నేడు భారత్, ఇంగ్లండ్‌ల
మధ్య ఏకైక టి20 మ్యాచ్
రాత్రి గం. 7.30 నుంచి
స్టార్ స్పోర్ట్స్-1లో
ప్రత్యక్ష ప్రసారం
బర్మింగ్‌హామ్: టెస్టుల్లో ఎదురైన పరాభవానికి వన్డే సిరీస్‌తో ప్రతీకారం తీర్చుకున్న భారత్ ఇప్పుడు పొట్టి ఫార్మాట్‌పై దృష్టిపెట్టింది. నేడు బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌తో జరగనున్న ఏకైక టి20 మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఐదు రోజుల ఫార్మాట్‌లో పూర్తిగా తడబడిన ధోనిసేన... వన్డేల్లో మాత్రం దుమ్మురేపింది. ఆఖరి వన్డేలో ఓడినా సిరీస్‌ను గెలుచుకోవడంతో జట్టులో ఆత్మ విశ్వాసం రెట్టింపయ్యింది. నాలుగో వన్డేలో భారీ స్కోర్లు చేసిన రహానే, ధావన్ పూర్తి ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం.
అయితే వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లి నిరాశజనక ప్రదర్శన టీమ్ మేనేజ్‌మెంట్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా రాణించి ఈ టూర్‌ను ఘనంగా ముగిస్తాడని అందరూ ఆశిస్తున్నారు. మిడిలార్డర్‌లో రైనా, రాయుడు, ధోని, జడేజాలు తమ విలువైన ఇన్నింగ్స్‌లతో జట్టును గెలుపుబాట పట్టిస్తున్నారు. ఆఖరి వన్డేలో నిరాశపర్చిన ఉమేశ్‌ను ఈ మ్యాచ్‌కు కొనసాగిస్తారో లేదో చూడాలి.
మరోవైపు ఆఖరి వన్డేలో గెలిచిన ఇంగ్లండ్ ఊపుమీదుంది. ఓపెనర్లు కుదురుకుంటే ఈ మ్యాచ్‌లోనూ భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. రూట్ తన ఫామ్‌ను కొనసాగించాలని కోరుకుంటున్నాడు. బట్లర్, స్టోక్స్ భారీ ఇన్నింగ్స్‌పై కన్నేశారు. అయితే కొత్త ఆటగాడు జాసన్ రే తుది జట్టులో ఉంటాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. బౌలింగ్‌లో ట్రెడ్‌వెల్, వోక్స్, బ్రెస్నన్‌లపై అధిక భారం పడనుంది. స్పిన్నర్ మొయిన్ అలీ ఆల్‌రౌండర్‌గా రాణించడం జట్టుకు అదనపు బలం.
జట్లు (అంచనా)
భారత్: ధోని (కెప్టెన్), ధావన్, రహానే, కోహ్లి, రైనా, రాయుడు, జడేజా, అశ్విన్, షమీ, భువనేశ్వర్, ఉమేశ్ / మోహిత్ శర్మ.
ఇంగ్లండ్: మోర్గాన్ (కెప్టెన్), హేల్స్, అలీ, రూట్, బట్లర్, స్టోక్స్, వోక్స్, ట్రెడ్‌వెల్, బ్రెస్నన్, ఫిన్, బొపారా / జాసన్.
ధనాధన్ పోరు
Published Sun, Sep 7 2014 12:22 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 PM
Advertisement