ఓటమికి నాదే బాధ్యత!
* టి20 ఫలితంపై ధోని
* కుర్రాళ్లకు అనుభవం దక్కింది
* ఇంగ్లండ్ పర్యటనను విశ్లేషించిన కెప్టెన్
బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరిగిన టి20 మ్యాచ్‌లో ఓటమికి తానే కారణమని భారత కెప్టెన్ ఎం.ఎస్.ధోని అంగీకరించాడు. ఈ మ్యాచ్‌లో విజయానికి చివరి రెండు బంతుల్లో ఐదు పరుగులు చేయాల్సి ఉండగా ధోని సింగిల్ మాత్రమే తీయడంతో భారత్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. ‘నేను తొలి బంతికే బౌండరీ కొట్టాను. కొంత ఒత్తిడి ఉన్నా చివరి రెండు బంతుల్లో పరుగులు సాధించగలనని నమ్మకంతో ఉన్నాను. నేను సరిగ్గా షాట్ కొట్టలేకపోయిన ఒకానొక రోజుల్లో ఇదీ ఒకటి. నా కర్తవ్యం పూర్తి చేయలేదు కాబట్టి ఓటమికి కూడా బాధ్యత తీసుకోవాల్సిందే’ అని స్పష్టం చేశాడు. సింగిల్‌కు అవకాశం ఉన్నా కాదని... రాయుడుకు స్ట్రైక్ ఇవ్వకుండా ఆగిన తన నిర్ణయాన్ని కెప్టెన్ సమర్థించుకున్నాడు.
‘రాయుడు అప్పుడే బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇంకా షాట్లు కొట్టలేకపోతున్నాడు. ఆరు లేదా ఏడు స్థానాల్లో వచ్చీ రాగానే భారీ షాట్ ఆడే శైలి కూడా రాయుడిది కాదు. కాబట్టి నేను స్ట్రైక్ తీసుకోవడమే సరైంది. అయితే అది సత్ఫలితాన్నివ్వలేదు. మ్యాచ్‌ను నేనే ముగించాలని ఓవర్ ఆరంభంలోనే నిర్ణయించుకున్నాను. రాయుడు కూడా ఆడేవాడేమో కానీ అది నా బలం. అందుకే బాధ్యత తీసుకున్నాను’ అని ధోని వ్యాఖ్యానించాడు. భారత పేసర్లు యార్కర్లు వేయడంలో ఇబ్బంది పడుతున్నారని అంగీకరించిన ధోని, ప్రతీ ఫార్మాట్‌కు తగిన విధంగా లైన్ అండ్ లెంగ్త్ మార్చి ప్రయత్నిస్తే ఫలితం దక్కుతుందని అభిప్రాయ పడ్డాడు.
నేర్చుకుంటే చాలు
రెండు నెలల సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటనను ధోని సంతృప్తికరమైందిగా విశ్లేషించాడు. ముఖ్యంగా తొలి సారి ఐదు టెస్టుల సిరీస్ ఆడటం యువ ఆటగాళ్లకు భవిష్యత్తులో ఉపకరిస్తుందన్నాడు. ‘ఈ పర్యటనలో చాలా మంది కొత్త కుర్రాళ్లు ఆడారు. తొలి రెండు టెస్టుల్లో మేం బాగా ఆడాం. ఆఖరి మూడింటిలో వ్యతిరేక ఫలితం వచ్చింది. దాంతో వన్డేల్లో రాణించాల్సిన అవసరం ఏర్పడింది. మేం సిరీస్ గెలుచుకోగలిగాం. టూర్‌లో 20-25 రోజులు మంచి క్రికెట్ ఆడలేదు. అయితే ఇక్కడ దక్కిన అనుభవంనుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే వెస్టిండీస్, ఆస్ట్రేలియా సిరీస్‌లలో ఈ పాఠాలను సరిగ్గా అమలు చేయగలిగితే నేను చాలా సంతృప్తి పడతాను’ అని ధోని యువ ఆటగాళ్లకు దిశానిర్దేశం చేశాడు.
కొత్త వివాదంలో తలదూర్చను
టి20 మ్యాచ్ సందర్భంగా బర్మింగ్‌హామ్ మైదానంలో ప్రేక్షకులు ఇంగ్లండ్ క్రికెటర్ మొయిన్ అలీని హేళన చేసిన ఘటనపై స్పందించేందుకు ధోని నిరాకరించాడు. ‘జడేజాను కూడా గేలి చేసినప్పుడు మీరేమైనా అడిగారా? పర్యటన చివరి రోజు దానిపై స్పందించి నేను కొత్త వివాదం కొని తెచ్చుకోదల్చుకోలేదు’ అని ధోని ఖరాఖండీగా చెప్పేశాడు.