
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ ఐసీసీ వన్డే టోర్నమెంట్లో గ్రూప్ దశలో హ్యాట్రిక్ విజయాలు సాధించిన రోహిత్ సేన.. సెమీస్‌లోనూ అదరగొట్టింది. దుబాయ్‌లో ఆదివారం నాటి ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌కు దూసుకువెళ్లింది.
ఈ నేపథ్యంలో.. ఓవైపు భారత జట్టుపై ప్రశంసలు కురుస్తుండగా.. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఫామ్, భవిష్యత్తు గురించి చర్చలు నడుస్తున్నాయి. ఇటీవలి కాలంలో టెస్టులు, వన్డేల్లో ఫామ్‌లేమితో సతమతమైన హిట్‌మ్యాన్.. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంకెంతకాలం ఆడతాడు?
ఈ క్రమంలో ఆసీస్‌పై టీమిండియా విజయానంతరం హెడ్‌కోచ్ గౌతం గంభీర్ మీడియాతో మాట్లాడగా.. ఇందుకు సంబంధించి ప్రశ్న ఎదురైంది. ‘‘రోహిత్ ఫామ్ సంగతేంటి? అతడు ఇంకెంతకాలం ఆడతాడని మీరనుకుంటున్నారు’’ అని ఓ విలేకరి ప్రశ్నించారు.
ఇందుకు గంభీర్ ఘాటుగానే కౌంటర్ ఇచ్చాడు. ‘‘చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడబోతున్నాం. ఇలాంటి సమయంలో మీ ప్రశ్నకు నేనెలా బదులివ్వగలను. మా కెప్టెన్ వేరే లెవల్ టెంపోతో బ్యాటింగ్ చేస్తూ సహచర ఆటగాళ్లలో సరికొత్త ఉత్సాహం నింపుతూ.. భయం లేకుండా, దూకుడుగా ఆడాలని చెబుతూ ఉంటే నేను ఈ ప్రశ్నకు ఎలాంటి సమాధానం ఇవ్వగలను?
ఇచ్చి పడేసిన గంభీర్!
మీరంతా పరుగులు, సగటు గురించే మాట్లాడతారు. అయితే, కోచ్‌గా నేను కెప్టెన్ ప్రభావం జట్టుపై ఎలా ఉందనేది చూస్తాను. జర్నలిస్టులు, నిపుణులకు గణాంకాలు మాత్రమే కావాలి. కానీ మా కెప్టెన్ జట్టుకు ఆదర్శంగా ఉంటూ.. డ్రెస్సింగ్‌రూమ్‌లో సానుకూల వాతావరణం నింపుతుంటే మాకు ఇంకేం కావాలి’’ అని గంభీర్ సదరు విలేకరి ప్రశ్నపై ఒకింత అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. రోహిత్ శర్మ అభిమానులు గౌతం గంభీర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజమైన కోచ్ ఇలాగే ఉంటాడని.. 37 ఏళ్ల రోహిత్ 2027 వన్డే వరల్డ్‌కప్ వరకు కొనసాగుతాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
264 పరుగులు చేసి ఆలౌట్
ఇక సెమీస్ మ్యాచ్ విషయానికొస్తే.. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మంగళవారం టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది. ట్రవిస్ హెడ్(39) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ స్టీవ్ స్మిత్(73), అలెక్స్ క్యారీ(61) అర్ధ శతకాలతో రాణించారు. ఈ క్రమంలో ఆసీస్ 49.3 ఓవర్లలో 264 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
టీమిండియా బౌలర్లలో భారత బౌలర్లలో పేసర్ మహ్మద్ షమీ(3/48), స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి(2/49), రవీంద్ర జడేజా (2/40) రాణించగా.. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
రాణించిన కోహ్లి, అయ్యర్, రాహుల్
ఆస్ట్రేలియా విధించిన లక్ష్యాన్ని 48.1 ఓవర్లలోనే టీమిండియా పూర్తి చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(28) దూకుడుగా ఆడగా.. విరాట్ కోహ్లి అద్భుత అర్ధ శతకం సాధించాడు. శ్రేయస్ అయ్యర్(45)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్ది 84 పరుగులు సాధించాడు. ఇక కేఎల్ రాహుల్ 34 బంతుల్లోనే 42 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చగా.. హార్దిక్ పాండ్యా(24 బంతుల్లో 28) ధనాధన్ దంచికొట్టాడు.
ఈ క్రమంలో ఆరు వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసిన భారత్ ఆసీస్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. విరాట్ కోహ్లికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
చదవండి: కుల్దీప్ యాదవ్‌పై మండిపడ్డ కోహ్లి, రోహిత్!.. గట్టిగానే తిట్టేశారు
Comments
Please login to add a commentAdd a comment