‘లార్డ్స్‌’లో రాత మారేనా!  | India and England second Test from today | Sakshi
Sakshi News home page

‘లార్డ్స్‌’లో రాత మారేనా! 

Published Thu, Aug 9 2018 1:24 AM | Last Updated on Thu, Aug 9 2018 7:30 AM

India and England second Test from today - Sakshi

తొలి టెస్టులో కోహ్లికి కనీసం మరో బ్యాట్స్‌మన్‌ సహకరించి ఉంటే... ఇంగ్లండ్‌ ఇచ్చిన క్యాచ్‌లను మన ఫీల్డర్లు మొదటి ప్రయత్నంలోనే అందుకొని ఉంటే... క్రికెట్‌లో ఇలా జరిగి ఉంటే, అలా చేసి ఉంటే లాంటి మాటలకు తావు లేదు. కానీ తాము అత్యుత్తమంగా ఆడకపోయినా మ్యాచ్‌ను గెలుచుకోగలిగామని ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ చేసిన వ్యాఖ్యను బట్టి చూస్తే భారత్‌ గెలిచే అవకాశాలు పోగొట్టుకొని చేతులారా పరాజయం కొనితెచ్చుకుందనేది వాస్తవం. ఇప్పుడు సరైన జట్టును ఎంచుకొని ఆ తప్పులను సరిదిద్దుకుంటూ లెక్క సరి చేసేందుకు టీమిండియా సిద్ధమైంది. గత పర్యటనలో ఏకైక విజయం అందించిన చరిత్రాత్మక లార్డ్స్‌ మైదానంలో మన రాత మారుతుందా అనేది చూడాలి. మరోవైపు సొంతగడ్డపై కూడా తడబడుతున్న ఇంగ్లండ్‌ ఈసారి ఎలాంటి పోటీనిస్తుందనేది ఆసక్తికరం.  

లండన్‌: ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌లో 0–1తో వెనుకబడిన భారత్‌ లెక్క సరి చేయా లని పట్టుదలగా ఉంది. 2014 సిరీస్‌లో ఇదే మైదానంలో ఇషాంత్‌ శర్మ జోరుతో విజయం సాధించిన టీమిండియా అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని భావిస్తోంది. మరోవైపు ‘హోం ఆఫ్‌ క్రికెట్‌’లో గత కొంత కాలంగా నిరాశాజనక ప్రదర్శనను కనబరుస్తున్న ఇంగ్లండ్‌ను చిత్తు చేసేందుకు టీమిండియాకు ఇంతకంటే మంచి అవకాశం దక్కదు. ఈ నేపథ్యంలో నేటి నుంచి ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానంలో జరిగే రెండో టెస్టుకు ఇరు జట్లు సన్నద్ధమయ్యాయి. 

కుల్దీపా... జడేజానా? 
ఎడ్జ్‌బాస్టన్‌లో చేదు ఫలితం భారత తుది జట్టులో కచ్చితంగా మార్పులు చేయాలనే పరిస్థితిని కల్పించింది. ఆ మ్యాచ్‌లో పుజారాను ఆడించకపోవడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. అయితే బయటి వ్యక్తుల వ్యాఖ్యలకు స్పందించి మార్పులు చేసే తత్వం కోహ్లిది కాదు కాబట్టి ఇప్పటికీ పుజారా స్థానంపై సందేహమే. కాబట్టి రాహుల్, ధావన్‌లలో ఒకరిని తప్పించే అవకాశం కూడా లేదు. బర్మింగ్‌హామ్‌లో ధావన్, విజయ్, రాహుల్, రహానే పూర్తిగా నిరాశపర్చారు. సిరీస్‌లో మనకు విజయావకాశాలు ఉండాలంటే వీరు ఇక్కడైనా తమ ఆటకు పదును పెట్టాల్సిందే. అదనపు బ్యాట్స్‌మన్‌ తప్పనిసరి అనుకుంటేనే గత మ్యాచ్‌లో పెద్దగా బౌలింగ్‌ చేయని హార్దిక్‌ పాండ్యాను తప్పించవచ్చు. అయితే లార్డ్స్‌ పిచ్‌ ఆట సాగినకొద్దీ పొడిబారుతుందని భావిస్తుండటంతో అదనపు స్పిన్నర్‌ వైపే జట్టు మొగ్గు చూపవచ్చు. అదే జరిగితే పేసర్‌ ఉమేశ్‌పై ముందుగా వేటు పడుతుంది. రెండో స్పిన్నర్‌గా కుల్దీప్‌ లేదా జడేజాను ఎంచుకోవచ్చు. 2014లో లార్డ్స్‌లో విజయంలో జడేజా కూడా కీలక పాత్ర పోషించాడు. అయితే తాజా ఫామ్‌ను బట్టి చూస్తే కుల్దీప్‌ వైపు మొగ్గు కనిపిస్తోంది. బుధవారం ప్రాక్టీస్‌ సెషన్‌లో కెప్టెన్‌ను కూడా కుల్దీప్‌ ఇబ్బంది పెట్టాడు. పైగా ఇంగ్లండ్‌పై మానసికంగా కూడా అతనిదే పైచేయి. ప్రధాన స్పిన్నర్‌గా అశ్విన్‌ పాత్ర మరోసారి కీలకం కానుంది.  

పోప్‌కు చోటు... 
తొలి టెస్టులో ఇంగ్లండ్‌ ఆట కూడా గొప్పగా ఏమీ లేదు. అయితే అదృష్టం కలిసొచ్చి ఆ జట్టు గట్టెక్కింది. అత్యంత సీనియర్‌ కుక్‌ కూడా అశ్విన్‌ బంతులకు జవాబివ్వలేకపోతున్నాడు. మరో ఓపెనర్‌ జెన్నింగ్స్‌ది కూడా అదే పరిస్థితి. ఫలితంగా మరోసారి కెప్టెన్‌ రూట్, ఫామ్‌లో ఉన్న బెయిర్‌స్టోలపైనే భారం పడుతోంది. మలాన్‌ను తప్పించడంతో 20 ఏళ్ల ఒలివర్‌ పోప్‌ టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేయనున్నాడు. గత మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైన బట్లర్‌ ఈసారైనా రాణించాలని జట్టు ఆశిస్తోంది. అండర్సన్, స్టువర్ట్‌ బ్రాడ్‌లకు తోడు కొత్త కుర్రాడు స్యామ్‌ కరన్‌ బౌలింగ్‌లో కూడా పదును ఉండటం ఇంగ్లండ్‌ బలాన్ని పెంచింది. అనేక విమర్శల మధ్య జట్టులోకి వచ్చిన లెగ్‌ స్పిన్నర్‌ ఆదిల్‌ రషీద్‌ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి వేసిన ఓవర్లు 12 మాత్రమే! ఈసారి అతడిని ఇంగ్లండ్‌ ఎలా వాడుకుంటుందో చూడాలి. అయితే ఇంగ్లండ్‌కు అతి పెద్ద దెబ్బ బెన్‌ స్టోక్స్‌ దూరం కావడంతో తగిలింది. బ్రిస్టల్‌ గొడవకు సంబంధించి కోర్టు విచారణ కొనసాగుతుండటంతో స్టోక్స్‌ టెస్టుకు దూరం కావడం ఖాయమైపోయింది. అతని స్థానంలో సరిగ్గా అదే శైలి ఉన్న క్రిస్‌ వోక్స్‌కు అవకాశం దక్కవచ్చు. అయితే రెండో స్పిన్నర్‌ కావాలని భావిస్తే బ్యాటింగ్‌ సత్తా ఉన్న మొయిన్‌ అలీ వైపు మొగ్గు చూపవచ్చు.  

ఒక్క మ్యాచ్‌లో మా ప్రదర్శనను చూసి జట్టుపై అంచనాకు రావద్దు. వైఫల్యానికి ఫలానా కారణమని చెప్పలేం. సాంకేతిక లోపాలకంటే మానసిక బలహీనత వల్లే మేం వికెట్లు కోల్పోయామని భావిస్తున్నాం. తొలి 20–30 బంతులు ఎలా ఆడాలనే దానిపై దృష్టి పెట్టాం. ఇక్కడ దూకుడుకంటే సంయమనమే కీలక పాత్ర పోషిస్తుంది. కెప్టెన్‌గా నేను ఏం చేయగలనో అది చేస్తున్నాను. నేను ఎంత బాగా ఆడినా జట్టు గెలవడం ముఖ్యం. అది నేను కాకుండా ఎవరు గెలిపించినా సరే. నేను విఫలమై మ్యాచ్‌ గెలిచి ఉంటే అస్సలు బాధపడకపోయేవాడిని. ఇక్కడ పిచ్‌ను బట్టి చూస్తే ఇద్దరు స్పిన్నర్ల అవసరం కనిపిస్తోంది.  –విరాట్‌ కోహ్లి, భారత కెప్టెన్‌   

పిచ్, వాతావరణం 
ఇంగ్లండ్‌లో ప్రస్తుతం తీవ్ర ఎండలు కొనసాగుతుండగా పిచ్‌పై పచ్చికను నిలిపి ఉంచేందుకు లార్డ్స్‌ క్యురేటర్లు గత కొద్ది రోజులుగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇంత చేసినా పిచ్‌ వేగంగా పొడిబారవచ్చని తెలుస్తోంది. కాబట్టి స్పిన్‌కు అనుకూలించవచ్చు. అయితే మొదటి రెండు రోజులు మాత్రం చల్లగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. దాంతో స్వింగ్‌కు కూడా అవకాశం ఉంది.  

తుది జట్లు (అంచనా) 
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), ధావన్, విజయ్, రాహుల్, రహానే, కార్తీక్, పాండ్యా, కుల్దీప్‌/జడేజా, అశ్విన్, ఇషాంత్, షమీ.  
ఇంగ్లండ్‌: రూట్‌ (కెప్టెన్‌), కుక్, జెన్నింగ్స్, పోప్, బెయిర్‌స్టో, బట్లర్, వోక్స్‌/అలీ, రషీద్, కరన్, బ్రాడ్, అండర్సన్‌. 

►లార్డ్స్‌ మైదానంలో 17 టెస్టులు ఆడిన భారత్‌ 2 గెలిచి, 11 ఓడింది. మరో 4 డ్రాగా ముగిశాయి 

►మధ్యాహ్నం గం. 3.30 నుంచి సోనీ సిక్స్, సోనీ టెన్‌–3లలో ప్రత్యక్ష ప్రసారం   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement