వన్డే, టెస్టుల్లో కీలక మార్పుల దిశగా ఐసీసీ!.. టీ20 ఫార్మాట్లో కొత్తగా ఈసారి! | ICC Eyes Big Changes In ODI Rule That Faced Criticism Once From Sachin: Report | Sakshi
Sakshi News home page

వన్డే, టెస్టుల్లో కీలక మార్పుల దిశగా ఐసీసీ!.. టీ20 ఫార్మాట్లో కొత్తగా ఈసారి!

Published Sat, Apr 12 2025 1:30 PM | Last Updated on Sat, Apr 12 2025 2:01 PM

ICC Eyes Big Changes In ODI Rule That Faced Criticism Once From Sachin: Report

జై షా (Jay Shah) నేతృత్వంలోని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) మూడు ఫార్మాట్లలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. వన్డేల్లో రెండు బంతుల విధానం రద్దు చేయడంతో పాటు.. అండర్‌-19 స్థాయిలో పురుషుల విభాగంలోనూ ప్రపంచకప్‌ (Under-19 World Cup) నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.

అదే విధంగా.. టెస్టుల్లో ఓవర్‌ రేటును లెక్కించేందుకు ‘టైమర్‌’ ను ప్రవేశపెట్టే దిశగా ఐసీసీ ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఐసీసీ చైర్మన్‌ హోదాలో జై షా తొలిసారి బోర్డు సమావేశానికి హాజరవుతున్నారు. జింబాబ్వే వేదికగా ఏప్రిల్‌ 10- 13 వరకు ఈ మీటింగ్‌ జరుగనుంది.

ఈ నేపథ్యంలో మూడు ఫార్మాట్లలోనూ పైవిధమైన మార్పులు చేయాలనే అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి సమావేశం ముగిసిన తర్వాత ప్రకటన వెలువడే అవకాశం ఉందని క్రిక్‌బజ్‌ వెల్లడించింది.

రివర్స్‌ స్వింగ్‌ కోసం
కాగా వన్డే మ్యాచ్‌లో ప్రస్తుతం రెండు బంతులు ఉపయోగించే విధానం కొనసాగుతోంది. ఇరు జట్లు బౌలింగ్‌ కోసం కొత్త బంతిని ఉపయోగించుకుంటాయి. అదే విధంగా.. 25 ఓవర్ల ఆట ముగిసిన తర్వాత మరో కొత్త బంతిని కూడా తీసుకునేందుకు వీలుంటుంది. ఇందులో ఏ బంతితో ఆటను కొనసాగించాలనే నిర్ణయం తీసుకునే అవకాశం కూడా బౌలింగ్‌ జట్టుకు ఉంటుంది.

అయితే, ఇందుకు సంబంధించి ప్లేయింగ్‌ కండిషన్లలో పూర్తిస్థాయి మార్పులు చేసేందుకు ఐసీసీ సిద్ధంగా లేదు.. కానీ బౌలర్లకు కూడా కాస్త వెసలుబాటు కల్పించాలనే ఉద్దేశంతో ఉంది. కాగా కొత్త బంతి మెరుస్తూనే ఉండటం వల్ల పేస్‌ బౌలర్లకు రివర్స్‌ స్వింగ్‌ రాబట్టడం వీలుకాదు. బంతి పాతబడే కొద్ది వాళ్లకు కాస్త పట్టు దొరుకుతుంది.

నాడు పెదవి విరిచిన సచిన్‌
మరోవైపు.. రెండు బంతుల విధానం వల్ల బ్యాటర్లు ఎక్కువగా లబ్ది పొందుతున్నారనే విమర్శలూ ఉన్నాయి. గతంలో ఈ విషయంపై టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ కూడా స్పందించాడు. రెండు బంతుల విధానం అనేది వన్డే క్రికెట్‌కు మంచిది కాదని పేర్కొన్నాడు. బంతి పాతబడి.. రివర్స్‌ స్వింగ్‌ రాబట్టేందుకు పేసర్లకు అవకాశం ఉండదని.. అలాంటపుడు డెత్‌ ఓవర్లలో వారికి పెద్దగా ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డాడు.

మహిళలు ఆడుతున్నారు
ఇక టీ20ల విషయానికొస్తే.. పురుషుల క్రికెట్‌లో అండర్‌-19 వన్డే వరల్డ్‌కప్‌ మాదిరే.. అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌ టోర్నమెంట్‌ను కూడా ప్రవేశపెట్టాలని ఐసీసీ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మహిళల క్రికెట్‌లో పొట్టి ఫార్మాట్‌లో వరల్డ్‌కప్‌ ఈవెంట్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. తొలి రెండు సీజన్లలో భారత జట్టు ఈ ట్రోఫీని గెలుచుకుంది.

నిమిషం పూర్తయ్యే లోపే
అదే విధంగా.. టెస్టుల్లో ఓవర్‌ రేటు లెక్కించేందుకు టైమర్‌ను ప్రవేశపెట్టాలని ఐసీసీ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. అంటే.. ఓ ఓవర్‌ పూర్తైన వెంటనే మరుసటి నిమిషం పూర్తయ్యే లోపే మరో ఓవర్‌ వేయాల్సి ఉంటుంది. తద్వారా నిర్ణీత సమయంలో ఆటను ముగించేందుకు వీలుగా ఉంటుంది. కాగా టెస్టు మ్యాచ్‌లో రోజుకు తొంభై ఓవర్ల ఆట నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే.

చదవండి: IPL 2025: గుజరాత్‌ టైటాన్స్‌కు షాక్‌.. అతడు సీజన్‌ మొత్తానికి దూరం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement