అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) 2024 ఏడాదికిగానూ పురుషుల అత్యుత్తమ టెస్టు(ICC Men’s Test Team of the Year 2024) జట్టును శుక్రవారం ప్రకటించింది. ఇందులో టీమిండియా నుంచి ముగ్గురు ఆటగాళ్లు చోటు దక్కించుకోగా.. ఇంగ్లండ్ నుంచి అత్యధికంగా నలుగురికి స్థానం దక్కింది. ఇక ఈ జట్టుకు ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథిగా ఎంపికయ్యాడు.
ఐసీసీ మెన్స్ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్-2024లో ఓపెనర్లుగా టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal)- ఇంగ్లండ్ ప్లేయర్ బెన్ డకెట్ చోటు దక్కించుకోగా.. వన్డే బ్యాటర్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్(Kane Williamson) స్థానం సంపాదించాడు.
లంక నుంచి అతడు
ఇక మిడిలార్డర్‌లో కీలకమైన నాలుగో స్థానంలో ఇంగ్లండ్ మాజీ సారథి, టెస్టు క్రికెట్ వీరుడు జో రూట్‌ను ఐసీసీ ఎంపిక చేసింది. ఐదో స్థానంలో ఇంగ్లండ్ నూతన వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్.. ఆరో స్థానంలో శ్రీలంక శతకాల ధీరుడు కమిందు మెండిస్ చోటు దక్కించుకున్నారు.
ఇక వికెట్ కీపర్‌గా ఇంగ్లండ్ యువ క్రికెటర్ జేమీ స్మిత్ ఎంపిక కాగా.. ఆల్‌రౌండర్‌గా టీమిండియా స్పిన్ స్టార్ రవీంద్ర జడేజాకు స్థానం దక్కింది. ఇక ఈ జట్టులో ఏకంగా ముగ్గురు పేసర్లకు ఐసీసీ చోటిచ్చింది. కెప్టెన్ కమిన్స్‌తో పాటు.. న్యూజిలాండ్ రైటార్మ్ బౌలర్ మ్యాట్ హెన్రీ.. టీమిండియా పేసు గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా ఈ జాబితాలో ఉన్నారు.
కోహ్లి- రోహిత్‌లకు దక్కని చోటు
ఇటీవలి కాలంలో వరుస వైఫల్యాల కారణంగా టీమిండియా ప్రధాన బ్యాటర్లు విరాట్ కోహ్లి- రోహిత్ శర్మకు ఈ జట్టులో చోటు దక్కలేదు. అయితే, రోహిత్ ఓపెనింగ్ జోడీ యశస్వి జైస్వాల్ మాత్రం గతేడాది అత్యుత్తమంగా రాణించాడు.
జైసూ, బుమ్రా హిట్
ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్‌లో భారీ శతకం(161) బాదడం అతడి ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మూడు ఫార్మాట్లలో కలిపి 2024లో జైసూ 1771 పరుగులు సాధించాడు. ఇక బుమ్రా సైతం బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో అత్యధికంగా 32 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.
మరోవైపు.. జడేజా సైతం స్థాయికి తగ్గట్లుగా రాణించి.. ఈ జట్టుకు ఎంపికయ్యాడు. ఇదిలా ఉంటే... ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్-2024ను కూడా శుక్రవారం ప్రకటించారు. ఇందులో టీమిండియా నుంచి ఒక్కరికి కూడా స్థానం దక్కకపోవడం గమనార్హం. ఈ జట్టులో శ్రీలంక క్రికెటర్లు హవా చూపించారు.
ఐసీసీ మెన్స్ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్- 2024
యశస్వి జైస్వాల్, బెన్ డకెట్, కేన్ విలియమ్సన్, జో రూట్, హ్యారీ బ్రూక్, కమిందు మెండిస్, జేమీ స్మిత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మ్యాట్ హెన్రీ, జస్‌ప్రీత్ బుమ్రా.
ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్- 2024:
చరిత్ అసలంక (శ్రీలంక- కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్(అఫ్గనిస్తాన్), పాతుమ్ నిసాంక(శ్రీలంక), కుశాల్ మెండిస్ (శ్రీలంక- వికెట్‌కీపర్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్(వెస్టిండీస్), అజ్మతుల్లా ఒమర్‌జాయ్(అఫ్గనిస్తాన్), వనిందు హసరంగ(శ్రీలంక), షాహీన్ షా అఫ్రిది(పాకిస్తాన్), హరీస్ రౌఫ్(పాకిస్తాన్), అల్లా ఘజన్‌ఫర్(అఫ్గనిస్తాన్).
చదవండి: రోహిత్, కోహ్లి పరుగుల వరద పారించడం ఖాయం: ఇర్ఫాన్ పఠాన్
Comments
Please login to add a commentAdd a comment