మాంచెస్టర్: తొలి టెస్టులో ఓడిపోయిన ఇంగ్లండ్ రెండో టెస్టులో ఫలితాన్ని శాసించే స్థితిలో నిలిచింది. మ్యాచ్ చివరిరోజు సోమవారం నింపాదిగా ఆడి ‘డ్రా’తో సరిపెట్టుకోవాలా... లేదంటే ఊరించే లక్ష్యాన్ని నిర్దేశించి వెస్టిండీస్‌పై ఒత్తిడి తెచ్చి అనుకూల ఫలితం పొందాలా అనేది ఇంగ్లండ్ జట్టు చేతిలోనే ఉంది. నాలుగోరోజు ఆదివారం ఓవర్‌నైట్ స్కోరు 32/1తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్టిండీస్ జట్టు 99 ఓవర్లలో 287 పరుగులకు ఆలౌటైంది.
ఇంగ్లండ్ బౌలర్లు బ్రాడ్ (3/66), వోక్స్ (3/42), స్యామ్ కరన్ (2/70) రాణించారు. విండీస్ జట్టులో బ్రాత్‌వైట్ (75; 8 ఫోర్లు), బ్రూక్స్ (68; 11 ఫోర్లు), చేజ్ (51; 7 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించారు. 182 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 37 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ 219 పరుగుల ఆధిక్యంలో ఉంది. నేడు చివరిరోజు ఇంగ్లండ్ ధాటిగా ఆడి మరో 75 పరుగులు జోడించి విండీస్ ముందు ఊరించే లక్ష్యం పెడుతుందో లేదో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment