
ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్(Steve Smith) టీమిండియా స్పిన్ దళంపై ప్రశంసలు కురిపించాడు. సెమీ ఫైనల్లో తమకు భారత స్పిన్నర్లతోనే ప్రధానంగా పోటీ ఉండబోతోందని పేర్కొన్నాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కి ఆసీస్ రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్(Pat Cummins) దూరం కాగా.. స్మిత్ తాత్కాలిక సారథిగా విధులు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.
ఇక ఈ వన్డే టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు భాగం కాగా.. గ్రూప్-‘ఎ’లో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను ఎలిమినేట్ చేసిన భారత్, న్యూజిలాండ్ సెమీస్ చేరాయి. మరోవైపు.. గ్రూప్-‘బి’లో అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్‌లను నాకౌట్ చేసి సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీ ఫైనల్లో అడుగుపెట్టాయి. ఈ నేపథ్యంలో తొలి సెమీస్ మ్యాచ్‌లో భారత్- ఆస్ట్రేలియా, రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్- సౌతాఫ్రికా పోటీపడనున్నాయి.
వరుణ్ చక్రవర్తి ఒక్కడితోనే కాదు..
ఇక దుబాయ్ వేదికగా టీమిండియా- ఆసీస్ మధ్య మంగళవారం మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో స్టీవ్ స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘భారత స్పిన్ దళం మొత్తం పటిష్టంగా ఉంది. అందుకే వరుణ్ చక్రవర్తి ఒక్కడితోనే కాదు.. ఆ జట్టులోని మిగతా స్పిన్నర్లతోనూ మాకు ప్రమాదం పొంచి ఉంది.
ప్రత్యర్థి జట్టు స్పిన్నర్లను ఎలా ఎదుర్కొంటామన్న విషయంపైనే ఈ మ్యాచ్‌లో మా గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం అత్యంత కష్టతరమైనది. అదే మాకు అతిపెద్ద సవాలు కాబోతోంది. అయితే, మేము వారిపై ఎదురుదాడికి దిగేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం’’ అని స్మిత్ హిందుస్తాన్ టైమ్స్‌తో వ్యాఖ్యానించాడు.
కాస్త సమయం చిక్కింది
ఇక టీమిండియాతో మ్యాచ్ సన్నాహకాల గురించి మాట్లాడుతూ.. ‘‘రెండు రోజుల ముందుగానే దుబాయ్‌కు చేరుకోవడం మాకు సానుకూలాంశం. ప్రాక్టీస్‌కు కావాల్సినంత సమయం దొరికింది. భారత్- న్యూజిలాండ్ మ్యాచ్ ఫలితం వచ్చేంత వరకు మేము ఏ వేదిక మీద ఆడాల్సి వస్తుందో తెలియని పరిస్థితి.
అయితే, అదృష్టవశాత్తూ మేము ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. లేదంటే.. న్యూజిలాండ్ స్థానంలో మేము పాకిస్తాన్ విమానం ఎక్కాల్సి వచ్చేది. ఏదేమైనా దుబాయ్ పిచ్‌ను అర్థం చేసుకునేందుకు మాకు కాస్త సమయం చిక్కింది’’ అని 35 ఏళ్ల స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు.
కాగా చాంపియన్స్ ట్రోఫీ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యమిస్తుండగా.. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా మాత్రం అక్కడకు వెళ్లలేదు. తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడుతోంది. ఇక రెండో సెమీ ఫైనల్‌లో సౌతాఫ్రికా- న్యూజిలాండ్ బుధవారం తలపడనున్నాయి. లాహోర్‌లోని గడాఫీ స్టేడియం ఇందుకు వేదిక.
వరుణ్ మాయాజాలం
చాంపియన్స్ ట్రోఫీకి ముందు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్ సందర్భంగా వరుణ్ చక్రవర్తి వన్డేల్లో అరంగేట్రం చేశాడు. బట్లర్ బృందాన్ని 3-0తో టీమిండియా క్లీన్‌స్వీప్ చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. అంతకు ముందు టీ20 సిరీస్‌లోనూ అదరగొట్టాడు. ఈ క్రమంలోనే చాంపియన్స్ ట్రోఫీ ఆడే భారత జట్టుకు ఎంపికైన వరుణ్.. తొలి రెండు మ్యాచ్‌లలో బెంచ్‌కే పరిమితమయ్యాడు.
అయితే, న్యూజిలాండ్‌తో నామమాత్రపు మ్యాచ్‌లో మాత్రం ఈ మిస్టరీ స్పిన్నర్ దుమ్ములేపాడు. తనకు చెత్త రికార్డు ఉన్న దుబాయ్ మైదానంలో అద్భుత ప్రదర్శనతో ఆ అపవాదు చెరిపేసుకున్నాడు. పది ఓవర్ల కోటా పూర్తి చేసిన వరుణ్ 42 పరుగులు ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు కూల్చాడు.
విల్ యంగ్(22), గ్లెన్ ఫిలిప్స్(12), మైఖేల్ బ్రాస్‌వెల్(2), కెప్టెన్ మిచెల్ సాంట్నర్(28), మ్యాట్ హెన్రీ(2) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తదుపరి ఆసీస్‌తో వరుణ్ చక్రవర్తి ఆడటం దాదాపు ఖాయం కాగా.. స్మిత్ పైవిధంగా స్పందించాడు. కాగా వరుణ్‌తో పాటు కుల్దీప్ యాదవ్, ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఈ జట్టులో ఉన్నారు.
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా
రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా.
ఆస్ట్రేలియా
జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), అలెక్స్ క్యారీ, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడం జంపా, స్పెన్సర్ జాన్సన్, సీన్ అబాట్, ఆరోన్ హార్డీ, తన్వీర్ సంఘా, కూపర్ కన్నోలి.
చదవండి: BCCI: ‘రోహిత్ లావుగా ఉన్నాడు.. కెప్టెన్‌గానూ గొప్పోడు కాదు ’.. స్పందించిన బీసీసీఐ
Comments
Please login to add a commentAdd a comment