నేడు ఇంగ్లండ్‌తో భారత్ ఐదో టి20 మ్యాచ్
సంజూ సామ్సన్, సూర్యకుమార్‌లకు మరో అవకాశం
ఒత్తిడిలో బట్లర్ బృందం
రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
ముంబై: ఇప్పటికే సిరీస్ భారత్ చేతికందింది. ఇక మిగిలిందల్లా ఆధిక్యం పెంచుకోవడమే! మూడు వన్డేల సిరీస్‌కు ముందు ఈ చివరి మ్యాచ్ గెలిచి... 4–1తో ఆధిక్యం, ఆత్మవిశ్వాసంతో వెళ్లాలని టీమిండియా భావిస్తోంది. ఇక ఇంగ్లండ్ పరిస్థితి దీనికి భిన్నం. చేజారిన సిరీస్‌తో ఒత్తిడిలో ఉన్న బట్లర్ బృందం ఇప్పుడు భారత్ ఆధిపత్యానికి గండి కొట్టాలని... ఈ పొట్టి సిరీస్‌లో ఆతిథ్య జట్టు శుభారంభమివ్వగా... విజయంతో ముగింపు తమది కావాలని ఇంగ్లండ్ జట్టు గట్టిగా ఆశిస్తోంది.
ఈ నేపథ్యంలో ఆఖరి పోరులో పైచేయి సాధించేందుకు పర్యాటక జట్టు సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమైంది. మొత్తంమీద ఇరుజట్ల మధ్య మరో రసవత్తర పోరుకు నేడు వాంఖెడే స్టేడియం వేదిక కానుంది.
సంజూ... మెరిపించు!
ఈ సిరీస్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ ఆడాడు. తిలక్ వర్మ గెలిపించే ‘షో’ చేశాడు. హార్దిక్ పాండ్యా అసలైన ఆటను గత మ్యాచ్‌లో బయటికి తెచ్చాడు. అక్షర్ పటేల్ బంతితో లేదంటే బ్యాటింగ్‌తో జట్టుకు అక్కరకొస్తున్నాడు. అంతెందుకు అరకొరగా... అంటే శివమ్ దూబే ‘కన్‌కషన్’తో తుది జట్టులోకి వచ్చిన హర్షిత్ రాణా కూడా మ్యాచ్ గెలిపించే బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు.
కానీ టాప్–4లో ఓపెనర్ సంజూ సామ్సన్, కెప్టెన్ సూర్యకుమార్‌లతోనే జట్టు మేనేజ్‌మెంట్ కలవరపడుతోంది. తర్వాతి ప్రపంచకప్ వేటకు కోచ్ గంభీర్ కోర్ గ్రూపులోని ఆటగాళ్లు ఇలా వరుసగా విఫలమవడం జట్టుకు ప్రతికూలంగా మారింది.
బౌలింగ్‌లో అర్ష్ దీప్, పాండ్యాలు వెన్నుదన్నుగా నిలుస్తుంటే స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఉన్నపళంగా మ్యాచ్‌ను మలుపుతిప్పే మాయాజాలంతో ఆకట్టుకుంటున్నాడు. రవి బిష్ణోయ్ కూడా ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నాడు.
2–3 లక్ష్యంతో ఇంగ్లండ్
సిరీస్‌ను కోల్పోయిన ఇంగ్లండ్‌కు ఇప్పుడు ఆఖరి పంచ్ మాత్రమే మిగిలుంది. ఇందులో తమ పవర్ చాటుకొని తదుపరి వన్డే సిరీస్‌ను తాజాగా ప్రారంభించాలని బట్లర్ జట్టు అనుకుంటుంది. సాల్ట్ గత మ్యాచ్‌లో టచ్‌లోకి వచ్చినా కొద్దిసేపే క్రీజులో ఉన్నాడు. ఇప్పుడు లయను అందుకుంటే బెన్ డకెట్‌తో ఓపెనింగ్ వికెట్‌కు భారీ ఆరంభం ఇవ్వగలడు.
ఇదే జరిగితే... తదుపరి పరుగుల ప్రవాహాన్ని బట్లర్, హ్యారీ బ్రూక్, లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, బ్రైడన్ కార్స్‌లు తీసుకెళ్తారు. ఆర్చర్, సకిబ్ మహమూద్ పేస్‌తో ఆకట్టుకుంటుండగా, స్పిన్‌తో ఆదిల్ రషీద్ నిలకడను ప్రదర్శిస్తున్నాడు. సిరీస్ చేజారినా... సమరంలో పట్టు కోల్పోరాదని ఐదో టి20లో నిరూపించుకోవాలని ఇంగ్లండ్ బృందం చూస్తోంది.
పిచ్, వాతావరణం
వాంఖెడే బ్యాటింగ్‌కు అచ్చొచ్చే పిచ్. చాలా మ్యాచ్‌ల్లో, ప్రత్యేకించి టి20ల్లో చేజింగ్ జట్లకు విజయ అవకాశాలిచ్చింది. అలాగని బౌలింగ్ తేలిపోదు. స్పిన్నర్లు ప్రభావం చూపొచ్చు. వాన ముప్పు లేదు.
5 వాంఖెడే మైదానంలో ఇప్పటి వరకు భారత జట్టు ఐదు టి20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో మూడింటిలో గెలిచి, రెండింటిలో ఓడిపోయింది. చివరి మూడు మ్యాచ్‌ల్లో భారత జట్టే నెగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment