మాంచెస్టర్: కరోనా నేపథ్యంలో పలు కట్టుబాట్లతో, ‘బయో సెక్యూరిటీ’ మధ్య కట్టుదిట్టంగా సాగుతున్న ఇంగ్లండ్, వెస్టిండీస్ టెస్టు సిరీస్‌లో అనూహ్య ఘటన! ఇంగ్లండ్ పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ జట్టు నిబంధనలు ఉల్లంఘించాడు. అనుమతించిన చోటుకు కాకుండా ‘బయో సెక్యూర్ బబుల్’ను దాటి బయటకు వెళ్లాడు. దాంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) గురువారం తక్షణ క్రమశిక్షణ చర్యగా రెండో టెస్టు ఆరంభానికి ముందు అతడిపై వేటు వేసింది. బుధవారం రాత్రి ప్రకటించిన 13 మంది సభ్యుల జట్టులో ఉన్న ఆర్చర్‌ను తప్పించి అతని స్థానంలో స్యామ్ కరన్‌ను ఎంపిక చేసింది. నిబంధనల ప్రకారం ఆర్చర్ ఇప్పుడు ఐదు రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాల్సి ఉంటుంది. ఈ సమయంలో అతనికి రెండు సార్లు కోవిడ్–19 పరీక్షలు నిర్వహిస్తారు. రెండు సార్లు కూడా నెగిటివ్‌గా తేలితేనే జట్టుతో చేరేందుకు అనుమతిస్తారు.
ఈ టెస్టు సిరీస్‌లో ఆటగాళ్లు, సిబ్బంది అంతా జీపీఎస్ ట్రాకింగ్ పరికరాలను వాడుతున్నారు. మ్యాచ్ వేదికల్లో మాత్రమే ఇవి పని చేస్తాయి. అయితే తొలి టెస్టు ముగిసిన సౌతాంప్టన్‌నుంచి రెండో టెస్టు జరిగే మాంచెస్టర్ వరకు ఆటగాళ్లు విడివిడిగా ప్రయాణించేందుకు అనుమతించారు. మధ్యలో భోజనం కోసం మాత్రం ఆగవచ్చు. ఇదే దారిలో ఉన్న ‘బ్రైటన్’లో ఆర్చర్ ఫ్లాట్ ఉంది. అతను సుమారు గంట సేపు తన ఇంటికి వెళ్లినట్లు బయటపడింది. అయితే అక్కడ ఉన్నంత సేపు ఎవరితోనూ సన్నిహితంగా మెలగలేదని, సొంతిల్లు సహజంగానే సురక్షితం కాబట్టి ప్రమాదం ఉండదని ఆర్చర్ భావించినట్లు అతని సన్నిహితుడొకరు వెల్లడించారు.
చర్య తప్పలేదు...
కోవిడ్–19 బారిన పడకుండా ఈ టెస్టు సిరీస్‌ను విజయవంతంగా నిర్వహించడంలో ఇంగ్లండ్ బోర్డు తీవ్రంగా శ్రమిస్తోంది. అందులో భాగంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. కఠిన నిబంధనలతో కూడిన ‘బయో బబుల్’ వివరాలు వెల్లడించిన తర్వాతే ఇంగ్లండ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఒక్కో టెస్టుపై 20 మిలియన్ పౌండ్లు (సుమారు రూ. 190 కోట్లు) ఆదాయం ముడిపడి ఉంది. ఇలాంటి స్థితిలో నిబంధనలు ఉల్లంఘించడం తీవ్రమైన తప్పుగా ఈసీబీ పరిగణించింది. ఆర్చర్ ‘మతి లేని పని’ చేశాడంటూ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైక్ ఆథర్టన్ తీవ్రంగా విమర్శించారు.
‘క్షమించండి’
నేను చేసిన తీవ్రమైన తప్పును మన్నించమని కోరుతున్నా. నా చర్యతో నాతో పాటు జట్టు సభ్యులు, మేనేజ్‌మెంట్‌ను కూడా ప్రమాదంలో పడేశాను. నా తప్పును అంగీకరిస్తూ బయో సెక్యూర్ బబుల్‌లో ఉన్న ప్రతీ ఒక్కరికి క్షమాపణలు చెబుతున్నా. సిరీస్ కీలక దశలో టెస్టుకు దూరం కావడం చాలా బాధగా ఉంది. నా పొరపాటుతో ఇరు జట్లను నిరాశపర్చినందుకు మళ్లీ సారీ’ – ఆర్చర్
Comments
Please login to add a commentAdd a comment