
ఆస్ట్రేలియా(India vs Australia)తో సెమీ ఫైనల్లో తుదిజట్టు కూర్పు గురించి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) కీలక వ్యాఖ్యలు చేశాడు. నలుగురు స్పిన్నర్లతో ఆడాలా? వద్దా? అనే అంశంపై సమాలోచనలు జరుపుతున్నామన్నాడు. పిచ్ పరిస్థితులకు తగ్గట్లుగా తమ వ్యూహాలు మార్చుకుంటామని స్పష్టం చేశాడు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) తొలి సెమీస్ మ్యాచ్‌లో రోహిత్ సేన ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది.
దుబాయ్ వేదికగా మంగళవారం జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టాలని ఇరుజట్లు పట్టుదలగా ఉన్నాయి. ఇక ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో గత కొన్నేళ్లుగా కంగారూల చేతిలో తమకు ఎదురవుతున్న చేదు అనుభవాలకు ఈ మ్యాచ్‌తో సమాధానం చెప్పాలని భారత్ ఎదురుచూస్తోంది.
ఇక ఈ వన్డే టోర్నీ లీగ్ దశలో మూడింటికి మూడూ గెలిచి హ్యాట్రిక్ విజయాలతో రోహిత్ సేన పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలో దిగనుండగా.. ఇంగ్లండ్, ఆసీస్ మాజీ క్రికెటర్లు మాత్రం ఒకే వేదికపై ఆడటం వల్ల టీమిండియాకు అదనపు ప్రయోజనాలు చేకూరుతున్నాయని విమర్శలు గుప్పిస్తున్నారు.
విమర్శకులకు రోహిత్ కౌంటర్
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్ మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ.. ‘‘ఒకే నగరంలో ఉంటూ ఒకే వేదికపై అన్ని మ్యాచ్‌లు ఆడటం పట్ల మాపై విమర్శలు వస్తున్నాయి. అయితే ఇదేమీ మాకు అదనపు ప్రయోజనం కలిగించడం లేదు.
ప్రతీసారి పిచ్ కొత్త సవాళ్లు విసురుతోంది. మూడు మ్యాచ్‌లలోను పిచ్ భిన్నంగా స్పందించింది. ఇది మా సొంత మైదానం కాదు. దుబాయ్‌లో మేం తరచుగా మ్యాచ్‌లు ఆడం. మాకు కూడా ఇది కొత్తగానే ఉంది’’ అని కౌంటర్ ఇచ్చాడు.
అతడిలో ప్రత్యేక ప్రతిభ
అదే విధంగా.. ‘‘ఆస్ట్రేలియా ఎప్పుడైనా బలమైన ప్రత్యర్థే. మైదానంలో సహజంగానే కొంత ఉత్కంఠ ఖాయం. అయితే గెలవాలనే ఒత్తిడి మాపైనే కాదు వారిపైనా ఉంది. కీలక ఆటగాళ్లు లేకపోయినా ఆ జట్టులో పోరాటపటిమకు లోటు ఉండదు.
కాబట్టి మా వ్యూహాలు, ప్రణాళికలకు అనుగుణంగా మేం బాగా ఆడటం ముఖ్యం. వరుణ్ చక్రవర్తిలో ప్రత్యేక ప్రతిభ ఉంది. అతడి ఎంపికపై కొన్ని విమర్శలు వచ్చినా సరే, జట్టు ప్రయోజనాల కోసం ప్రత్యేక ఆటగాడిగా చూస్తూ అతడికి సరైన సమయంలో అవకాశం ఇవ్వడం ముఖ్యం.
మా నమ్మకాన్ని అతడు నిలబెట్టుకున్నాడు. అయితే, ఈ మ్యాచ్‌లోనూ నలుగురు స్పిన్నర్లను ఆడించాలనేలా పిచ్ ఊరిస్తోంది. కానీ ఆఖరి నిమిషంలో ఏదైనా జరగవచ్చు’’ అని రోహిత్ శర్మ తమ తుదిజట్టులో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి అవకాశం ఇచ్చే అంశం గురించి ప్రస్తావించాడు.
కాగా గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లతో ఒకే జట్టుతో బరిలోకి దిగిన టీమిండియా.. ఆఖరిగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో మాత్రం అదనపు స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తిని బరిలోకి దింపింది. కివీస్‌తో మ్యాచ్‌లో అతడు ఏకంగా ఐదు వికెట్లు తీయడంతో ఆసీస్‌తో మ్యాచ్‌లో తుదిజట్టు కూర్పు భారత్‌కు తలనొప్పిగా మారింది.
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా
రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా.
బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లతో ఆడిన జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.
న్యూజిలాండ్‌తో ఆడిన జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.
చదవండి: షమీ సాబ్.. ఇప్పటికే చాలా ఎక్కువైంది.. అతడి పని పట్టాల్సిందే..: టీమిండియా దిగ్గజం
Comments
Please login to add a commentAdd a comment