తొలిరోజు కలిసి రాలేదు.. బ్యాడ్ డే: రహానే
కోల్ కతా: పరుగులు చేయడానికి ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ అంత కష్టమైన పిచ్ కాదని టీమిండియా బ్యాట్స్ మన్ అజింక్యా రహానే అన్నాడు. తొలిరోజు ఆట నిలిపివేసిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడాడు. చతేశ్వర్ పుజారా(87)తో కలిసి విలువైన 141 పరుగుల భాగస్వామ్యం అందించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయామని రహానే(77) అసంతృప్తిని వ్యక్తం చేశాడు. బౌలర్ల లయ దెబ్బతీసేందుకు చాలా ప్రయత్నించామని, అందులో భాగంగానే స్పిన్నర్ల బంతులను బ్యాక్ ఫుట్ తీసుకుని ఆడినట్లు వివరించాడు. రెండో రోజు వృద్ధిమాన్ సాహా(14), రవీంద్ర జడేజా(0) చేసే స్కోర్లు జట్టుకు ఎంతో కీలకమని, దాంతో కివీస్ పై సులువుగా ఒత్తిడి పెంచుతామన్నాడు.
బ్యాట్స్ మన్ అవుట్ కావడానికి కేవలం ఒక్క బంతి చాలునని, అయితే అదే అతగాడు సెంచరీ సాధిస్తే పరిస్థితి భిన్నంగా ఉంటుందన్నాడు. గతంలో కంటే ఈడెన్ పిచ్ భిన్నంగా ఉందని, పేస్ బౌలర్లుకు అనుకూలించిందన్నాడు. రెండో సెషన్లో ఉక్కపోత, భారీగా వేడి ఉండటంతో బ్యాట్స్ మన్ ఇబ్బందులు పడ్డారని తెలిపాడు. తొలుత మంచి బ్యాటింగ్ వికెట్ అని భావించామని, అయితే ఈ రోజు మాకు బ్యాడ్ డే అయిందన్నాడు. తొలి రోజు ఆట నిలిపివేసే సమయానికి భారత్ 7 వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసిన విషయం తెలిసిందే.