భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మన్ పదవి చేపట్టనున్నారు. ఈ ఏడాది డిసెంబరు 1న ఐసీసీ బాస్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ఎన్నిక ప్రక్రియ ఇప్పటికే పూర్తైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జై షా త్వరలోనే బీసీసీఐ కార్యదర్శి పదవి నుంచి తప్పుకోనున్నారు.
అదే విధంగా.. ఆసియా క్రికెట్ మండలి(ఏసీసీ) అధ్యక్షుడిగానూ రాజీనామా చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏసీసీ కొత్త ప్రెసిడెంట్ ఎవరన్న చర్చ జరుగుతుండగా.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నక్వీ పేరు తెరమీదకు వచ్చింది. జై షా స్థానాన్ని నక్వీ భర్తీ చేయనున్నాడని.. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది.
కొత్త బాస్‌గా నక్వీ?
‘‘వచ్చే ఏడాది ఆరంభంలో జరుగనున్న ఏసీసీ సమావేశంలో.. కొత్త అధ్యక్షుడిగా మొహ్సిన్ నక్వీ ఎంపిక కానున్నారు. రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగనున్నారు’’ అని ఏసీసీ వర్గాలు వెల్లడించినట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది. కాగా ఆసియా వన్డే కప్-2023 ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకోగా.. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా అక్కడికి వెళ్లలేదన్న సంగతి తెలిసిందే.
అయితే, పాక్ బోర్డు మాత్రం భారత జట్టు తమదేశానికి రావాల్సిందేనని పట్టుపట్టగా.. జై షా నేతృత్వంలోని ఏసీసీ హైబ్రిడ్ విధానంలో మ్యాచ్‌లు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో పాక్‌తో పాటు శ్రీలంకను ఆతిథ్య దేశంగా ఎంపిక చేసి.. టీమిండియా మ్యాచ్‌లను అక్కడ నిర్వహించింది. భారత్‌తో పాటు లంక ఫైనల్‌కు చేరగా.. టైటిల్ పోరు కూడా శ్రీలంకలోనే జరిగింది. అయితే, జై షా స్థానంలో నక్వీ వస్తే.. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితి తలెత్తితే.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనే ఆసక్తి నెలకొంది.
ఐసీసీ టోర్నీలకు సన్నాహకాలుగా
ఇదిలా ఉంటే.. వచ్చే ఏడాది భారత్‌లో పురుషుల ఆసియాకప్ జరుగనుంది. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీని2025 సెప్టెంబర్‌లో నిర్వహించనున్నారు. స్వదేశంలో జరుగనున్న టీ20 ప్రపంచకప్-2026కు ముందుగా ఈ టోర్నీని నిర్వహించడం వల్ల.. ఆసియా దేశాలకు కావాల్సినంత ప్రాక్టీస్ లభించనుంది. అనంతరం.. ఆసియా కప్-2027నకు బంగ్లాదేశ్ ఆతిథ్యమిస్తుంది. అదే ఏడాది దక్షిణాఫ్రికాలో వన్డే ప్రపంచకప్ ఉండటంతో బంగ్లాలో వన్డే ఫార్మాట్‌లో ఆసియాకప్ నిర్వహించాలని ఏసీసీ నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment