ఇంగ్లండ్‌ గడ్డపై ఆ.. ఆరు ముత్యాలు | Indian cricket Memorable events on England | Sakshi
Sakshi News home page

ఆ... ఆరు ముత్యాలు

Published Tue, Jul 31 2018 12:19 AM | Last Updated on Tue, Jul 31 2018 6:38 AM

Indian cricket Memorable events on England  - Sakshi

ఇంగ్లండ్‌లో మొత్తం 17 టెస్టు సిరీస్‌లు ఆడిన భారత్‌ మూడు సిరీస్‌లను సొంతం చేసుకుంది. ఒకదాంట్లో ‘డ్రా’తో గట్టెక్కగా... మరో 13 సిరీస్‌లలో ఓటమి చవిచూసింది. ఈ క్రమంలో 57 టెస్టులు ఆడి ఆరు మ్యాచ్‌లలో విజయాలు సాధించి, 30 మ్యాచ్‌ల్లో ఓడింది. 21 టెస్టులు ‘డ్రా’గా ముగిశాయి. రేపటి నుంచి మరో రసవత్తర పోరుకు తెర లేవనుంది. ఈ నేపథ్యంలో నాటి ఆరు ఆణి ముత్యాలను గుర్తు చేసుకుందాం. వచ్చే ఆరు వారాల్లో మరికొన్ని మధుర క్షణాలు ఈ జాబితాలో భాగమవుతాయని ఆశిద్దాం.

సాక్షి క్రీడా విభాగం : 1971 – ఓవల్‌ గ్రౌండ్, లండన్‌ (4 వికెట్లతో భారత్‌ విజయం) – కెప్టెన్‌ అజిత్‌ వాడేకర్‌  మూడు టెస్టుల సిరీస్‌లో తొలి రెండు టెస్టులు ‘డ్రా’గా ముగిసిన అనంతరం స్పిన్‌ పిచ్‌పై జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్‌కు దక్కిన విజయమిది. నాట్, హటన్, జేమ్సన్‌ అర్ధ సెంచరీల సహాయంతో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 355 పరుగులు చేయగా, భారత్‌ 284 పరుగులకే ఆలౌటై 71 పరుగుల ఆధిక్యం కోల్పోయింది. కీపర్‌ ఫరూఖ్‌ ఇంజినీర్, దిలీప్‌ సర్దేశాయ్‌ హాఫ్‌ సెంచరీలు నమోదు చేశారు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో దిగ్గజ స్పిన్నర్‌ బీఎస్‌ చంద్రశేఖర్‌ (6/38) ధాటికి ఇంగ్లండ్‌ 101 పరుగులకే కుప్పకూలింది. 173 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అజిత్‌ వాడేకర్‌ (45 నాటౌట్‌) చివరి వరకు పట్టుదలగా నిలబడగా, మన హైదరాబాదీ ఆబిద్‌ అలీ విన్నింగ్‌ షాట్‌ కొట్టాడు.  
విశేషాలు: ఇంగ్లండ్‌ గడ్డపై తొలి టెస్టు ఆడిన 39 ఏళ్ల తర్వాత, 15 టెస్టుల్లో పరాజయాల తర్వాత భారత్‌ టెస్టు గెలవగలిగింది.  వరుసగా 26 టెస్టుల్లో ఓడిపోని ఇంగ్లండ్‌ రికార్డు కూడా ఈ మ్యాచ్‌తో బద్దలైంది.  

1986 – లార్డ్స్, లండన్‌ (5 వికెట్లతో  భారత్‌ విజయం) – కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ 
మూడు టెస్టుల సిరీస్‌లో భారత్‌ వరుసగా తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గి సిరీస్‌ సొంతం చేసుకోవడం విశేషం. కపిల్‌ నేతృత్వంలోని మన టీమ్‌ అన్ని విధాలా ప్రత్యర్థిపై ఆధిక్యం ప్రదర్శించింది. తొలి టెస్టులో ఇంగ్లండ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 294 పరుగులు చేసింది. గూచ్‌ (114) సెంచరీ సాధించగా, చేతన్‌ శర్మ 5 వికెట్లు పడగొట్టాడు. వెంగ్సర్కార్‌ (126 నాటౌట్‌) శతకం సహాయంతో భారత్‌ 341 పరుగులు సాధించి 47 పరుగుల ఆధిక్యం అందుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో కపిల్‌ (4/52) ధాటికి ఇంగ్లండ్‌ 180కే ఆలౌటైంది. భారత్‌ 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. కపిల్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.  
విశేషాలు: చారిత్రాత్మక లార్డ్స్‌ మైదానంలో మూడు సెంచరీలు సాధించిన తొలి విదేశీ ఆటగాడిగా వెంగ్సర్కార్‌ నిలిచాడు. లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ ఫిల్‌ ఎడ్మండ్‌ వేసిన ఓవర్లో కపిల్‌ వరుసగా 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 18 పరుగులు రాబట్టి మ్యాచ్‌ను ముగించాడు. కెప్టెన్‌గా 21 టెస్టుల్లో  కపిల్‌కు ఇదే తొలి విజయం.

1986 – లీడ్స్‌ (279 పరుగులతో భారత్‌ విజయం) – కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ 
భారత్‌ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గెలుపు అందుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 272 పరుగులకు ఆలౌటైంది. వెంగ్సర్కార్‌ (61) టాప్‌ స్కోరర్‌. ఆ తర్వాత ఇంగ్లండ్‌ రోజర్‌ బిన్నీ (5/40) దెబ్బకు 102 పరుగులకే కుప్పకూలి ఏకంగా 170 పరుగుల ఆధిక్యం కోల్పోయింది. అనంతరం వెంగ్సర్కార్‌ (102 నాటౌట్‌) సెంచరీ సహాయంతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 237 పరుగులు చేసి 408 పరుగుల లక్ష్యాన్ని విసిరింది. అయితే ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేయడంతో జట్టు 128కే ఆలౌటైంది. మణీందర్‌ సింగ్‌ (4/26) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. వెంగ్సర్కార్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. 15 ఏళ్లకే భారత్‌ మళ్లీ ఇక్కడ సిరీస్‌ గెలవగలిగింది.  
విశేషాలు: భారత దేశవాళీ దిగ్గజం, వికెట్‌ కీపర్‌ చంద్రకాంత్‌ పండిత్‌కు ఇది తొలి మ్యాచ్‌. అయితే మోరె కీపర్‌గా ఉండటంతో స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా అతనికి అవకాశం దక్కింది.  

2002 – లీడ్స్‌ (ఇన్నింగ్స్, 46 పరుగులతో  భారత్‌ విజయం) – కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ  
తొలి టెస్టును ఓడి, రెండో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్న అనంతరం భారత్‌కు దక్కిన విజయమిది. ఆ తర్వాత చివరి టెస్టు కూడా ‘డ్రా’ కావడంతో సిరీస్‌ 1–1తో సమంగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో సచిన్‌ (193), ద్రవిడ్‌ (148), గంగూలీ (128) పరుగుల వరద పారించడంతో భారత్‌ 8 వికెట్లకు 628 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. అనంతరం ఇంగ్లండ్‌ 273 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 355 పరుగుల ఆధిక్యం సాధించిన భారత్‌... ప్రత్యర్థిని ఫాలోఆన్‌ ఆడించింది. కెప్టెన్‌ నాసిర్‌ హుస్సేన్‌ (110) పోరాడినా, ఇతర బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో ఇంగ్లండ్‌ 309 పరుగులకే పరిమితమై చిత్తుగా ఓడింది. కుంబ్లే 4 వికెట్లు తీయగా, ద్రవిడ్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. 
విశేషాలు: ముగ్గురు భారత దిగ్గజాలు ఒకే ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేయడం ఇదే మొదటిసారి. సచిన్‌కు ఇది 99వ టెస్టు కాగా, ఇదే మ్యాచ్‌లో బ్రాడ్‌మన్‌ 29 సెంచరీల రికార్డును అతను అధిగమించాడు.  

2014 – లార్డ్స్, లండన్‌ (95 పరుగులతో భారత్‌ విజయం ) – కెప్టెన్‌ ధోని 
తొలి టెస్టు ‘డ్రా’ అయిన తర్వాత జరిగిన ఈ రెండో టెస్టులో భారత్‌ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. అయితే తర్వాతి మూడు టెస్టులు ఓడి 1–3తో సిరీస్‌ చేజార్చుకుంది. రహానే (103) సెంచరీతో ముందుగా భారత్‌ 295 పరుగులు చేయగా, బ్యాలెన్స్‌ (110) శతకంతో ఇంగ్లండ్‌ 319 పరుగులు చేసింది. భువనేశ్వర్‌ 6 వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో విజయ్‌ (95), జడేజా (68), భువనేశ్వర్‌ (52) రాణించడంతో భారత్‌ 342 పరుగులు సాధించింది. 319 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఇషాంత్‌ శర్మ (7/74) దెబ్బ కొట్టాడు. ఫలితంగా ఆ జట్టు 223 పరుగులకే కుప్పకూలింది. ఈ టెస్టుకు ముందు నాటింగ్‌హామ్‌లో జడేజా–అండర్సన్‌ మధ్య పెద్ద గొడవ జరగ్గా... ఈ మ్యాచ్‌లో ఆఖరి వికెట్‌గా అండర్సన్‌ను జడేజా రనౌట్‌ చేయడం తీపి జ్ఞాపకం.  
విశేషాలు: లార్డ్స్‌ మైదానంలో భారత్‌కు 28 ఏళ్ల తర్వాత దక్కిన విజయమిది. మూడేళ్ల తర్వాత భారత్‌ విదేశాల్లో టెస్టు నెగ్గింది.   

2007 – నాటింగ్‌హామ్‌ (7 వికెట్లతో  భారత్‌ విజయం) కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ 
మూడు టెస్టుల సిరీస్‌లో తొలి, చివరి టెస్టులు ‘డ్రా’ కాగా, రెండో మ్యాచ్‌లో విజయంతో భారత్‌ 1–0తో సిరీస్‌ను గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా జహీర్‌ ఖాన్‌ (4/59) ధాటికి ఇంగ్లండ్‌ 198 పరుగులకే ఆలౌటైంది. సచిన్‌ (91), గంగూలీ (79), దినేశ్‌ కార్తీక్‌ (77), వసీం జాఫర్‌ (62), లక్ష్మణ్‌ (54) రాణించడంతో భారత్‌ 481 పరుగులు చేసింది. అనంతరం జహీర్‌ (5/75) జోరుకు ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 355 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ (124) సెంచరీ సాధించాడు. 73 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 3 వికెట్లు కోల్పోయి అందుకోగా, జహీర్‌కే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.  
విశేషాలు: విదేశీ గడ్డపై భారత్‌కు ఇది 200వ టెస్టు కాగా,  29వ విజయం. సచిన్‌ టెస్టుల్లో 11 వేల పరుగులు పూర్తి చేసుకున్న మ్యాచ్‌. ఈ సిరీస్‌ నుంచే ఇంగ్లండ్‌లో భారత్‌ టెస్టు సిరీస్‌ను ‘పటౌడీ ట్రోఫీ’గా వ్యవహరిస్తున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement