
ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్‌కు ముందు టీమిండియాకు భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్(Harbhajan Singh) మూడు కీలక సూచనలు చేశాడు. కంగారూలకు ఏ దశలోనూ అవకాశం ఇవ్వకూడదని.. గత మూడు మ్యాచ్‌ల ఫలితాన్నే ఇక్కడా పునరావృతం చేయాలని కోరాడు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా భారత్ గ్రూప్-ఎ టాపర్‌గా నిలిచింది.
ఈ మెగా టోర్నమెంట్‌కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుండగా.. దుబాయ్(Dubai)లో తమ మ్యాచ్‌లు ఆడుతున్న టీమిండియా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. తొలుత బంగ్లాదేశ్‌ను.. ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్(India vs Pakistan)ను.. అనంతరం ఆఖరి మ్యాచ్‌లో భాగంగా న్యూజిలాండ్ జట్టును ఓడించింది. ఈ క్రమంలో ఈ వన్డే టోర్నమెంట్ తొలి సెమీ ఫైనల్లో భాగంగా మంగళవారం ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది.
అయితే, ఐసీసీ టోర్నీల్లో 2011 తర్వాత నాకౌట్ మ్యాచ్‌లలో ఆసీస్‌దే పైచేయిగా ఉన్న నేపథ్యంలో భారత దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ రోహిత్ సేనకు పలు సూచనలు చేశాడు. ముందుగా ట్రవిస్ హెడ్ ఆట కట్టించాలని.. ఆ తర్వాత గ్లెన్ మాక్స్‌వెల్ లాంటి వాళ్ల పనిపట్టాలని భారత బౌలర్లకు సూచించాడు. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ..
షమీ సాబ్.. ఇప్పటికే చాలా ఎక్కువైంది కదా..
‘‘ముందుగా ట్రవిస్ హెడ్ గురించి మీ మెదళ్లలో గూడు కట్టుకున్న భయాన్ని తీసేయండి. వీలైనంత త్వరగా అతడిని అవుట్ చేయడం మంచిది. షమీ సాబ్.. ఇప్పటికే చాలా ఎక్కువైంది కదా.. హెడ్‌కు ఎక్కువ పరుగులు చేసే అవకాశం అస్సలు ఇవ్వద్దని గుర్తుపెట్టుకోండి.
ఇక నా రెండో సూచన ఏమిటంటే.. గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్ వంటి హార్డ్ హిట్టర్లు ఆస్ట్రేలియా జట్టులో ఉన్నారు. వాళ్లు అలవోకగా సిక్సర్లు, ఫోర్లు బాదుతారు. ఫాస్ట్ పేస్‌లో వాళ్లకు ఎక్కువగా పరుగులు చేసే అవకాశం ఇవ్వకండి.
మూడోది.. ముఖ్యమైన సూచన.. ఇది నాకౌట్ మ్యాచ్ అన్న విషయాన్ని మీరు పూర్తిగా మర్చిపోండి. సాధారణ మ్యాచ్ మాదిరిగానే దీనిని భావించండి’’ అని భజ్జీ రోహిత్ సేనకు సలహాలు ఇచ్చాడు. ఈ మూడు బలహీనతలను అధిగమిస్తే విజయం కచ్చితంగా టీమిండియానే వరిస్తుందని అభిప్రాయపడ్డాడు.
విధ్వంసకరవీరుడు.. చితక్కొట్టాడు
కాగా ట్రవిస్ హెడ్‌కు టీమిండియాపై మంచి రికార్డు ఉంది. ముఖ్యంగా వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో మ్యాచ్ టీమిండియా చేజారడానికి ప్రధాన కారణం ఈ విధ్వంసకరవీరుడు. నాడు అహ్మదాబాద్ మ్యాచ్‌లో భారత స్పిన్ త్రయం కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా.. బౌలింగ్‌ను చితక్కొట్టాడు.
కేవలం 120 బంతుల్లోనే 137 పరుగులు సాధించి ఆసీస్ ఆరోసారి విశ్వవిజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే భజ్జీ హెడ్‌ను టార్గెట్ చేయాలని భారత బౌలర్లకు చెప్పాడు.
టీమిండియాదే గెలుపు
ఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రోహిత్ సేనకు మద్దతు పలికాడు.‘‘గతేడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టు ఇది. వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ కూడా దాదాపుగా వీళ్లే ఆడారు. ఏ రకంగా చూసినా మన జట్టు పటిష్టంగా కనిపిస్తోంది.
ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తిరుగులేని శక్తిగా ఎదిగింది. ప్రత్యర్థి జట్టు ఏదైనా దానిని ఓడించగల సత్తా టీమిండియాకు ఉంది’’ అని పేర్కొన్నాడు. సెమీ ఫైనల్లో భారత్ ఆసీస్‌ను ఓడించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు.
చదవండి: IPL 2025: కొత్త కెప్టెన్ పేరును ప్రకటించిన కేకేఆర్
Comments
Please login to add a commentAdd a comment