విండీస్‌తో రెండో టెస్ట్ నాలుగో రోజు ఆటలో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగాడు. కెరీర్‌లో రెండోసారి 5 వికెట్ల ఘనతను సాధించాడు. నాలుగో రోజు 4 ఓవర్లలో 4 వికెట్లు తీసి విండీస్ పతనాన్ని శాశించాడు. ఫలితంగా విండీస్ తొలి ఇన్నింగ్స్ 255 పరుగుల వద్ద ముగిసింది.
ఓవర్‌నైట్ స్కోర్‌కు కేవలం 26 పరుగులు మాత్రమే జోడించిన విండీస్ మిగతా 5 వికెట్లు కోల్పోయింది. నాలుగో రోజు సిరాజ్ 4 వికెట్లు పడగొడితే, ముకేశ్ కుమార్ తొలి ఓవర్‌లోనే వికెట్ తీశాడు.
ఓవర్‌నైట్ బ్యాటర్ అథనేజ్ (37) వికెట్ ముకేశ్‌కు దక్కగా.. హోల్డర్ (15), అల్జరీ జోసఫ్ (4), కీమర్ రోచ్ (4), గాబ్రియెల్ (0) వికెట్లు సిరాజ్ ఖాతాలో పడ్డాయి. 239 పరుగుల వద్ద ఫాలో గండాన్ని దాటిన విండీస్.. టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 183 పరుగులు వెనుకపడి ఉంది.
విండీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (75) అర్ధసెంచరీతో రాణించగా.. అలిక్ అథనేజ్ (37), తేజ్‌నరైన్ చంద్రపాల్ (33), కిర్క్ మెక్‌కెంజీ (32) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో సిరాజ్ 5, జడేజా, ముకేశ్ కుమార్ తలో 2 వికెట్లు, అశ్విన్ ఓ వికెట్ పడగొట్టాడు.
అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌటైంది. 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లి (121) సెంచరీతో కదంతొక్కగా.. యశస్వి (57), రోహిత్ (80), జడేజా (61), అశ్విన్ (56)అర్ధసెంచరీలతో రాణించారు. విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్, వార్రికన్ చెరో 3 వికెట్లు.. హోల్డర్ 2, గాబ్రియల్ ఓ వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment