మళ్లీ ఓడిన మహిళల జట్టు | India lost in the first T20 match against England | Sakshi
Sakshi News home page

మళ్లీ ఓడిన మహిళల జట్టు

Published Tue, Mar 5 2019 1:18 AM | Last Updated on Tue, Mar 5 2019 1:18 AM

India lost in the first T20 match against England - Sakshi

గువాహటి: తొలుత బౌలర్లు... ఆ తర్వాత బ్యాటర్లు విఫలమవ్వడంతో... ఇంగ్లండ్‌ మహిళల జట్టుతో స్థానిక బర్సపర స్టేడియంలో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టుకు ఓటమి ఎదురైంది. ఈ ఫార్మాట్‌లో భారత మహిళల జట్టుకిది వరుసగా ఐదో పరాజయం కావడం గమనార్హం. గత నెలలో న్యూజిలాండ్‌ పర్యటనలో ఆడిన మూడు టి20ల్లోనూ ఓడిన భారత జట్టు... గత సంవత్సరం వెస్టిండీస్‌ ఆతిథ్యమిచ్చిన టి20 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ చేతిలో ఓటమి చవిచూసింది. రెగ్యులర్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో స్మృతి మంధానకు తొలిసారి జాతీయ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. టాస్‌ గెలిచిన స్మృతి మంధాన ఫీల్డింగ్‌ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 160 పరుగులు చేసింది.

ఓపెనర్లు వ్యాట్‌ (34 బంతుల్లో 35; 5 ఫోర్లు), టామీ బీమోంట్‌ (57 బంతుల్లో 62; 9 ఫోర్లు) దూకుడుగా ఆడుతూ తొలి వికెట్‌కు 89 పరుగులు జోడించి ఇంగ్లండ్‌కు గట్టి పునాది వేశారు. వ్యాట్‌ను ఔట్‌ చేసి ఈ భాగస్వామ్యాన్ని శిఖా పాండే విడగొట్టింది. ఆ తర్వాత సివెర్‌ తక్కువ స్కోరుకే వెనుదిరగ్గా... కెప్టెన్‌ హీథెర్‌ నైట్‌ (20 బంతుల్లో 40 నాటౌట్‌; 7 ఫోర్లు)తో కలిసి బీమోంట్‌ ఇన్నింగ్స్‌ను నడిపించింది. వీరిద్దరు మూడో వికెట్‌కు 59 పరుగులు జోడించారు. చివరి ఓవర్లో బీమోంట్‌ ఔటైనా అప్పటికే ఇంగ్లండ్‌ గౌరవప్రదమైన స్కోరు నమోదు చేసింది. భారత బౌలర్లలో రాధా యాదవ్‌ రెండు వికెట్లు తీయగా... శిఖా పాండే, దీప్తి శర్మలకు ఒక్కో వికెట్‌ లభించింది.

161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టుకు శుభారంభం లభించలేదు. తొలి వికెట్‌కు హర్లీన్‌ డియోల్, స్మృతి మంధాన 21 పరుగులు జోడించి నిలదొక్కుకున్నట్లు అనిపించిన దశలో ఇంగ్లండ్‌ బౌలర్లు బ్రంట్, లిన్సీ స్మిత్‌ విజృంభించారు. ఏడు బంతుల తేడాలో హర్లీన్, స్మృతి, జెమీమాలను పెవిలియన్‌కు పంపించి భారత్‌ను దెబ్బ తీశారు. మిథాలీ రాజ్‌ మళ్లీ నిరాశపర్చగా... పునరాగమనం చేసిన వేద కృష్ణమూర్తి కూడా వెంటనే ఔటైంది. దాంతో భారత్‌ 76 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి విజయంపై ఆశలు వదులుకుంది. దీప్తి శర్మ (22 నాటౌట్‌), శిఖా పాండే (21 బంతుల్లో 23 నాటౌట్‌; 4 ఫోర్లు) ఏడో వికెట్‌కు 43 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసినా ఫలితం లేకపోయింది.  ఇరు జట్ల మధ్య రెండో టి20 గురువారం జరుగుతుంది. 

ఈ మ్యాచ్‌తో స్మృతి మంధాన (22 ఏళ్ల 229 రోజులు) టి20 ఫార్మాట్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందింది. గతంలో ఈ రికార్డు సురేశ్‌ రైనా 
(23 ఏళ్ల 197 రోజులు), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 
(23 ఏళ్ల 237 రోజులు) పేరిట ఉండేది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement