విండీస్‌తో నిన్న (ఆగస్ట్ 14) జరిగిన నిర్ణయాత్మక ఐదో టీ20లో టీమిండియా హార్డ్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. 50 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ మ్యాచ్‌లో 3 సిక్సర్లు బాదిన సూర్యకుమార్.. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌ను అధిగమించాడు. 50 టీ20 ఇన్నింగ్స్‌ల తర్వాత స్కై ఖాతాలో 104 సిక్సర్లు ఉండగా.. గేల్ పేరిట 103 సిక్సర్లు ఉన్నాయి. ఈ జాబితాలో విండీస్ ఆటగాడు ఎవిన్ లెవిస్ 111 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. లెవిస్, స్కై, గేల్‌ల తర్వాత కివీస్ కొలిన్ మున్రో (92), ఆరోన్ ఫించ్ (79) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.
50 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలోనూ స్కై నాలుగో స్థానంలో ఉన్నాడు. విండీస్‌తో ఐదో టీ20లో 45 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేసిన సూర్యకుమార్.. 50 ఇన్నింగ్స్‌ల అనంతరం 1841 పరుగులు చేసి ఈ విభాగంలో విరాట్ కోహ్లి (1943), బాబర్ ఆజమ్ (1942), మహ్మద్ రిజ్వాన్ (1888) తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో స్కై తర్వాత కేఎల్ రాహుల్ (1751) ఐదో స్థానంలో ఉన్నాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన ఫ్లోరిడా పిచ్‌పై బ్యాటర్ల నిర్లక్ష్యం, పసలేని బౌలింగ్ కారణంగా భారత్ ఐదో టీ20లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. తిలక్ వర్మ (18 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), సూర్యకుమార్ (45 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ల సాయంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రొమారియో షెఫర్డ్ (4/31) భారత్ జోరుకు అడ్డుకట్ట వేశాడు.
తర్వాత లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్ 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసి గెలిచింది. బ్రాండన్ కింగ్ (55 బంతుల్లో 85 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), నికోలస్ పూరన్ (35 బంతుల్లో 47; 1 ఫోర్, 4 సిక్సర్లు) చెలరేగారు. ఫలితంగా భారత్ మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను (2-3) కూడా కోల్పోయింది. ఈ పర్యటనలో టెస్టు, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకున్న భారత్.. టీ20 సిరీస్‌ను తృటిలో చేజార్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment