి విజయం దక్కడంతో ఆ దేశ మాజీలు సైతం రోవ్‌మన్‌ సేనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా ప్లేయర్‌ ఆఫ్‌ సిరీస్‌గా నిలిచిన నికోలస్‌ పూరన్‌ను ఆకాశానికెత్తుతున్నారు. ఈ సిరీస్‌లో పూరన్‌ 141.94 స్ట్రయిక్‌ రేట్‌తో 176 పరుగులు చేసి తన జట్టు సాధించిన విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాడు. 

అయితే ఇంత చేసి తన జట్టుకు చిరస్మరణీయ సిరీస్‌ విజయాన్ని అందించిన పూరన్‌కు మాత్రం శారీరక ప్రశాంతత లభించలేదు. ఐదో టీ20 సందర్భంగా పూరన్‌ సహచరుడు బ్రాండన్‌ కింగ్‌, ప్రత్యర్ధి అర్షదీప్‌ సింగ్‌ ధాటికి గాయాలపాలయ్యాడు. నాన్‌ స్ట్రయికర్‌ ఎండ్‌లో ఉండగా కింగ్‌ కొట్టిన ఓ షాట్‌ నేరుగా వచ్చి పూరన్‌ ఎడమ చేతిని బలంగా తాకగా.. అతని చేయి విరిగినంత పనైయ్యింది. అప్పటికప్పుడు ఆ నొప్పి తెలియలేదు కానీ, మ్యాచ్‌ అనంతరం పరిశీలించగా.. గాయమైన భాగం పూర్తిగా కమిలిపోయి, బంతి అచ్చు కనిపించింది.

పూరన్‌ ఇదే మ్యాచ్‌లో అర్షదీప్‌ బౌలింగ్‌లోనూ గాయపడ్డాడు. కింగ్‌ దెబ్బ మరువక ముందే అర్షదీప్‌ వేసిన ఓ వేగవంతమైన బంతి నేరుగా వచ్చి పూరన్‌  కడుపుపై బలంగా తాకింది. ఆ క్షణం పూరన్‌ నొప్పితో విలవిలలాడిపోయాడు. అయితే వెంటనే తేరుకుని తిరిగి బ్యాటింగ్‌ను కొనసాగించాడు. అయితే ఈ దెబ్బను సైతం మ్యాచ్‌ అనంతరం పరిశీలించగా.. గాయమైన ప్రాంతం పూర్తిగా కమిలిపోయి ఉండి, బంతి అచ్చు స్పష్టంగా కనిపించింది. ఈ దెబ్బలకు సంబంధించిన ఫోటోను పూరన్‌ మ్యాచ్‌ అనంతరం సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసి కింగ్‌, అర్షదీప్‌లను థ్యాంక్స్‌ చెప్పాడు. అనంతర ప్రభావాలు.. కింగ్‌, అర్షదీప్‌లను ధన్యవాదాలు అంటూ ఈ పోస్ట్‌కు క్యాప్షన్‌ జోడించాడు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది.

ఇదిలా ఉంటే, ఈ గాయాలు తగిలిన అనంతరం కూడా పూరన్‌ తన బ్యాటింగ్‌ను కొనసాగించి, తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. కింగ్‌తో అతను రెండో వికెట్‌కు 107 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి తన జట్టు గెలుపుకు గట్టి పునాది వేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో పూరన్‌ 35 బంతులు ఎదుర్కొని బౌండరీ, 4 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేశాడు, 85 పరుగులతో అజేయంగా నిలిచిన కింగ్‌.. షాయ్‌ హోప్‌ (22) సహకారంతో విండీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగా.. విండీస్‌ మరో 2 ఓవర్లు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement