రోహిత్‌ శర్మ ‘చెత్త’ రికార్డు! | CT 2025 Ind vs Aus: Rohit Sharma Unwanted Record Closes Brian Lara | Sakshi
Sakshi News home page

రోహిత్‌ శర్మ ‘చెత్త’ రికార్డు!

Published Tue, Mar 4 2025 4:14 PM | Last Updated on Tue, Mar 4 2025 4:40 PM

CT 2025 Ind vs Aus: Rohit Sharma Unwanted Record Closes Brian Lara

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma) ఖాతాలో ఓ చెత్త రికార్డు నమోదైంది. వన్డేల్లో వరుసగా అత్యధిక సార్లు టాస్‌ ఓడిన సారథుల జాబితాలోకి హిట్‌మ్యాన్‌ చేరాడు. నెదర్లాండ్స్‌ మాజీ కెప్టెన్‌ పీటర్‌ బారెన్‌ పేరిట ఉన్న రికార్డును అతడు సమం చేశాడు. 

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025(ICC Champions Trophy) టోర్నమెంట్‌ తొలి సెమీ ఫైనల్లో టీమిండియా- ఆస్ట్రేలియా(India vs Australia) మధ్య మ్యాచ్‌సందర్భంగా రోహిత్‌ ఖాతాలో ఈ ఫీట్‌ నమోదైంది.

టాపర్‌గా నిలిచిన టీమిండియా
కాగా ఫిబ్రవరి 19న పాకిస్తాన్‌ వేదికగా మొదలైన ఈ వన్డే టోర్నీలో టీమిండియా మాత్రం దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడుతోంది. గ్రూప్‌-‘ఎ’లో భాగంగా తొలుత బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌లను ఓడించి సెమీస్‌ చేరిన రోహిత్‌ సేన..  గ్రూప్‌ దశలో ఆఖరిదైన న్యూజిలాండ్‌ మ్యాచ్‌లోనూ గెలిచి టాపర్‌గా నిలిచింది. అయితే, ఈ మూడు మ్యాచ్‌లలో రోహిత్‌ శర్మ టాస్‌ ఓడిపోవడం గమనార్హం.

తాజాగా ఆస్ట్రేలియాతో మంగళవారం నాటి సెమీస్‌ మ్యాచ్‌లోనూ రోహిత్‌ను మరోసారి దురదృష్టం పలకరించింది. టాస్‌ గెలిస్తే తమకు నచ్చిన విధంగా మ్యాచ్‌లో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే, గత పదకొండు సందర్భాల్లోనూ రోహిత్‌ టాస్‌ ఓడి ప్రత్యర్థి జట్టుకే మొదటి ఛాయిస్‌ ఇచ్చేశాడు. వరుసగా పదకొండుసార్లు టాస్‌ ఓడిపోయాడు.

ఇక వన్డే ఇంటర్నేషనల్స్‌లో వరుసగా అత్యధిక సార్లు టాస్‌ ఓడిన కెప్టెన్‌గా బ్రియన్‌ లారా ముందున్నాడు. అతడి తర్వాతి స్థానంలో పీటర్‌ బారెన్‌, రోహిత్‌ శర్మ కొనసాగుతున్నారు.

వన్డేల్లో వరుసగా అత్యధిక సార్లు టాస్‌ ఓడిపోయిన కెప్టెన్లు
👉బ్రియన్‌ లారా- వెస్టిండీస్‌ మాజీ సారథి- అక్టోబరు 1998- మే 1999 వరకు- 12 సార్లు టాస్‌ ఓడిపోయాడు.
👉పీటర్‌ బారెన్‌- నెదర్లాండ్స్‌ మాజీ కెప్టెన్‌- మార్చి 2011 నుంచి ఆగష్టు 2013
👉రోహిత్‌ శర్మ- ఇండియా కెప్టెన్‌- నవంబరు 2023- మార్చి 2025*

గ్రూప్‌ దశలోనే ఆ జట్ల ఇంటిబాట
కాగా చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో మొత్తం ఎనిమిది జట్లు భాగమయ్యాయి. ఆతిథ్య జట్టు హోదాలో నేరుగా పాకిస్తాన్‌ అర్హత సాధించగా.. వన్డే వరల్డ్‌కప్‌-2023లో అదరగొట్టిన ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌, అఫ్గనిస్తాన్‌లతో పాటు ఇంగ్లండ్‌ టోర్నీలో అడుగుపెట్టాయి.

ఈ క్రమంలో వీటిని రెండు గ్రూపులుగా విభజించగా గ్రూప్‌-ఎ నుంచి భారత్‌, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌.. గ్రూప్‌-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్‌, ఇంగ్లండ్‌ పోటీపడ్డాయి. 

పాక్‌, బంగ్లాదేశ్‌లతో పాటు.. అఫ్గనిస్తాన్‌, ఇంగ్లండ్‌ గ్రూప్‌ దశలోనే నిష్క్రమించగా.. భారత్‌, న్యూజిలాండ్‌.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీ ఫైనల్‌కు చేరుకున్నాయి. దుబాయ్‌లో మార్చి 4న తొలి సెమీస్‌లో భారత్‌- ఆసీస్‌.. లాహోర్‌ మార్చి 5న రెండో సెమీస్‌లో సౌతాఫ్రికా-న్యూజిలాండ్‌ తలపడేలా షెడ్యూల్‌ ఖరారైంది.

చదవండి: IND vs AUS: ఆ ఒక్కడే కాదు.. వాళ్లంతా ప్రమాదకరమే.. మేము గెలవాలంటే: స్మిత్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement