
ఆస్ట్రేలియా(India vs Australia)తో సెమీ ఫైనల్లో టీమిండియా బౌలర్లు రాణించారు. కంగారూ జట్టు భారీ స్కోరు చేయకుండా అడ్డుకట్ట వేశారు. 49.3 ఓవర్లలోనే స్మిత్ బృందాన్ని ఆలౌట్ చేశారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో తొలి సెమీ ఫైనల్లో గ్రూప్-‘ఎ’ టాపర్ భారత్- గ్రూప్-బి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా తలపడుతున్నాయి.
దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో మంగళవారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఆరంభంలోనే ఓపెనర్ కూపర్ కన్నోలి(0) వికెట్ కోల్పోయిన ఆసీస్ ఇన్నింగ్స్‌ను మరో ఓపెనర్ ట్రవిస్ హెడ్, కెప్టెన్ స్టీవ్ స్మిత్ చక్కదిద్దారు. హెడ్ 33 బంతుల్లో 39 పరుగులు చేయగా.. వరుణ్ చక్రవర్తి అద్భుత బంతితో అతడిని పెవిలియన్‌కు పంపాడు.
స్మిత్, క్యారీ హాఫ్ సెంచరీలు
ఇక అర్ధ శతకం పూర్తి చేసుకుని ప్రమాదకారిగా మారిన స్మిత్ ఆటను మహ్మద్ షమీ కట్టించాడు. 73 పరుగుల వద్ద ఉన్న సమయంలో స్మిత్‌ను అతడు బౌల్డ్ చేశాడు. మిగతా వాళ్లలో మార్నస్ లబుషేన్ ఫర్వాలేదనిపించగా.. అలెక్స్ క్యారీ మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 57 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. అయితే, మైదానంలో పాదరసంలా కదిలిన శ్రేయస్ అయ్యర్ అతడిని రనౌట్ చేశాడు.
షమీకి మూడు వికెట్లు
ఇదిలా ఉంటే.. గ్లెన్ మాక్స్‌వెల్(7)నున అక్షర్ పటేల్ బౌల్డ్ చేయగా.. బెన్ డ్వార్షుయిస్(19), ఆడం జంపా(7), నాథన్ ఎల్లిస్(10), తన్వీర్ సంఘా(1 నాటౌట్) కనీస పోరాటం చేయలేదు. ఫలితంగా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో పేసర్ మహ్మద్ షమీ అత్యధికంగా మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకోగా.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఒక వికెట్ దక్కించుకున్నాడు. స్పిన్నర్లలో వరుణ్ చక్రవర్తి రెండు, ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టారు.
ఛేదిస్తే చరిత్రే..
కాగా ఐసీసీ టోర్నమెంట్లలో 2011 తర్వాత టీమిండియా నాకౌట్ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియాను ఓడించలేకపోయింది. అయితే, ఇప్పుడు మాత్రం ఆసీస్ విధించిన లక్ష్యాన్ని ఛేదిస్తే సరికొత్త రికార్డు సృష్టించింది. కాగా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ లేదా చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లలో ఆస్ట్రేలియా విధించిన అత్యధిక లక్ష్య ఛేదనను పూర్తి చేసిన ఏకైక జట్టు టీమిండియానే.
వన్డే ప్రపంచకప్-2011 టోర్నీలో అహ్మదాబాద్ వేదికగా క్వార్టర్ ఫైనల్లో ఆసీస్ ఇచ్చిన 261 పరుగుల టార్గెట్‌ను నాడు ధోని సేన పూర్తి చేసింది. ఇక తాజాగా ఆస్ట్రేలియా 265 పరుగుల లక్ష్యాన్ని విధించింది. దీనిని ఛేదిస్తే ఆస్ట్రేలియాపై తమకున్న రికార్డును తామే బద్దలుకొట్టినట్లవుతుంది.
చాంపియన్స్ ట్రోఫీ-2025 తొలి సెమీస్- తుదిజట్లు ఇవే
టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.
ఆస్ట్రేలియా
కూపర్ కన్నోలీ, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా.
చదవండి: రోహిత్ శర్మ ‘చెత్త’ రికార్డు!
Comments
Please login to add a commentAdd a comment