IND VS WI 5th T20: Yuzvendra Chahal Joined Ish Sodhi For Conceding Most Sixes In T20I - Sakshi
Sakshi News home page

IND VS WI 5th T20: చెత్త రికార్డు మూటగట్టుకున్న చహల్‌

Published Mon, Aug 14 2023 5:31 PM | Last Updated on Mon, Aug 14 2023 6:07 PM

IND VS WI 5th T20: Chahal Joined Ish Sodhi For Conceding Most Sixes In T20I - Sakshi

టీమిండియాతో నిన్న (ఆగస్ట్‌ 13) జరిగిన నిర్ణయాత్మక ఐదో టీ20లో విండీస్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో విండీస్‌ 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-2 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమై మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను విండీస్‌కు అప్పగించింది. బ్యాటింగ్‌లో సూర్యకుమార్‌ (61) మినహా అందరూ చేతులెత్తేయగా.. బౌలింగ్‌లో కుల్దీప్‌ యాదవ్‌ (4-0-18-0) మినహా భారత బౌలర్ల ప్రదర్శన అత్యంత దారుణంగా ఉండింది. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా ఓవరాక్షన్‌ బౌలింగ్‌తో 3 ఓవర్లలో 32 పరుగులు సమర్పించుకోగా.. అర్షదీప్‌ 2 ఓవర్లలో 20 పరుగులు సమర్పించుకున్నాడు. మ్యాచ్‌ మొత్తంలో అత్యంత పేలవమైన ప్రదర్శన కనబర్చిన ఘనత టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చహల్‌కు దక్కింది.

ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన చహల్‌ ఏకంగా 51 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో ప్రత్యర్ధులు 5 సిక్సర్లు బాదారు. ఈ చెత్త గణాంకాలు నమోదు చేసే క్రమంలో చహల్‌ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాధించుకున్న బౌలర్‌గా న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ ఐష్‌ సోధి సరసన చేరాడు. సోధి తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో 129 సిక్సర్లు సమర్పించుకోగా.. చహల్‌ ఈ మ్యాచ్‌లో అతని రికార్డును సమం చేశాడు. ఈ విభాగంలో సోధి, చహల్‌ తర్వాత ఆదిల్‌ రషీద్‌ (119) ఉన్నాడు. 

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన పిచ్‌పై బ్యాటర్ల నిర్లక్ష్యం, పసలేని బౌలింగ్‌ కారణంగా భారత్‌ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.  ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. తిలక్‌ వర్మ (18 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), సూర్యకుమార్‌ (45 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రొమారియో షెఫర్డ్‌ (4/31) భారత్‌ జోరుకు అడ్డుకట్ట వేశాడు.  లక్ష్యఛేదనలో వెస్టిండీస్‌ 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసి గెలిచింది. బ్రాండన్‌ కింగ్‌ (55 బంతుల్లో 85 నాటౌట్‌; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), నికోలస్‌ పూరన్‌ (35 బంతుల్లో 47; 1 ఫోర్, 4 సిక్సర్లు) చెలరేగారు. ఈ పర్యటనలో టెస్టు, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకున్న భారత్‌.. టీ20 సిరీస్‌ను కోల్పోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement