చేజేతులా... ఓడించాడు
ఏకైక టి20లో భారత్ ఓటమి
3 పరుగులతో గెలిచిన ఇంగ్లండ్
కోహ్లి శ్రమ వృథా
దుమ్మురేపిన మోర్గాన్
భారత్ విజయానికి 6 బంతుల్లో 17 పరుగులు కావాలి. తొలి బంతికే ధోని సిక్సర్ బాదాడు. రెండో బంతికి రెండు పరుగులు...ఇక కావలసింది 4 బంతుల్లో 9 మాత్రమే. రెండో ఎండ్‌లో రాయుడు ఉన్నాడు. ఈ దశలో భారత్ విజయం లాంఛనమే కావాలి. మూడో బంతికి సింగిల్ అవకాశం ఉన్నా ధోని తీయలేదు.
నాలుగో బంతిని బౌండరీకి పంపాడు. ఇక రెండు బంతుల్లో 5 చాలు. ఐదో బంతికి సింగిల్ వచ్చే అవకాశం ఉన్నా రాయుడుని వెనక్కి పంపాడు. ఆఖరి బంతికి ఫోర్ కొడితే టై.. సిక్సర్ కొడితే విజయం. కానీ ధోని కేవలం ఒక్క పరుగే చేశాడు. తనపై తనకు నమ్మకమో... రాయుడు మీద అపనమ్మకమో కానీ... రెండు సింగిల్స్ వదిలేసి రిస్క్ తీసుకున్న ధోని ఇంగ్లండ్‌తో ఏకైక టి20లో భారత్‌ను చేజేతులా ఓడించాడు.
బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్ పర్యటనను భారత జట్టు నిరాశతో ముగించింది. టెస్టుల్లో ఘోరంగా ఓడి, వన్డేల్లో విజయంతో ప్రతీకారం తీర్చుకున్న ధోనిసేన.. ఏకైక టి20లో ఆఖరి ఓవర్‌లో ధోని ‘రిస్క్’తో ఓడిపోయింది. ఆదివారం ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 3 పరుగులతో భారత్‌ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 180 పరుగులు చేసింది.
మోర్గాన్ (31 బంతుల్లో 71; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), హేల్స్ (25 బంతుల్లో 40; 3 ఫోర్లు, 3 సిక్సర్లు)లతో పాటు చివర్లో బొపారా (9 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్సర్) చెలరేగి ఆడారు. ఓ దశలో 27 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను హేల్స్, రూట్ (29 బంతుల్లో 26; 2 ఫోర్లు) మూడో వికెట్‌కు 48 పరుగులు జోడించి ఆదుకున్నారు. మోర్గాన్... బట్లర్ (15 బంతుల్లో 10)తో కలిసి ఐదో వికెట్‌కు 45; బొపారాతో కలిసి ఆరో వికెట్‌కు 13 బంతుల్లో 31 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు చేసింది. ఇంగ్లండ్ చివరి ఐదు ఓవర్లలో ఏకంగా 81 పరుగులు చేయడం విశేషం. షమీ 3, మోహిత్, కరణ్, జడేజా తలా ఓ వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 177 పరుగులు చేసి ఓడింది. కోహ్లి (41 బంతుల్లో 66; 9 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. ధావన్ (28 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), రైనా (20 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్), ధోని (18 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించారు. రహానే (8) తొందరగా అవుటైనా కోహ్లి రెండు కీలక భాగస్వామ్యాలతో ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. ధావన్‌తో కలిసి రెండో వికెట్‌కు 79; రైనాతో కలిసి మూడో వికెట్‌కు 42 పరుగులు జోడించాడు. చివర్లో ధోని వేగంగా ఆడినా లక్ష్యాన్ని ఛేదించలేకపోయాడు. ఫిన్, అలీ, గుర్నీ, వోక్స్ తలా ఓ వికెట్ తీశారు. మోర్గాన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
స్కోరు వివరాలు
ఇంగ్లండ్ ఇన్నింగ్స్: జాసన్ రాయ్ (సి) రహానే (బి) షమీ 8; హేల్స్ (సి) రహానే (బి) జడేజా 40; అలీ (సి) రహానే (బి) మోహిత్ 0; రూట్ (సి) రాయుడు (బి) కరణ్ శర్మ 26; మోర్గాన్ (సి) రహానే (బి) షమీ 71; బట్లర్ (సి) రాయుడు (బి) షమీ 10; బొపారా నాటౌట్ 21; వోక్స్ రనౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 180.
వికెట్ల పతనం: 1-26; 2-27; 3-75; 4-85; 5-130; 6-166; 7-180
బౌలింగ్: అశ్విన్ 4-0-37-0; మోహిత్ శర్మ 4-0-39-1; షమీ 4-0-38-3; కరణ్ శర్మ 4-0-28-1; జడేజా 4-0-35-1.
భారత్ ఇన్నింగ్స్: రహానే (బి) అలీ 8; ధావన్ (బి) వోక్స్ 33; కోహ్లి (సి) హేల్స్ (బి) ఫిన్ 66; రైనా (బి) గుర్నీ 25; ధోని నాటౌట్ 27; జడేజా రనౌట్ 7; రాయుడు నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 177.
వికెట్ల పతనం: 1-10; 2-89; 3-131; 4-145; 5-153
బౌలింగ్: ఫిన్ 4-0-28-1; మొయిన్ అలీ 3-0-31-1; గుర్నీ 4-0-29-1; వోక్స్ 4-0-43-1; బొపారా 1-0-14-0; ట్రెడ్‌వెల్ 4-0-28-0.
రెండో ర్యాంక్‌కు పడిపోయిన భారత్
ఇంగ్లండ్ చేతిలో ఓటమితో ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానాన్ని కోల్పోయింది. శ్రీలంక నంబర్‌వన్ స్థానానికి చేరింది.
‘ఆఖరి ఓవర్‌లో కనీసం రెండు ఫోర్లు మిస్ అయ్యాయి. ఇటీవలి కాలంలో ఇలాంటి ఆట ఆడలేదు. కచ్చితంగా భారీ షాట్లు కొడతానని నమ్మకంతో ఉన్నా. కానీ అలా జరగలేదు. ఓవరాల్‌గా లక్ష్య ఛేదన బాగానే సాగింది. చివరి ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్నా.. మ్యాచ్ మధ్యలో బౌలర్లు బాగా కట్టడి చేశారు. మొత్తానికి ఇంగ్లండ్ టూర్ బాగానే జరిగింది’.
-ధోని